టిడిపి ఇలాఖాలో అగ్గి రాజేస్తున్న బిజెపి!!

June 16, 2016 at 10:50 am

పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి, బిజెపి కూటమి అగ్గి రగులుతోంది. ఈ కూటమి జిల్లా మొత్తాన్ని కైవశం చేసుకున్నా మిత్రుల మధ్యే బేధాభిప్రాయాలు పెరిగి మంత్రి మాణిక్యాలరావు రాజీనామాకు సిద్ధపడే పరిస్థితులకు దారి తీస్తోంది. తాడేపల్లిగూడెం కేంద్రంగా ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తాజాగా మరోసారి జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమంటూ తీవ్రస్థాయి నిర్ణయాలకు రెడీ అవుతున్నారు. ఈ వ్యవహారాలను మంత్రి మాణిక్యాలరావు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు, జిల్లా ఇన్‌ఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిల దృష్టికి తీసుకువెళ్లారు. బుధవారం స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్‌లో మంత్రి మాణిక్యాలరావుతో మాట్లాడినట్లు తెలుస్తోంది. తొందరపడవద్దని, గురువారం సమావేశమై అవసరమైన నిర్ణయాలు తీసుకుందామని చెప్పినట్లు సమాచారం.

గత కొద్దిరోజులుగా చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు బుధవారం పతాక స్థాయికి చేరుకున్నాయి. మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గాల మధ్య గత కొంతకాలంగా దూరం పెరుగుతూ వచ్చింది. దీనికి కొన్ని పరిణామాలు కూడా మరింత ఆజ్యం పోశాయి. ఏది ఏమైనా ముళ్లపూడి బాపిరాజు తాడేపల్లిగూడెం కేంద్రంగా తన రాజకీయ వ్యవహారాలను ముందుకు తీసుకువెళ్లడం, ఇదే సమయంలో ఈ నియోజకవర్గాన్ని మిత్రపక్షమైన బిజెపికి కేటాయించడం తెలిసిందే. అనంతర పరిణామాల్లో ఇక్కడ విజయం సాధించిన మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముళ్లపూడి బాపిరాజు జడ్పీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. బాపిరాజు నియోజకవర్గంపై పట్టు మరింత పెంచుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. సహజంగానే ఇది మిత్రపక్షమైన బిజెపికి కొంత ఇబ్బందికరంగా మారింది. ఇది రోజురోజుకూ పెరిగి పెద్దవవుతూ ఈ రెండు వర్గాల మధ్య దూరాన్ని మరింత పెంచాయి.

గతంలోనూ బాపిరాజు దూకుడు వ్యవహార శైలిని మంత్రి మాణిక్యాలరావు టిడిపి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం, వారి సర్దుబాటుతో కొంత నెమ్మదించడం జరిగిపోయింది. అయితే ఇటీవల మంత్రి మాణిక్యాలరావు కర్ణాటక రాష్ట్ర పర్యటనకు వెళ్లారు. ఆయన జిల్లాలో లేని సమయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం పరిధిలోని పెంటపాడు పరిసర ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను నిర్వహించారు. బాపిరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా కొనసాగినట్లు సమాచారం. నియోజకవర్గానికి వచ్చిన మంత్రి ఈ పరిణామాలు చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు దృష్టికి ఈ వ్యవహారాలను తీసుకువెళ్లారు.తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని కూడా ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి దృష్టికి కూడా ఈ వ్యవహారాలు తీసుకువెళ్లి ఇవి ఎంత వరకు సమంజసమంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ వ్యవహారం తీవ్రస్థాయికి చేరడంతో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి మాణిక్యాలరావుతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారిన ముద్రగడ పద్మనాభం దీక్ష వ్యవహారంలో ప్రభుత్వం తరఫున పెద్ద మనుషులుగా మంత్రి మాణిక్యాలరావును, సీనియర్ ఐఎఎస్ అధికారి సతీష్‌చంద్రను పంపాలని ప్రభుత్వం భావించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో వున్న పరిస్థితులు, జిల్లాలో తలెత్తిన పరిణామాలు అధికార పార్టీని ఒక రకంగా ఇరకాటంలో పడవేసినట్లే చెప్పాలి.

టిడిపి ఇలాఖాలో అగ్గి రాజేస్తున్న బిజెపి!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts