కొత్త జిల్లాలు – ఇవి చాలా కాస్ట్లీ గురూ

కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంవల్ల ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2వేల కోట్ల వరకు భారం పడనున్నట్టు ప్రాథమిక అంచనాలో తేలినట్టు తెలిసింది.ఎందుకా అంత అనుకుంటున్నారా! ఏర్పాటు కాబోయే 14-15 కోత్హ జిల్లాలకు భవనాల నిర్మాణానికే జిల్లాకు రూ. 100 కోట్ల. ఈ లెక్క ప్రకారమే దాదాపురూ. 14 నుంచి 15 వందల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. దీనికి తోడు భవనాల నిర్మాణం కోసం ఖర్చు చేసే నిధులతోపాటు వాహనాలు, ఫర్నిచర్, సామగ్రి, భవనాల అద్దె తదితర ప్రాథమిక అవసరాలతోపాటు కొత్తగా నియమించనున్న సిబ్బందికి కలిపి మరో రూ. 500 నుంచి రూ. 600 కోట్లవరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.ఆ లెక్కన పై రెండిటికే 2 వేల కోట్లు దాటిపోయింది.ఈ లెక్కలన్నీ కేవలం అంచనాలు మాత్రమె అవి కార్య రూపం దాల్చే సరికి రెండింతలో మూడింతలో కావచ్చు.సొంత ఇల్లు కట్టుకోవడానికి ఈ రోజుల్లో అనుకున్నదానికి రెండింతలవుతుంటే ప్రభుత్వ ఖజానా సోమ్ము అందులోను మన రాజకీయ కాంట్రాక్టర్స్ ఎన్నింతలవుతుందో చెప్పాలా మరి.

ఖర్చుల్ని పక్కన పెడితే కొత్త జిల్లాలు వచ్చే దసరా నుంచే అమలులోకి రానుండటంతో దాదాపు 60 మంది ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి అఖిల భారత సర్వీసు అధికారుల అవసరం ఉండనే వుంది.కొత్తగా 14 జిల్లాలు ఏర్పాటు చేసే పక్షంలో 14 మంది కలెక్టర్లు, 14 మంది జాయింట్ కలెక్టర్లు, 14 మంది జిల్లా రెవిన్యూ అధికారులు (డిఆర్‌ఓ) అవసరం అవుతారు. ప్రస్తుతం రాష్ట్రంలో 444 రెవిన్యూ మండలాలు ఉండగా, కొత్త జిల్లాల ఏర్పాటువల్ల రెవిన్యూ డివిజన్ల సంఖ్య కూడా 20 వరకు పెరగనుండటంతో 20 మంది అదనంగా ఆర్డీవో కేడర్ అధికారులతోపాటు జిల్లా స్థాయి అధికారులు కూడా అవసరమవుతారని అంచనా. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో 8 సెక్షన్లు ఉంటాయని, వీటికి పెద్ద సంఖ్యలో అధికారులు, యుడిసి, ఎల్‌డిసి, క్లరికల్, టైపిస్ట్, గ్రూప్-4 సిబ్బంది అవుసరం అవుతారని లెక్కలు వేస్తున్నారు.ఇలా చెప్పుకుంటూ పోతే అవసరమయ్యే గుమస్తా స్థాయి ప్రభుత్వోద్యోగులనుండి కలెక్టర్ ల వరకు లిస్టు చాంతాడంత వుతుంది.ఇక్కడ కొసమెరుపేంటంటే బడ్జెట్‌లో కొత్త జిల్లాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించని విషయం ఈ సందర్భంగా గమనార్హం.