చంద్రబాబు చైనా నుంచి ఏం తీసుకొస్తారు?

రాజధాని నిర్మాణమంటే ఏ నాయకుడికైనా కత్తి మీద సాము లాంటిది. నాయకుడిలోని నాయకత్వ లక్షణాల్ని సవాళ్ళే బయటపెడతాయి. సంక్షోభాల్ని అవకాశాలుగా మలచుకోవడం నాయకుల లక్షణం. ఓ రాజధానిని నిర్మించవలసి వస్తుందని తెలుగు రాజకీయాల్లో ఏ నాయకుడూ అనుకుని ఉండడు. హైదరాబాద్‌ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు పాత్ర అద్వితీయం. అంతకు ముందు, ఆ తరువాత కూడా ముఖ్యమంత్రులుగా పనిచేసినవారు హైదరాబాద్‌ అభివృద్ధి కోసం పనిచేశారు. రాజధాని అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అయితే కొత్త రాష్ట్రానికి రాజధాని పెను సవాల్‌. ఆ సవాల్‌ని చంద్రబాబు స్వీకరించారు.

రెండేళ్ళలో రాజధానిలో ఏమీ జరగకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతున్నప్పటికీ ప్రణాళికా బద్ధంగా రాజధాని నిర్మించలేకపోతే సమస్యలొస్తాయి. దీనికోసం వివిధ దేశాలతో చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారు. సింగపూర్‌, జపాన్‌, చైనా తదితర దేశాలు అమరావతిలో పాలుపంచుకోనున్నాయి. దీనికోసమే చంద్రబాబు విదేశాల్లో వీలు చిక్కినప్పుడల్లా పర్యటించడం జరుగుతోంది. చైనా దేశంలో పర్యటిస్తున్న చంద్రబాబు, ఆ దేశం నుంచి రాజధాని నిర్మాణానికి సహకారంతోపాటుగా ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాజెక్టులు చేపట్టేలా ఆ దేశ వ్యాపారవేత్తల నుంచి కూడా హామీలు పొందుతున్నారు. అయితే హామీలు నీటి మీద రాతలుగా మారకూడదు. ఇప్పటివరకు జరిగింది వేరు, ఇక నుంచి జరగనున్నది వేరు. తాత్కాలిక సచివాలయ నిర్మాణంతో అమరావతిలో యాక్టివిటీ మొదలైంది. కాబట్టి, చైనా నుంచి చంద్రబాబు తీపి కబురు తీసుకురావొచ్చు.