చంద్రబాబు నాన్చుడు-కెసిఆర్ దూకుడు..

తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ దూకుడుగా వెళుతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా, పార్టీ ఫిరాయించిన నేతలకు పదవులు కూడా కట్టబెడుతున్నారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అలాగే మంత్రి అయ్యారు. అయితే చంద్రబాబు మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఆశావహుల్ని వెయిటింగ్‌లో పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రబాబుని కవ్వించడానికి కెసియార్‌ ఇంకోసారి పదవుల పందేరం స్టార్ట్‌ చెయ్యనున్నారని సమాచారమ్‌. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కెసియార్‌ భావిస్తున్నారట. అలాగే మాజీ ఎంపీ వివేక్‌కి ఉప ముఖ్యమంత్రి ఇవ్వనున్నారని గుసగుసలు వినవస్తున్నాయ్‌. ఒకేసారి రెండు పదవులు, అది కూడా పార్టీ ఫిరాయించినవారికి ఇవ్వడం ద్వారా చంద్రబాబుపై కెసియార్‌ ఒత్తిడి పెంచుతున్నారు.

పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించినా, అలా ఫిరాయించిన నేతలకు పదవులు ఇవ్వడంలో చంద్రబాబు ఆసక్తి చూపడంలేదు. ఎందుకంటే పదవులిస్తే సమస్యలొస్తాయి. తెలంగాణ పరిస్థితి వేరు. ఆంధ్రప్రదేశ్‌లో సమీకరణాలు వేరు అందులోనా చంద్రబాబు రాజకీయం అంతకంటే ప్రత్యేకం. కెసియార్‌ దూకుడుతో 2019 ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఇబ్బందులున్నాయి. ఆ ఇబ్బందులతో ప్రజల్లో ఇప్పటికే అసహనం తారా స్థాయిలో ఉందన్నది వాస్తవం .ఈ పరిస్థితుల్లో ఫిరాయింపు నేతలకి పదవులు కట్టబెడితే అసహనం తేనే తుట్టె ని కదిపినట్టే అవుతుంది.అందుకే చంద్రబాబు తనకి బాగా ఇష్టమైన నాన్చుడు గేమ్ ఆడుతున్నారు. ఇప్పటికే రక రకాల హామీలపై జంప్ అయిన నేతలు వెనక్కి వెళ్ళలేక ముందుకెళ్ళే పరిస్థితి లేక తలలు పట్టుకుంటున్నారు. కెసియార్‌ మాత్రం దూకుడులో తనకెవరూ సాటి రారని నిరూపించేసుకోవడం చర్చించుకోదగ్గ అంశం.