జాక్ పాట్ కొట్టనున్న వివేక్..

రాజు తలచు కుంటే దెబ్బలకి కరువా అన్నట్టుంది తెలంగాణా రాజకీయ సిత్రం.కెసిఆర్ కరుణ వుంటే చాలు రాత్రికి రాత్రి ఏ జాక్ పాట్ అయినా తగలోచ్చు.ఒకసారి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వచ్చి చేరి.. తిరిగి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లిపోయి.. ఎన్నికలను ఆ పార్టీ నుంచే ఎదుర్కొని తిరిగి ఇప్పుడు టీఆర్ ఎస్ లోకి వచ్చి చేరిన కాకా తనయుడు వివేక్ కు ఇప్పుడు జాక్ పాట్ తగలనుందని టిఆర్ ఎస్ లో టాక్. ప్రస్తుతానికి మాజీ ఎంపీ.. పెద్ద వ్యాపార వేత్త అనే హోదాలు తప్ప మరేమీ లేని ఆయన తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి కానున్నారని ప్రచారం జరుగుతోంది. దళిత కోటాలో ఆయన కేసీఆర్ కు డిప్యూటీ అవుతారని సమాచారం!

మరి ఇప్పటికే ఇద్దరు డిప్యూటీలు ఉన్నారు కేసీఆర్ కు. ఒక ముస్లిం, ఒక దళిత ప్రజా ప్రతినిధిలు డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాల్లో ఉన్నారు. మరి ఈ మూడో డిప్యూటీ మాట ఏమిటి? అంటే… ఒక డిప్యూటీని కేసీఆర్ రీప్లేస్ చేయనున్నాడని తెలుస్తోంది. అంటే.. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న కడియం శ్రీహరిని తప్పించి ఆ పదవిని వివేక్ కు అప్పగించనున్నారని సమాచారం.ఎమ్మెల్సీ హోదాను అప్పగించి.. వివేక్ ను కేబినెట్ లోకి తీసుకుని.. డిప్యూటీ సీఎం పదవిని అప్పగించనున్నారట కేసీఆర్. మరి కడియం శ్రీహరి పరిస్థితి ఏమిటి? ఎంపీగా ఉన్న ఆయనను ఎమ్మెల్సీ గా చేసి ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి భవితవ్యం ఏమిటి? అని ఆరా తీస్తే.. ఆయనను శాసనమండలి చైర్మన్ గా పంపాలని తెలంగాణ ముఖ్యమంత్రి భావిస్తున్నారట! మరి ఇప్పటికే తెలంగాణ శాసనమండలికి స్వామిగౌడ్ చైర్మన్ గా ఉన్నారు. ఆయనను ఆ స్థానం నుంచి తొలగించడం ఖాయమని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన స్వామి గౌడ్ కు ఇక సెలవిప్పించి.. ఎమ్మెల్సీ హోదాలో ఉన్న కడియం శ్రీహరిని ఆ స్థానంలోకి పంపి.. కడియం స్థానంలోకి వివేక్ ను తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నాడని తెలుస్తోంది.

ఇప్పటికే ఒక సారి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వచ్చి వెనక్కు వెళ్లిపోయినా.. ప్రత్యక్ష ఎన్నికల్లో వీళ్లు వ్యక్తిగతంగా కూడా చాటిన సత్తా ఏమీ లేకపోయినా.. కేసీఆర్ మాత్రం కాకా తనయులను బాగా ఆదరిస్తున్నట్టే. ఒకటికి రెండు సార్లు ఎన్నికల్లో ఓటమి పాలైనా.. తెలంగాణ ఉద్యమం కోసం చేసింది ఏమీ లేకపోయినా..డిప్యూటీ సీఎం పదవి స్థాయికి వెళ్లడం అంటే మాటలు కాదు కదా!అంతా కేసీఆర్ మాయ.