టి కాంగ్రెస్ కి భారమవుతున్న ఆ ఇద్దరు!

తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారే తప్ప, తెలంగాణలో పార్టీని బాగు చేయలేకపోతున్నారు. రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యత ఆయా రాష్ట్రాల్లోని పార్టీ నాయకత్వాలదే. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసు పార్టీకి నాయకత్వమే లేదు. అది విభజనతో జరిగిన నష్టం. తెలంగాణలో అలా కాదు కదా. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ దెబ్బకి కాంగ్రెసు నాయకత్వం కుదేలైంది. ‘మేం తెలంగాణ ఇచ్చినా, మీరు పార్టీని బాగు చేయలేకపోతున్నారు’ అని తెలంగాణ నుంచి వెళ్ళిన ప్రతి నాయకుడికీ సోనియాగాంధీ తలంటు పోసేస్తున్నారట. ఢిల్లీ నుంచి ఎంతమంది కాంగ్రెసు ప్రముఖులు తెలంగాణకు వచ్చి, పార్టీ బలోపేతం కోసం చర్చలు జరిపినా, అవేవీ సత్ఫలితాలను ఇవ్వడంలేదు. ఢిల్లీకి వెళ్ళడం, ఉన్న నాయకులపై ఫిర్యాదులు చేయడంతో తెలంగాణ నాయకులు పార్టీని తెలంగాణలో ఇంకా నిర్వీర్యం చేసేస్తున్నారు.

ప్రధానంగా కాంగ్రెసు పార్టీకి విహెచ్‌, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి లాంటి నాయకులు భారంగా మారిపోయారు. అధిష్టానంతో ఉన్న సంబంధాలను అడ్డుపెట్టుకుని, స్థానిక నాయకత్వంతో ఆటలాడుకుంటున్నారు. అయితే అధిష్టానంతో తమకున్న సంబంధాలను పార్టీ కోసం వినియోగించకపోవడం శోచనీయం. డి.శ్రీనివాస్‌కి కాంగ్రెసు అధిష్టానం వద్ద ఎంతో పేరుండేది. ఆయన కూడా పార్టీని వదిలి టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళిపోయారు. విహెచ్‌, పాల్వాయి వంటివారు కూడా సమీప భవిష్యత్తులో కాంగ్రెసుని ముంచేయవచ్చు కూడా. వారికి టిఆర్‌ఎస్‌ నుంచి ఆఫర్‌ వచ్చిన మరుక్షనం కాంగ్రెసు పార్టీని వదిలిపెట్టడం ఖాయం. అయినా ఎందుకు ఢిల్లీ చుట్టూ ఆ నాయకులు చక్కర్లు కొడుతున్నట్లు?