ప్రకాశం ఫిరాయింపులు – ఆ ఇద్దరికీ సవాలే

రాజకీయ, ఆర్ధిక రంగాల్లో బలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో అధికార-ప్రతిపక్ష పార్టీల్లో ముఠాల ముసలం మొదలయింది. తెలుగుదేశం, వైఎస్సార్‌సీపీలో ముఠా రాజకీయాలు అధినాయకత్వాలకు తలనొప్పిగా మారాయి. వారిని నియంత్రించలేని పరిస్థితి అధినేతలకు ఎదురవుతోంది.ఇటీవలి కాలంలో వైసీపీ నుంచి చేరిన గొట్టిపాటి రవి (అద్దంకి), అశోక్‌రెడ్డి (గిద్దలూరు), పాలపర్తి డేవిడ్‌రాజు (యరగొండపాలెం), పోతుల రామారావు (కందుకూరు)కు, వారి నియోజకవర్గాల్లో పాత కాలం నుంచి టిడిపిలో పనిచేస్తున్న ఇన్‌చార్జ్‌లు, మండల నేతలకు మధ్య సంఘర్షణ వాతావరణం ఏర్పడింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్-ఇన్చార్జి కరణం బలరాం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోంది. మినీ మహానాడు వేదికపైనే గొట్టిపాటిపై కరణం దాడిచేయడంతో టిడిపి లో ముఠాల ముసలం ముదిరినట్టయింది. నిజానికి కరణం బలరాం హవాకు గొట్టిపాటి తాళలేకపోతున్నారు. గొట్టిపాటి టిడిపిలో చేరిన వెంటనే కరణం ఐదు మండలాల అధికారుల సమక్షంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి తాను చెప్పినట్లే చేయాలని, లేకపోతే వెళ్లిపోవచ్చని బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యే గొట్టిపాటి ప్రారంభించాల్సిన ప్రభుత్వ కార్యక్రమాలకు కరణం ముందుగానే వచ్చి, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి పోతున్నారు. అధికారులు కూడా కరణం అనుమతి లేనిదే ఏ పనీ చేయడం లేదు. దీనితో గొట్టిపాటి గ్రామాల్లోకి వెళ్లలేకపోతున్నారు. తాజాగా అద్దంకి సీఐగా హైమారావును గొట్టిపాటి బదిలీ చేయించుకున్నారు. ఆ విషయం తెలియడంతో కరణం రంగంలోకి దిగి, ఇప్పుడు పనిచేస్తున్న బేతపూడి ప్రసాద్‌నే కొనసాగించేలా చూశారు. గొట్టిపాటి పార్టీలో చేరేముందు అద్దంకి సీఐ బదిలీ షరతు కూడా ఉంది. ఇప్పుడు దానిని నెరవేర్చకపోవడంతో ఆయన కంగుతినాల్సి వచ్చింది. మండల స్థాయిలో కూడా అధికారుల దగ్గర ఎలాంటి పనులు కాకపోవడంతో ఆయన అనుచరులు తలలు పట్టుకుంటున్నారు.

ఇక గిద్దలూరులో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి-ఇన్చార్జి అన్నా రాంబాబు మధ్య కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. తాజాగా గుమ్మలపల్లిలో రెండు వర్గాల మధ్య రాళ్ల యుద్ధం జరిగింది. దీనిని పెద్దగా చూపించవద్దని స్థానిక పోలీసులు మీడియాకు మెసేజ్‌లు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బదిలీల విషయంలో కూడా ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది. తాడోపేడో తేల్చుకునేందుకు రాంబాబు సిద్ధమవుతున్నారు. అటు వైసీపీలోనూ ముఠాల ముసలం ముదురుపాకాన పడుతోంది. జగన్ సమీప బంధువుకు, జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టాలన్న నిర్ణయంపై వైసీపీ నియోజకవర్గ నేతలు భగ్గుమంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టిడిపిలోకి వెళ్లేందుకు కారణమయిన నేతకు, కేవలం బంధువుకారణంతో ఎలా జిల్లా బాధ్యతలు అప్పగిస్తారని మండిపడుతున్నారు. తాజా పరిణామాలతో వైసీపీలోకి రావాలని భావిస్తోన్న మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి పునరాలోచనలో పడ్డారు.అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన గరటయ్య కూడా తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. జిల్లా బాధ్యతలు అప్పగిస్తారని భావిస్తోన్న నేతకు, వైసీపీ సీనియర్ నేత ముక్కుకాశిరెడ్డి, కెపి కొండారెడ్డి, సాయికల్పనకు, పార్టీలోకి రావాలనుకుంటున్న మహీధర్‌రెడ్డి, ఉగ్రనరసింహారెడ్డికి ఏ మాత్రం పొసగదని తెలిసినప్పటికీ, ఆయనకే పగ్గాలు అప్పగించడం బట్టి జగన్‌లో మార్పు రాలేదని అర్ధమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సదరు నాయకుడు జిల్లా అధ్యక్షుడయితే నియోజకవర్గంలో తమకు వైసీపీ నుంచి ఇబ్బందులు ఉండవని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి తన అనుచరులతో వ్యాఖ్యానిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోకేష్‌తో రాయబారం నడిపిన వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడంతోపాటు, ఏ ఒక్కరితో సమన్వయం లేని వ్యక్తికి పదవి ఇస్తే జిల్లాలో పార్టీ ఎలా పటిష్టపడుతుందని వైసీపీ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. కాగా, వైసీపీలో చేరాలని భావించిన మాజీ మంత్రి మహీధర్‌రెడ్డితోపాటు, వైసీపీలో ఉన్న ముక్కుకాశిరెడ్డితో టిడిపి నేతలు చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో ఆయా నియోజకవర్గాల్లోని అధికారులు బెంబేలెత్తుతున్నారు. ఎవరి మాట వింటే ఏమవుతుందేమోనన్న భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే అద్దంకిలో ఒకరు, తాజాగా గిద్దలూరులో ఒక అధికారి సెలవుపై వెళ్లిపోయారు.