దాసరి అక్కడ వెతుక్కుంటున్నారేమో

పాపులారిటీని దాసరి నారాయణరావు రాజకీయాల్లో వెతుక్కోవాలని అనుకుంటున్నారు. ఈ తరం దర్శకులతో పోటీ పడలేకపోతున్నారు ఆయన. తెలుగు సినీ రంగంలో దర్శకుడిగా దాసరి ఎన్నో పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నా, నేటితరం సినిమాలు వేరు. ప్రేక్షకుల అభిరుచి మారింది. అప్‌డేట్‌ కాలేకపోవడమే దర్శకత్వంపై దాసరి శీతకన్నేయడానికి కారణం. కాపు సామాజిక వర్గం రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటానికి దాసరి మద్దతు పలికారు. మద్దతుతోనే సరిపెట్టకుండా కాపు సామాజిక ప్రముఖులందర్నీ ఒక్క తాటిపైకి తెచ్చి, నాయకత్వం వహించడం జరుగుతోంది. ఇదంతా 2019 ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతోనేననట. దాసరి రాజకీయ వ్యూహం చూసి కాపు సామాజిక వర్గామే ఆశ్చర్యపోతోంది. వైఎస్‌ఆర్‌సిపి నుంచి రాజకీయంగా కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించాలని ఆయన అనుకుంటున్నట్లుగా సమాచారమ్‌. ఇంతకు ముందు వరకు కాంగ్రెసులో ఉండేవారాయన. యుపిఏ ప్రభుత్వం బొగ్గు కుంభకోణం అభియోగాలు ఎదుర్కొన్న తరువాత, ఆ అభియోగాల్లో దాసరి కూడా ఇరుక్కుపోయారు. దాంతో, కాంగ్రెసు పార్టీకి దూరమయ్యారు దాసరి నారాయణరావు. జగన్‌ విజ్ఞప్తితో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరయ్యారు దర్శకరత్న. 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ నుంచే పోటీ చేస్తారా? తిరిగి కాంగ్రెసులోకి వెళతారా? అనే సస్పెన్స్‌ కొనసాగుతోంది. కొత్త రాజకీయ కుంపటి గురించి కూడా ఆలోచన చేస్తున్నా ఇప్పుడున్న రాజకీయాల్లో అది అంత తేలిక కాదని ఆయనకీ తెలుసు.