బాబ్బాబు ఇంకోసారి రెఫరెండం పెట్టరూ ప్లీజ్!!

తమ దాకా వస్తే కానీ ఏదీ బోధపడదన్నట్టు తయారైంది బ్రిటీష్ సామాన్య ప్రజల గోడు.అందరూ విడిపోదామంటున్నారు కాబట్టి మనం ఒక రాయి వేద్దాం అన్న చందాలో అసలు దేనికి ఓటు వేస్తున్నామో దాని పర్యవసానం ఏంటో తెలీకుండానే సగం మందికి పైగా యూరో జోన్ నుండి విడిపోవడానికి మద్దతుగా ఓటేశారు.తీరా ఫలితాలు వచ్చి పౌండ్ 30 ఏళ్ల వెనక్కి వెళ్లి ఒక్కొక్కరి ఆస్తి నిమిషాల్లో సగానికి కరిగిపోవడంతో బ్రిటిషర్లకి కళ్ళు బైర్లు కమ్మాయి.చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాగా ఇప్పుడు ఇంకోసారి రెఫరెండం నిర్వహించ మని మొరపెట్టుకుంటున్నారు.

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు రావాలని బ్రెగ్జిట్‌లో దిగ్భ్రాంతికరమైన తీర్పు వచ్చిన నేపథ్యంలో మరోసారి రెఫరెండం నిర్వహించాలని బ్రిటిష్ పార్లమెంటుకు ప్రజల నుంచి పిటిషన్ అందింది. ఈ పిటిషన్‌పై పదిలక్షల మంది సంతకాలు చేయడం విశేషం. ఏదైనా పిటిషన్‌పై లక్షకంటే ఎక్కువమంది సంతకాలు చేస్తే చర్చ చేపట్టాలనే నిబంధన ఉన్న దృష్ట్యా దీనిపై పార్లమెంటు తప్పనిసరిగా చర్చ చేపట్టాల్సి ఉంటుంది. ఈయూ నుంచి బయటకు రావాలనే అంశంపై జరిగిన బ్రెగ్జిట్ రెఫరెండం 52-48 శాతం ఓట్లతో నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే లండన్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ తదితర ప్రాంతాలలోని ప్రజలు అధికశాతం ఈయూలో ఉండిపోవాలని ఓటు వేశారు. రెఫరెండం ఫలితం నచ్చనివారు ఇప్పుడు మరోసారి పోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.విలియం ఆలివర్ హీలీ అనే పెద్దమనిషి ఈ పిటిషన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మొత్తం పోలైన ఓట్లు 75 శాతంలోపు, మెజారిటీ ఓట్లు 60 శాతంలోపు ఉంటే మళ్లీ రెఫరెండం నిర్వహించాలనే నిబంధనను అమలులోకి తేవాలని దిగువ సంతకం చేసిన మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంటూ ఆయన రూపొందించిన పిటిషన్‌పై సంతకాలు శనివారం ఉదయానికి పదిలక్షలు దాటాయి. గురువారం నాటి పోలింగ్‌లో 72 శాతం ఓట్లు మాత్రమే పోలైన దృష్ట్యా ఈ పిటిషన్ ప్రాముఖ్యం సంతరించుకున్నది. పార్లమెంటరీ పిటిషన్‌లకోసం ఉద్దేశించిన వెబ్‌సైట్ ఒక్కసారిగా ఎక్కువమంది లాగిన్ కావడంతో క్రాష్ అయిందని తెలుస్తున్నది.

పిటిషనర్ల కోరిక మేరకు నిబంధనలు రూపొందించి, పాతతేదీ నుంచి అమలు చేసే అవకాశం ఏమేరకు ఉందా? అనేది ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. వచ్చే మంగళవారం పార్లమెంటరీ పిటిషన్ల కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం జరగొచ్చు. 2014లో స్కాట్లాండ్ వేర్పాటుపై జరిగిన రెఫరెండం వీగిపోయినప్పుడు కూడా ఇలాంటి పిటిషన్లే వచ్చాయి. మారిన పరిస్థితుల్లో మరోసారి స్కాట్లాండ్ రెఫరెండం జరపాలని స్కాటిష్ ముఖ్యమంత్రి నికోలా స్టర్జెన్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు లండన్ మేయర్ లండిపెండెన్స్ (లండన్+ఇండిపెండెన్స్) పేర మరో పిటిషన్ ముందుకు తెస్తున్నారు. బ్రిటన్ రాజధాని లండన్‌ను స్వతంత్రదేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పిటిషన్ నిర్వాహకుడైన జేమ్స్ ఓమాలీ లండన్ ప్రపంచ నగరమని, అది యూరప్ గుండెకాయలా ఉండాల్సిందేనని అన్నారు. ఇతర నగరాల కన్నా భిన్నంగా లండన్ ఈయూలో ఉండిపోవాలని 60 శాతం మెజారిటీతో తీర్పు చెప్పింది.