మళ్ళీ టీం ఇండియా ని నడపనున్న పంచ పాండవులు!

ఒకనాటి టీమ్మేట్స్.. స్నేహితులు.. పాంచ్ పటాకా లాంటి ఆ స్టార్స్ టీమిండియాను మరోసారి ముందుండి నడిపించడానికి రెడీ అయ్యారు. 20వ శతాబ్దంలో పుట్టి ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇండియన్ క్రికెట్ కు జోష్ ఇచ్చిన మేటి క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, సౌరభ్ గంగూలీ, ద్రావిడ్, కుంబ్లే, లక్ష్మణ్. ఈ ఐదుగురు సుమారు దశాబ్దన్నర కాలం పాటు ఇండియన్ క్రికెట్ ను ఒక్కటిగా నడిపించారు. తాజాగా ఇండియన్ క్రికెట్ కు చీఫ్ కోచ్ గా కుంబ్లేను ఎంపిక చేయడంతో ఈ ఐదు పేర్లు తెరమీదకు వచ్చాయి. క్రికెట్ అంటే ప్రాణం పెట్టే ఇండియాలో ఈ ఐదుగురికీ మరింత ప్రాణం పెడతారు ఫ్యాన్స్.
జంబోను చీఫ్ కోచ్ గా ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించారు అడ్వైజరీ బోర్డు మెంబర్లు సౌరభ్, సచిన్, లక్ష్మణ్. జూనియర్ కోచ్ గా ద్రావిడ్ ఉండనే ఉన్నాడు. ఇలా వీరందరూ భారత క్రికెట్ ను సరికొత్త దారిలో నడిపించబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇండియన్ క్రికెట్ టీమ్ వన్డే, టెస్ట్ కెప్టెన్లు ధోనీ, కోహ్లీలతో కలిసి పని చేయడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు కుంబ్లే.
క్రికెటర్ గా అసాధారణ రికార్డులు తన పేర రాయించుకున్నాడు కుంబ్లే. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్సులో 10 వికెట్లు తీసిన ఘనత కుంబ్లే సొంతం. లేట్ వయస్సులో టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ గా రికార్డు సృష్టించాడు. 2002లో విండీస్ తో మ్యాచ్ లో తలకు కట్టుతో కుంబ్లే వేసిన 14 ఓవర్లను ఎవరూ మర్చిపోలేరు. అలాంటి క్రికెటర్ టీమిండియాను నడిపించడానికి ముందుకు రావడం… కొత్త తరానికి మరింత స్ఫూర్తిదాయకమవుతుందని భావిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు