మోదీ ఉన్న కారు నడిపిన దేశాధ్యక్షుడు

ఐదు దేశాల పర్యటనలో భాగంగా అమెరికా నుంచి మెక్సికో వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. భారత్‌ న్యూక్లియర్‌ సప్లైయర్‌ గ్రూప్‌(ఎన్‌ఎస్‌జీ)లో చేరేందుకు మెక్సికో మద్దతు పలికింది. ఇరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు, సంయుక్త మీడియా సమావేశం అనంతరం మెక్సికో అధ్యక్షుడు పెనా నీటో స్వయంగా మోదీ ఉన్న కారు నడిపారు. ప్రధాని మోదీని డిన్నర్‌ కోసం ‘క్వింటోనిల్‌’ రెస్టారెంట్‌కు తీసుకెళ్లారు. మెక్సికో అధ్యక్షుడు కారు డ్రైవ్‌ చేస్తున్న ఫోటోను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రత్యేక అతిథిని స్వయంగా రెస్టారెంట్‌కు తీసుకెళ్లిన ఆయన మోదీతో కలిసి శాఖాహార భోజనం చేశారు. గత 30ఏళ్లలో మెక్సికోను సందర్శించిన తొలి ప్రధాని మోదీ. గతంలో 1986లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మెక్సికోలో పర్యటించారు.