రెచ్చిపోతున్న అధికార నేతలు

రాష్ట్రంలో ‘అధికార’ రౌడీలు పెచ్చరిల్లిపోతున్నారు. సెటిల్‌మెంట్లు, దాదాగిరీతో విచ్చలవిడిగా ప్రవరిస్తున్నారు. కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌, దౌర్జన్యాలు, బెదిరింపులు హెచ్చరికలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులపైనా దాడులకు దిగుతున్నారు. ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రౌడీషీటర్లు ఎస్‌ఐని, అడ్డుకున్న కానిస్టేబుళ్లను చితకబాదారు. విజయవాడ కార్పొరేషన్ లో టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ హోంగార్డును తీవ్రంగా కొట్టాడు. నూజివీడు ప్రాంతంలో సెటిల్‌మెంట్‌ పేరుతో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడు వృద్ధుడి మరణానికి కారణమయ్యారు. ఇక భూకబ్జాలు, ఇళ్లపైకి వెళ్లి అడ్డుకున్న వారికి కొట్టడాలు షరా మామూలుగా మారిపోయాయి.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వెళ్లినా వారినీ బెదిరించారు. ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలపై కేసులు, మరీ ముఖ్యంగా ఎస్‌సి, ఎస్‌టి ఎట్రాసిటీ కేసులు నమోదు చేయిస్తున్నారు. లొంగదీస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం రాష్ట్రంలో ప్రశాంతత ఉండాలని, అంతా 80 శాతానికి పైబడి ఆనందంంతో ఉండాలని, అరాచకాలకు పాల్పడిన వారి గుండెళ్లో నిద్రపోతానని ప్రతిరోజూ చెబుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, రౌడీషీటర్లే ప్రజలపై దాడులకు దిగుతున్నారు. ఏకంగా పోలీసులనే కొడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కైతే అధికారులే టార్గెట్‌. దాడికి దిగి భయప్రభాంతులకు గురిచేయడమే అతని విధి. అటవీశాఖ, రెవెన్యూశాఖ అధికారులు, ఇరిగేషన్‌ అధికారులు ఎవరైనా అతనికి లెక్కుండదు. సిఎం చేసిన హెచ్చరికలను ఏ మాత్రమూ ఖాతరు చేయడం లేదు. అసలు సిఎం మాటలను ఆ పార్టీకి చెందిన నాయకులు పట్టించుకుంటున్నారా ? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటనల సమయంలో పోలీసులే టార్గెట్‌గా టిడిపి కార్యకర్తలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. రౌడీయిజాన్ని ప్రోత్సహించబోమని చెబుతూనే రౌడీషీటర్లకు ఆ పార్టీ మంత్రులతో సన్మానాలు చేయిస్తున్నారు. నూజివీడులో దాడికి పాల్పడిన పాలేటిఉమామహేశ్వరరావు అలియాస్‌ పింకి అనే రౌడీషీటర్నయితే ఏకంగా గతంలో హోంమంత్రే సన్మానించారు. సిఎంను కలిశారు. దీంతో అతని ఆగడాలకు అంతే లేకుండా పోయింది. విజయవాడలో టిడిపి ఫ్లోర్‌లీడర్‌ హరిబాబు ఇంకొంచెం ముందడుగు వేసి మీడియాపైనే బెదిరింపులకు దిగారు. తనను వెళ్లనివ్వలేదని హోంగార్డును ఇష్టం వచ్చినట్లు కొట్టారు. విధుల్లో ఉన్న పోలీసులకు ఒత్తిడులు ఉంటాయి. ఒకవేళ తనకు అభ్యంతరం కలిగిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి మినహా చేయిచేసుకోకూడదు. అయితే టిడిపి నాయకులు తాము చేసిందే వేదమన్నట్లు చేసుకుపోతున్నారు. పోలీసుస్టేషన్లలో సెటిల్‌మెంట్లన్నీ దాదాపు టిడిపి నాయకులవే ఉంటున్నాయి. అధికారపార్టీ కావడంతో పోలీసులూ ఏం మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని కేసుల్లో నేరుగా మంత్రులే జోక్యం చేసుకుంటున్నారు. విజయవాడ నగరంలో జరిగిన కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ కేసులో టిడిపి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులే ఎక్కువగా ఉన్నారు. వీటితోపాటు మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులపై మానసిక దాడులకు దిగుతున్నారు. ప్రతిపక్షం ఉండకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారు.