విషపు దీక్షలు-వింత చేష్టలు

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంలో భాగంగా ఇప్పటికే ఓసారి తన ఇంట్లో నిరామార దీక్ష చేశారు ఈ మధ్యకాలంలో. అయితే ఆ దీక్ష ఫలించలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ దక్కకుండానే దీక్ష విరమించారు ముద్రగడ అప్పట్లో. మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వ తీరుకు నిరసనగా ముద్రగడ పద్మనాభం, తన భార్యతో కలిసి నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే పోలీసులు ఆయన్ని వివిధ కేసుల్లో అరెస్టు చేసేందుకు ప్రయత్నించినా, అందుకాయన అనుమతించడంలేదు. ఇంట్లోకి వెళ్ళి గడియ వేసుకున్న ముద్రగడ పద్మనాభం, పోలీసులను బెదిరిస్తున్నారు. చేతిలో పురుగుల మందు డబ్బా పెట్టుకుని, బలవంతంగా ఇంట్లోకి పోలీసులు చొరబడితే ఆ పురుగుల మందు తాగి చచ్చిపోతానని హెచ్చరించడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

నిరాహార దీక్ష అనేది ప్రజాస్వామ్యంలో ఓ నిరసన ప్రక్రియ. దాని హుందాతనం ఇటీవలి కాలంలో చాలామంది నాయకులు చెడగొట్టారు. పొట్టి శ్రీరాములులా నిరాహార దీక్ష చేసే నాయకులు ఈరోజుల్లో కనిపించరు. నిరాహార దీక్ష అర్థాన్నే మార్చేస్తున్నారు నేటి నాయకులు. పురుగుల మందు డబ్బా దగ్గర పెట్టుకుని నిరాహార దీక్ష చేయడమంటే బ్లాక్‌మెయిలింగ్‌ చర్యగా భావించాలి. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలనే డిమాండులో తప్పు లేకపోయినప్పటికీ, గతంలో మంత్రిగా పనిచేసి చాలా రాజకీయ అనుభవం గడించిన ముద్రగడ లాంటి వ్యక్తులు ఇలాంటి పబ్లిసిటీ దీక్షలు చేయడం తగదు.