వెంకయ్య పాట్లు అన్నీ ఇన్నీ కావు!!

నీళ్ళు లేకుండా చేప బతకలేదు. పదవి లేకుండా రాజకీయ నాయకులు బతకలేరు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఇందుకు అతీతమేమీ కాదు. రాజ్యసభ పదవి లేకపోతే కేంద్ర మంత్రి పదవి ఊడిపోతుంది. కేంద్ర మంత్రి పదవి ఊడినా, రాజ్యసభ పదవి ఉంటే రాజకీయాల్లో నిలబడొచ్చు. అందుకే పట్టుబట్టి మరీ వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవి సాధించారు. దీనికోసం బిజెపిలో ఆయన పెద్ద పోరాటమే చేశారట. ‘మీ సొంత రాష్ట్రమే మిమ్మల్ని పొమ్మంటోంది కదా?’ అని వెంకయ్యనాయుడిని, ప్రధాని నరేంద్రమోడీ ప్రశ్నించగా, కర్నాటక నుంచే తాను రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నాను గనుక, ఆంధ్రప్రదేశ్‌ ఎలా సొంత రాష్ట్రమవుతుందని చెప్పారట.

ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకోసం పాటుపడుతూ కర్నాటకను పట్టించుకోవడంలేదన్న విమర్శలనూ వెంకయ్యనాయుడు వద్ద నరేంద్రమోడీ ప్రస్తావించినట్లు సమాచారమ్‌. ఇప్పుడున్న పరిస్థితులలో తనను రాజ్యసభకు మళ్ళీ పంపకపోతే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయనీ, బిజెపి పట్ల వ్యతిరేకత పెరుగుతుందని వెంకయ్యనాయుడు, నరేంద్రమోడీకి తెలియజేయడంతో ఆయన మాటలతో ఏకీభవించి వెంకయ్యకు ఇంకో అవకాశమిచ్చారట రాజ్యసభ సభ్యునిగా. అయితే ఆంధ్రప్రదేశ్‌ నుంచి పోటీ చేయకూడదని వెంకయ్య నిర్ణయం తీసుకోవడంతో ఆ కోటాలో సురేష్‌ ప్రభుని ఆంధ్రప్రదేశ్‌ నుండి రాజ్యసభకు పంపారు. ఇంత కసరత్తు జరగడం వెనుక వెంకయ్య పదవీ ఆరాటం – పోరాటం రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యపరిచాయి.