KTR ని ఎత్తి ఇరుక్కుపోయిన పారికర్

బీజేపీ నేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ఆకాశానికి ఎత్తడం, అంతలోనే పార్టీ సమావేశంలో విమర్శలు గుప్పించడంపై తెలంగాణ బీజేపీ నేతల్లోనే చర్చనీయాంశమయిందని అంటున్నారు. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఒకరి పైన మరొకరు ప్రశంసలు కురిపించుకోవడం సాధారణమే. అలాగే, ఆ తర్వాత పార్టీ సమావేశాల్లో.. ప్రత్యర్థి ప్రభుత్వం పైన విమర్శలు కూడా సహజమే. మనోహర్ పారికర్ కూడా అధికారిక సమావేశంలో తెరాస పాలనపై ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత బీజేపీ పార్టీ సమావేశంలో చురకలు అంటించారు. అయితే, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని, ప్రసంగించాల్సి వచ్చినప్పుడు, పార్టీ సమావేశాల్లో మాట్లాడే విషయమై ఒకటికి పదిసార్లు చూసుకోవాలని అంటున్నారు.

అధికారిక కార్యక్రమాల్లో పారికర్ మాట్లాడుతూ… టి హబ్ పైన ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరూ కలలు కనేందుకు నిద్రపోతారని, వాటిని నిజం చేసేందుకు ఉదయాన్నే లేచి పని ప్రారంభించేవారు తక్కువ అని, అలాంటి వారిలో కేటీఆర్ ఒకరని కితాబిచ్చారు. తెలంగాణ ఐటీ పాలసీ బాగుందన్నారు. పారిశ్రామిక విధానం అద్భుతమన్నారు. కేటీఆర్ కూడా మాట్లాడుతూ.. పారికర్ ఆదర్శవంతమైన నేత అన్నారు. రక్షణ రంగంలో సంస్కరణలు తెచ్చారని కితాబిచ్చారు. గోవా ప్రజలకు చేసిన సేవ, అమలు చేసిన కార్యక్రమాలు అద్భుతం అన్నారు.మరోవైపు, మనోహర్ పారికర్ ఆ తర్వాత పార్టీ సమావేశంలో మాట్లాడుతూ… ప్రజల చూపు బీజేపీ వైపు ఉందని, తెలంగాణలో వాస్తు ప్రకారం పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. మరో పోరాటానికి నాంది పలకాలన్నారు. 2019లో 60 మంది ఎమ్మెల్యేలు లక్ష్యమని చెప్పారు. బయట, తెరాస ప్రభుత్వం పైన ప్రశంసలు మరీ ఎక్కువగా కురిపించిన నేపథ్యంలో బీజేపీ నేతలు అసంతృప్తితో చెవులు కొరుక్కుంటున్నారంట.