ఉన్నవారికే దిక్కులేదు కొత్తగా ఆకర్ష్ ఏందీ?

July 27, 2016 at 10:24 am

ఇతర పార్టీల నుండి నేతలను ఆకర్షించటంలో భారతీయ జనతా పార్టీ నేతలు నానా అవస్తలు పడుతున్నారు. ఏ పార్టీలోనూ లేనట్లుగా భాజపా ఆకర్ష్ -2016ని విజయవంతం చేసేం దుకు ఏకంగా ఆరుగురు నేతలతో కమిటీ వేసిందంటేనే ఆ పార్టీ పరిస్ధితి అర్ధమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు కమలం అవస్తలు పడుతున్నది. వచ్చే ఎన్నికల నాటికి సొంతంగా పోటీ చేసే స్ధాయికి ఎదగాలని పార్టీ అనుకుం టున్నది.

ఇప్పటికిప్పుడున్న వాస్తవ పరిస్ధితి అయితే మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాల్లో సొంతంగా పోటీ చేసే స్ధాయికి పార్టీ ఎదగలేదన్నది వాస్తవం. గడచిన ఎన్నికల్లో నాలుగు సీట్లు వచ్చాయంటే అది కేవలం టిడిపి చలవే. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవటం, ప్రధాని అభ్యర్ధిగా నరేంద్రమోడికి అప్పట్లో ప్రజల్లో ఉన్న క్రేజ్ లాంటి అనేక అంశాలు కలిసి వచ్చాయి. మిత్రపక్షాలుగా కలిసి పోటీ చేసి లాభపడ్డాయన్నది కూడా వాస్తవమే. అయితే, అదికారంలోకి వచ్చిన దగ్గర నుండి రెండు పార్టీల్లోనూ వివాదాలు మొదలయ్యాయి. ఇరు పార్టీల్లోని నేతల మధ్య ఆధిపత్య పోరాటాలు ప్రారంభమయ్యాయి. దాంతో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కమలం పార్టీ ‘ఆపరేషన్ ఆకర్ష్‌కు’ తెరలేపింది.

వచ్చే ఎన్నికల్లోగా పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా ఇప్పటి నుండి పావులు కదపటం మొదలుపెట్టింది. ఎలాగైనా వచ్చే ఎన్నికల నాటికి టిడిపితో పొత్తులు ఉండకూ డదన్న ఉద్దేశ్యంతోనే పలువురు నేతలున్నారు.బీజేపీ ఆరోపణలు వాస్తవాలే అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైన సమాధానాలు ఇవ్వలేకపోతోంది. దాంతో భాజపాలోని కొందరు నేతలు రెచ్చిపోతున్నారు. సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పదే పదే రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఒంటికాలిపై రెచ్చిపోతుండటం వ్యూహాత్మకమే. అయితే, వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలంటే పార్టీలో ఇపుడున్న నేతల బలం ఏమాత్రం సరిపోదు. 175 శాసనసభ నియోజకవర్గాల్లోనూ పోటీ చేసే సామర్ధ్యం ఉన్న గట్టి అభ్యర్ధుల జాబితాను ఇమ్మంటే పార్టీ నాయకత్వం ఏమి చెప్పలేని స్థితి. అందుకనే ఆపరేషన్ ఆకర్ష్ -2016 పేరుతో పార్టీ నాయకత్వం ఆరుగురు నేతలతో కమిటి వేసింది. ఎంఎల్‌సి సోము వీర్రాజు, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ, రాంభూపాల్‌రెడ్డి, పార్ధసారధి, శాంతారెడ్డిలు కమిటిలో సభ్యులు. ఈ కమిటి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు జరుపుతుంది. ఇతర పార్టీల్లోని నేతలెవరైనా తమ పార్టీలోకి వచ్చేది లేనిది ఆరాలు తీస్తుంది. వివిధ కారణాలతో పార్టీ మారాలనుకుంటున్న నేతలకు గాలం వేయటం కమిటి లక్ష్యం.

ఇపుడు పార్టీలో ఉన్న వారికి, రెండేళ్ల క్రితం పార్టీలో చేరిన వారికే దిక్కులేకపోతే కొత్తగా ఎవరు చేరుతారన్న విషయమై కూడా మొన్నటి సమావేశంలోనే చర్చ కూడా జరిగింది. కమిటి మొత్తం 13 జిల్లాలను పర్యటించినా ఉపయోగం కనబడలేదు. పార్టీల్లో అసంతృ ప్తులు ఎవరైనా ఉంటే ఆ పార్టీల్లోని నాయకత్వాలతో మాట్టాడుకుని సర్దుబాబు చేసుకుంటున్నారే కానీ బీజేపీలో చేరటానికి ఎవరూ సుముఖంగా కనబడ లేదు. ఎవరిని అడిగినా పెద్దగా సానుకూలత కనబడలేదు. దాంతో అప్పటి కమిటి అటకెక్కేసింది. మళ్ళీ అదే లక్ష్యంతో తాజాగా మరో ఇద్దరిని జత చేసి ఆరుగురితో కమిటిని నియమించారు. రెండేళ్ల క్రితం పార్టీలోకి వచ్చిన కావూరి, కన్నా, రాంభూపాల్‌రెడ్డి లాంటి వారికే ఇప్పటి వరకూ దిక్కులేకపోతే ఇపుడు కొత్తగా ఎవరి వస్తారన్న వాదన పార్టీ నేతల్లోనే వినబడుతోంది.

ఉన్నవారికే దిక్కులేదు కొత్తగా ఆకర్ష్ ఏందీ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts