ఎట్టకేలకు రజినీ మాట్లాడారు :మంచిది

సూపర్ స్టార్ రజినీకాంత్ రెండు నెలలుగా ఇండియాలో లేరు. అనారోగ్యంగా ఉండడంతో చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. దీంతో ఆయన ఆరోగ్యం గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. మరోవైపు ‘కబాలి’ ఆడియో వేడుక సహా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎక్కడా సూపర్‌స్టార్‌ జాడలేదు. ఇంత హైప్‌ క్రియేట్‌ చేసిన సినిమా గురించి ఒక స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో అభిమానులు కొందరు అసంతృప్తికి లోనయ్యారు. వీటన్నింటికీ సమాధానం అన్నట్లుగా ఆయన స్పందించారు. రెండు రోజుల కిందటే అమెరికా నుంచి చెన్నై వచ్చిన రజనీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తన అమెరికా పర్యటన వివరాలు చెప్పడంతో పాటు.. కబాలి గురించి కూడా మాట్లాడారు. తమిళంలో తన చేతిరాతతో రజినీ ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం విశేషం.

ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్న తమిళ ప్రజానీకానికి నా నమస్కారాలు అంటూ ప్రారంభించిన రజినీ.. తాను ఎందుకు రెండు నెలలు విశ్రాంతి తీసుకున్నారో వివరించారు. ‘‘వరుసగా 2 సినిమాలు.. శంకర్ తో ‘2.0’కు.. పా.రంజిత్ తో ‘కబాలి’కి తీరిక లేకుండా పని చేయడంతో రెస్ట్ అవసరమైంది. 2 నెలల విరామం నిమిత్తం నా కూతురు సౌందర్యతో కలిసి అమెరికాకు వెళ్లాను. అక్కడే నా ఆరోగ్యం చూసుకున్నాను. అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకున్నాను.

అమెరికాలో ‘కబాలి’కి అద్భుతమైన ఓపెనింగ్స్ నమోదయ్యాయి. అక్కడే చిత్రం చూశాను. తర్వాత చెన్నైకి వచ్చి ‘కబాలి’ సాధించిన సక్సెస్‌ను కళ్లారా చూశాను. చాలా ఆనందం కలిగింది. ఈ సినిమాను నిర్మించిన నా చిరకాల మిత్రుడు థానుకి.. దర్శకుడు పా.రంజిత్ మిగతా యూనిట్ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ‘కబాలి’కి ఇంత పెద్ద విజయాన్ని కట్టబెట్టిన ప్రేక్షకులు.. నా అభిమానులు.. డిస్ట్రిబ్యూటర్లు.. థియేటర్ల యజమానులకు కూడా నా కృతజ్ఞతలు’’ అని ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు రజినీ.