ఏపీ కాంగ్రెస్ కి అదే సంజీవిని!

ఏపిలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ప్రభావం చూపలేకపోతోందని కాంగ్రెస్ పార్టీ నేతలే ధృవీకరిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సర్వంకోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నా మైలేజీ పార్టీకి చేరడంలేదు . ఏపిలో కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంత బతికివుందంటే అది పార్టీకి అంటిపెట్టుకొన్న కొంత మంది సీనియర్‌ నేతల వల్లేనని రాజకీయ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. పార్టీలో సీనియర్ నేతలు, సమయానుసారం ప్రజా సమస్యలపై స్పందిస్తున్నా విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజానికంలో తిరిగి పట్టుసాధించలేకపోతోంది.

ఎన్నో ప్రజా సమస్యలపై పోరాటాలు చేసినా పార్టీకి అనుకొన్న మేర మైలేజీ రాకపోవడానికి ప్రధాన కారణం పార్టీలో చరిష్మ ఉన్న నేత లేకపోవడం ఒకటైతే సీనియర్ నేతలు పార్టీని చేజారడం, పార్టీకి గతంలో ఉన్న బలమైన కార్యకర్తలగణం చెల్లాచెదురు కావడం కూడా మరో పెద్ద కారణమని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజా సమస్యలపై తమ పార్టీ ఎన్నో పోరాటాలు చేసినా అవి ప్రజానికపై ముద్రవేయలేక పోతున్నాయి. కనీసంగా తమ పోరాటాలపై జనంలో చర్చ సాగడంలేదని ఏపి కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు పేర్కొంటున్నారు. జనంలో తమ పార్టీ పోరాటాలపై చర్చ జరగకపో వడానికి తమ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలు కరువవ్వడం కూడా  కారణం. తమ పార్టీ అధినాయకత్వం తీసుకొన్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కూడా ఏపి ప్రజానికం అంత తేలికగ్గా మరిచిపోలేక పోతోంది.

ఏపికి ప్రత్యేక హోదాకోసం రాజ్యసభలో ఏపి కాంగ్రెస్ పార్టీ ఎంపీలుపోరాటం చేస్తున్నారు. ఈ ఒక్క అస్త్రమే పార్టీని బతికించుకోనేందుకు ఉపయోగపడదన్న భావనను కూడా కాంగ్రెస్ నేతలు వ్యక్తంచేస్తున్నారు.మరో  వైపు క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం లేకపోవడం వల్లే పార్టీ చేసిన ప్రజా పోరా టాలకు జనం నుంచి పెద్దగా స్పందనరావడంలేదని వారు పేర్కొంటున్నారు. పార్టీకి కార్యకర్తల బలం సమీకరించేందుకు వీలుగా పట్టణాలలో వార్డుల వారీగా పార్టీ నాయకత్వం బలోపేతం కోసం ప్రత్యేక దృష్టిసారించాలని ఏపి కాంగ్రెస్ నాయకత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామస్థాయిలోనూ ఇదే పంథాను అనుసరించాలని ఏపి కాంగ్రెస్ భావిస్తోంది. తద్వారా తాము కోల్పోయిన పట్టును తిరిగి సాధించుకోవాలని ఏపి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమాలోచనలు చేస్తోంది.