వారసులను తీర్చి దిద్దే పనిలో చంద్రులు

రెండు తెలుగు రాష్ట్రాలు…ఇద్దరు సీఎంలు… వారికి ఇద్దరు పుత్రరత్నాలు… రాజకీయంగా, ముఖ్యమంత్రులుగా పాలనలో తమదైన ముద్రవేస్తూ, ఇప్పటికిప్పుడు ఢోకాలేని ప్రభుత్వాలను నడుపుతూ దూసుకు వెళుతున్న ఇద్దరు చంద్రులూ, తమ వారసులకు… ఫుల్ లెంగ్త్ లో ట్రైనింగ్ ఇస్తూ…. దూసుకుపోతున్నారు. ఇటు కేసీఆర్ అయితే అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తుంటే…. ఇటు చంద్రబాబు పార్టీ వ్యవహారాలు చక్క దిద్దే పని అప్పగించారు.

మీ కుమారుడుని 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిచయం చేస్తారా? అంటూ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి జర్నలిస్టు వేసిన ప్రశ్న ఇది. దీనికి “ఎందుకు, నాకేం అయింది?” అని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఇక ఇదే ప్రశ్న పొరుగున ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు డైరెక్టగా ఎదురుకానప్పటికీ, ఆయన తరువాత కొడుకు కేటీ రామారావు వారసుడని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది.వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఐటీ, పంచాయితీ రాజ్ శాఖా మంత్రిగా మొదలైన కేటీఆర్ రాజకీయపు అడుగులు, ఆపై వివిధ ఎన్నికల్లో విజయం, విదేశీ పర్యటనల్లో రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం వంటి విషయాల్లో సత్తా చాటడం వైపు నడిచాయి. గ్రేటర్ హైదరాబాద్ ను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. తనదైన శైలిలో ముందుండి నడిపించి పార్టీని విజయ తీరాలకు చేర్చడంతో పాటు, కీలకమైన పురపాలక శాఖను తన ఖాతాలో వేసుకున్నారు. దేశవాళీ కార్పొరేట్ కంపెనీలు తెలంగాణకు రావడానికి తోడ్పాటును అందించే కొత్త విధానాలు తెచ్చారు. అమెరికాలో విద్యను అభ్యసించడం, ఎదుటివారిని మైమరపించేలా మాట్లాడగలగడం కేటీఆర్ బ్రాండును మరింతగా పెంచాయి.

ఇక ఏపీ విషయానికి వస్తే, సీఎం చంద్రబాబు వారసుడు లోకేషే అంటూ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, ప్రస్తుతం పార్టీ కేంద్ర కమిటీలో కార్యదర్శిగా ఉన్న లోకేష్, ఇప్పటికే పలు పరిపాలనా పరమైన నిర్ణయాలు తీసుకోవడం వెనుక మంత్రాంగం నడిపారు. వివిధ సమావేశాల్లో మంత్రులతో పాటు కూర్చుని సలహాలు, సూచనలు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. లోకేష్ అమెరికాలో విద్యాభ్యాసం చేయడం… పార్టీ కేడర్ కు పలు సంక్షేమ పధకాల ద్వారా పెద్ద ఎత్తున సభ్యత్వం చేయించి రికార్డు నెలకొల్పారు… రాష్ట్రానికి వచ్చే అన్ని పెద్ద డీల్స్ విషయంలో లోకేష్ కు తెలియకుండా ఏమీ జరగడం లేదంటూ…పార్టీ సీనియర్ నేతలు ఒప్పుకుంటున్నారు. డిసెంబర్ 2015 వరకూ లోకేష్ దగ్గరి స్నేహితుడు ‘అభీష్ట’ సీఎంకు ఓఎస్డీగా పాలనా నిర్ణయాలను దగ్గర నుంచి పరిశీలించి వాటిపై లోకేష్ కు వివరించేవాడని తెలుస్తోంది. అభీష్ట వైఖరిపై విమర్శలు పెరుగగా, చంద్రబాబు ఆయన్ను పక్కన బెట్టారు.

ఇక రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా మంత్రుల పనితీరును పరీక్షించాలని భావించిన చంద్రబాబు, వారికి మార్కులేసే కీలక పనిని లోకేష్ కే అప్పగించారు. 2014లో విజయం అనంతరం, మంత్రి పదవులు ఎవరికి దక్కాలన్న విషయం నుంచి, మంత్రులకు వ్యక్తిగత కార్యదర్శులుగా ఎవరుండాలన్న విషయం వరకూ లోకేష్ దగ్గరుండి పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. ఇక బాలకృష్ణ కుమార్తె బ్రహ్మణిని వివాహం చేసుకోవడం ద్వారా అధికారం తమ కుటుంబం నుంచి బయటి కుటుంబానికి వెళ్లకుండా చంద్రబాబు చూసుకున్నారని తెలుగుదేశం పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.