హోదా కాదు, హోదా లాంటిది మాత్రమే.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా సాధ్యం కాదనీ, రాజ్యాంగ పరమైన ఇబ్బందులు ఉన్నాయని బిజెపి సీనియర్‌ నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌ సిద్దార్ధ నాథ్‌ సింగ్‌ తెలిపారు. ప్యాకేజీలో ఉన్న అంశాల్ని వేరే రూపంలో ఆంధ్రప్రదేశ్‌కి అమలు చేయడానికి తగిన కసరత్తు జరుగుతోందనీ, త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని ఆయన తెలిపారు.

అయితే హోదాకు మించి ఇస్తామని ప్రభుత్వాలు, పార్టీలు చెప్పే మాటలు విశ్వసించడానికి వీలుండదు. ఐదేళ్ళో, పదేళ్ళో ప్రత్యేక హోదాని ప్రకటిస్తేనే అది చట్టబద్ధంగా నిలబడుతుంది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన నిధులు, వెసులుబాట్లు దొరుకుతాయి. ఉత్త హామీలు ఇవ్వడం ద్వారా ఉపయోగం ఏమీ ఉండదని విశ్లేషకులు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ప్రత్యేక హోదాపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని నిన్న చెప్పారుగానీ, ఈలోగానే భారతీయ జనతా పార్టీ అదేం లేదని తేల్చేసింది. వెంకయ్యనాయుడు, అరుణ్‌ జైట్లీ, అమిత్‌ షాలతో సమావేశం అనంతరం సుజనా చౌదరి, ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన మరోసారి ఎప్పటిలాగానే అభాసుపాలయ్యారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం నుంచి ఇంకోసారి అన్యాయమే జరుగుతోందని రాష్ట్ర ప్రజానీకం ఆందోళన చెందుతున్నారు.