తెలుగు మీడియాలో పీక్ రేంజ్‌కి వ‌ర్గ‌పోరు!

బ‌హుళ ప్ర‌జా ప్ర‌యోజ‌న‌మే మీడియా ప్ర‌సారాల‌కు గీటు రాయి! అది ప్ర‌చుర‌ణ అయినా ఎల‌క్ట్రానిక్ మాధ్యమ‌మైనా.. రెండింటికీ వ‌ర్తిస్తుంద‌నేది మీడియా పెద్దల ఉవాచ‌! గ‌తంలో అన్ని ప‌త్రిక‌లూ ఇవి పాటించాయి! నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక‌ను పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ స్థాపించినా.. దానికి వేరే వ్య‌క్తిని ఎడిట‌ర్‌గా నియ‌మించారు. అయితే, కాల్ప‌నిక దృష్టితో వార్త‌లు ప్ర‌చురించే రోజులు కావ‌డంతో త‌న య‌జ‌మానే అయిన‌ప్ప‌టికీ.. దేశ ప్ర‌ధాని గా ఉన్న నెహ్రూ.. తీసుకున్న నిర్ణ‌యాల‌పై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు ఆ ఎడిట‌ర్‌. చైనా విష‌యంలో నెహ్రూ తీసుకున్న నిర్ణ‌యం కొన్ని త‌రాల‌ను ఇబ్బంది పెడుతుంద‌ని విమ‌ర్శిస్తూ.. సంపాద‌కీయ‌మే రాశారు.

దీనిని చ‌దివిన నెహ్రూ త‌న‌ను ఉద్యోగంలోంచి తీసేయ‌డం ఖాయ‌మ‌ని ఆ ఎడిట‌ర్‌ భావించారు. రిజైన్ లెట‌ర్‌నూ జేబులోనే పెట్టుకున్నారు. కానీ, నెహ్రూ జ‌ర్న‌లిస్టిక్ వాల్యూల‌ను అవ‌గ‌తం చేసుకున్న మనీషి కావ‌డంతో ఆ ఎడిట‌ర్‌కు డ‌బుల్ ఇంక్రిమెంటు వేసే ప్రోత్స‌హించారు. ఇది నాటి ప‌రిస్థితి!! కానీ, నేడు.. పెట్టుబ‌డి స్వామ్యం పెరుగుతున్న మీడియాలో వింత ధోర‌ణ‌లు ప్ర‌బ‌లుతున్నాయి. నా క‌ది నీకిది త‌ర‌హా విధానాలు ప్ర‌స్ఫుటంగా క‌నిపిస్తున్నాయి. ఈ ధోర‌ణి తెలుగు మీడియాలో మ‌రింత ఎక్కువ క‌నిపిస్తోంది. ముఖ్యంగా అతి పెద్ద స‌ర్క్యులేష‌న్ ఉన్న తెలుగు ప‌త్రిక‌, ఓ ద‌మ్మున్న తెలుగు ప‌త్రిక‌లు ఓ పార్టీకి కొమ్ముకాస్తుండ‌డం మ‌రింత విస్తు గొలుపుతోంది.

ఇక‌, ఈ రెండింటికీ కౌంట‌ర్‌గా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్థాపించిన సాక్షి ప‌త్రిక‌, మీడియా కూడా అసలు ల‌క్ష్యం వ‌దిలి.. య‌జ‌మాని పూజ‌లో త‌రిస్తోంది. ఫ‌లితంగా తెలుగు మీడియాలో రెండు వ‌ర్గాల మ‌ధ్య పోరు నానాటికీ పెరుగుతోంది. వైఎస్ అంటేనే పొడ‌గిట్ట‌ని ఈ నాడు, ఆంధ్ర‌జ్యోతి య‌జ‌మానులు .. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా వండి వార్చిన క‌థ‌నాలు పెద్ద సంచ‌ల‌న‌మే రేపాయి. అయితే, వాటికి అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే అవి అలా రాయ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, టీడీపీని, దాని అధినేత చంద్ర‌బాబును పెద్ద ఎత్తున మోసేసే ఈ రెండు ప‌త్రిక‌లు.. ఆయ‌న‌పై ఈగ వాలినా సహించే ప‌రిస్థితిలేదు.

2014లో ఈ రెండు ప‌త్రిక‌లు చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీకావు. నిత్యం జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా క‌థ‌నాలు వండివార్చేందుకు ఈనాడు ప్ర‌త్యేక విభాగాన్నే ఏర్పాటు చేయ‌డం విశేషం. ఇక‌, ఆంధ్ర‌జ్యోతిలోనూ ఇదే తంతు న‌డిచింది. ఈనాడు నిత్య‌మూ జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఎడిటోరియ‌ల్ ఇచ్చిన సంద‌ర్భం 2014 ఎన్నిక‌ల స‌మ‌యమే!! మొత్తానికి చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చారు. ఇక‌, ఆ రెండు ప‌త్రిక‌లు సైలెంట్ అయిపోయాయి. ఇక‌, ఇప్పుడు బాబుపై ఈగైనా వాల‌కుండా చూసుకుంటున్నాయి. ఇక‌, సాక్షి విష‌యానికి వ‌స్తే.. జ‌గ‌న్, వైఎస్‌ల‌ను మించిన దేవుళ్ల‌కు సాక్షికి మ‌రొక‌రులేరు.

సో.. ఇలా సాగుతున్న తెలుగు ప‌త్రిక‌ల వ‌ర్గ‌పోరు.. మ‌రింత పీక్ స్టేజ్‌కి చేరింది. బిసిసిఐ పుణ్యమాని విశాఖపట్టణంలో మొదటి టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. ఆ మ్యాచ్‌ జరుగుతోంది ఏ స్టేడియంలో? డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసిఏ-వీడిసిఏ స్టేడియం అని ప్రతిపక్ష మీడియా నొక్కి చెప్తూ ఉంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరుతో ఆ స్టేడియం ఉంది అని హెడ్‌లైన్స్‌లో హైలైట్ అయ్యేలా చేస్తోంది. ఆ స్టేడియాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి కట్టించాడనో, ఆ స్టేడియం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పుణ్యం అన్న అర్థమో రావాలన్నది ఆ మీడియా తాపత్రయం.

ఇక ఆ రెండు పత్రికలు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఏసిఏ-వీడిసిఏ స్టేడియం అని వార్తలు రాసేస్తూ ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరుని పూర్తిగా పక్కన పెట్టేశాయి. వైఎస్ అని రాస్తే వైఎస్ కుటుంబానికి ఎక్కడ ఏ ఒక్క ఓటు అన్నా పడుతుందేమో అని ఆ రెండు పత్రికల భయం.మ‌రో విశేషం ఏమంటే.. ఏపీలోని క‌డ‌ప జిల్లా పేరును ప్ర‌భుత్వం గ‌తంలో వైఎస్సార్ క‌డ‌ప జిల్లాగా మార్చింది. అయితే, ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిలు మాత్రం.. ఇప్ప‌టికీ కేవ‌లం క‌డ‌ప జిల్లా అనే రాస్తుంటాయి. ఎక్క‌డా వైఎస్సార్ జిల్లా అని రాయ‌వు. ఇలా ఉంది ఈ ప‌త్రిక‌ల పోరు! ఇక‌, 2019 నాటికి ప‌రిస్థితిని భిన్నంగా అంచ‌నా వేయ‌లేం క‌దా!!