టీడీపీలోకి తండ్రి, కొడుకులు

ఏపీ అధికార పార్టీ టీడీపీలోకి జ‌రుగుతున్న జంపింగ్‌లు ఇప్ప‌ట్లో ఆగేలా క‌నిపించ‌డం లేదు! ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్నరేళ్ల స‌మ‌యం ఉండ‌గానే వైకాపా నుంచి ముఖ్య నేత‌లు సైతం చంద్ర‌బాబు చెంత సైకిల్ ఎక్కేస్తున్నారు. దీనికి వాళ్లు చూపిస్తున్న కార‌ణాలు స‌మంజ‌స‌మా? అసమంజ‌స‌మా? అనేది ప‌క్క‌న పెడితే.. ఈ ప‌రిణామం మాత్రం వైకాపా అధినేత జ‌గ‌న్‌కి భారీ షాక్ ఇచ్చేలానే క‌నిపిస్తున్నాయి. నిన్న‌టికి నిన్న నెల్లూరు వైకాపా ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి ఆయ‌న త‌న‌యుడు, సోద‌రుడు ఇలా స‌రివార స‌మేతంగా సైకిల్ ఎక్కేస్తున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి.

మేక‌పాటి వార్త నుంచి కోలుకోక‌ముందే మ‌రో భారీ బ్రేకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. జ‌గ‌న్‌కి అత్యం త స‌న్నిహితుడు, జ‌గ‌న్ కుటుంబానికి అతి స‌మీప బంధువుగా చెప్పుకొనే పీలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రామచంద్రారెడ్డికి జ‌గ‌న్‌కి మధ్య మంచి ఫార్ములానే ఉంది. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో రామ‌చంద్రారెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డికి ఎంపీ సీటు కూడా ఇచ్చాడు జ‌గ‌న్‌. మ‌రి అంతా బాగుంటే.. ఇప్పుడు ఈ పార్టీ మార్పుడు ఎందుకు? అనేగా.. అనుమానం. ఇప్పుడు అక్క‌డి కే వ‌ద్దాం.

ఏపీ ఉమ్మ‌డి రాష్ట్ర ఆఖ‌రి సీఎంగా రికార్డు సృష్టించిన కిర‌ణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత సొంత కుంప‌టి(పార్టీ) పెట్టుకున్నా వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న ఖాళీగానే ఉన్నారు. ఇక, 2019 ఎన్నిక‌ల్లో అయినా త‌న స‌త్తా చాటాల‌ని, అసెంబ్లీలో అడుగు పెట్టాల‌ని ఆయ‌న అనుకున్నాడు. ఈ క్ర‌మంలో సొంత పార్టీ లేక‌పోయే స‌రికి.. అటు టీడీపీ, ఇటు వైకాపా, మ‌రోటి జ‌న‌సేన ఈ మూడే ఆయ‌నకు ప్ర‌త్యామ్నాయంగా ఉన్నాయి. బాబుకి కిర‌ణ్‌కి ప‌డ‌దు కాబ‌ట్టి టీడీపీలో చేరే ప్ర‌శ్న‌లేదు. ఇక‌, జ‌న‌సేన ఇంకా ఎలాంటి కార్యాచ‌ర‌ణా ప్ర‌క‌టించ‌లేదు.

దీంతో ఇప్ప‌టికిప్పుడు ఉన్న ప్ర‌త్యామ్నాయం జ‌గ‌న్ పార్టీ. దీంతో కిర‌ణ్ కుమార్ రెడ్డి జ‌గ‌న్ పార్టీలోకి వ‌స్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇదే.. రామ‌చంద్రా రెడ్డి జెండా మార్చేయ‌డానికి కార‌ణం. కిర‌ణ్‌కి, రామ‌చంద్రారెడ్డికి మ‌ధ్య కూల్ వాట‌ర్ పోసినా.. హై ఫైర్ అయ్యే ప‌రిస్థితులు ఉన్నాయి. దీంతో త‌న మాట కాద‌ని కిర‌ణ్‌ను జ‌గ‌న్ వైకాపాలో చేర్చుకుంటే జ‌గ‌న్‌కి రాం రాం చెప్ప‌డ‌మే మంచిద‌ని రామ‌చంద్రారెడ్డి అనుకుంటున్నార‌ట‌. మ‌రోప‌క్క‌, ఈయ‌న రాక‌తో టీడీపీకి స్థానికంగా ల‌బ్ది ఉంటుంద‌ని బాబుకు తెలుసు! దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ కుదిరే ఛాన్స్ ఎక్కువ‌గానే ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఈరోజో.. రేపో.. రామ‌చంద్రారెడ్డి అండ్ కోలు.. సైకిల్ ఎక్కేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.