టీడీపీలో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్

ఏపీలో అధికార టీడీపీ ప‌దేళ్ల త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చినా ఆ పార్టీ నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేదు. అన్ని జిల్లాల్లోను పార్టీ నాయ‌కుల మ‌ధ్య అంత‌ర్గ‌త పోరు తీవ్ర‌స్థాయికి చేరుకుంది. ఈ నేప‌థ్యంలోనే టీడీపీ బ‌లంగా ఉన్న ఓ జిల్లాలో ఏకంగా బాబాయ్‌-అబ్బాయ్ మ‌ధ్యే కోల్డ్‌వార్ తీవ్ర‌స్థాయికి చేరుకుంద‌న్న వార్త‌లు ఆ జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి.

దివంగ‌త మాజీ కేంద్ర మంత్రి ఎర్రాన్నాయుడు వార‌సుడిగా రాజ‌కీయారంగ్రేటం చేసిన శ్రీకాకుళం ఎంపీ కింజార‌పు రామ్మోహ‌న్‌నాయుడు యంగ్ పొలిటిషీయ‌న్‌గా త‌న‌దైన స్టైల్లో దూసుకు వెళుతున్నాడు. తండ్రి ఎర్ర‌న్నాయుడు ఇమేజ్ లేకుండానే వ్య‌క్తిగ‌తంగా త‌న‌కంటూ ఓ ముద్ర వేయించుకున్నాడు. అన్ని వ‌ర్గాల్లోను రామ్మ‌నోహ‌ర్ నాయుడుపై సంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇటు రాముతో పాటు అటు బాబాయ్‌, మంత్రి అచ్చెన్నాయుడు క‌నుస‌న్న‌ల్లోనే ప్ర‌స్తుతం శ్రీకాకుళం జిల్లా పాల‌న న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే అబ్బాయ్ రాముకు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్లో మంచి పేరు ఉంటే…బాబాయ్ అచ్చెన్నాయుడుపై రోజు రోజుకు జిల్లా ప్ర‌జాప్ర‌తినిధుల్లోను, ప్ర‌జ‌ల్లోను తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది.

అచ్చెన్న అండ్ గ్యాంగ్ అవినీతికి భారీగా అస్కారం క‌ల్పిస్తున్నార‌ని..ఇక జిల్లాలో చాలా మంది ప్ర‌జాప్ర‌తినిధుల‌కు అచ్చెన్న‌కు సైతం ప‌డ‌డం లేద‌న్న వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ ల‌క్ష్మీదేవితో పాటు సీనియ‌ర్ నేత కిమిడి క‌ళా వెంక‌ట్రావు, మ‌రో సీనియ‌ర్ గౌతు శివాజీ త‌దిత‌రులు అచ్చెన్న పేరు చెపితేనే మండిప‌డుతున్నారు.

ఏపీకి చంద్ర‌బాబు సీఎం అయితే శ్రీకాకుళం జిల్లాకు సీఎంగా అచ్చెన్న వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న చ‌ర్చ న‌డుస్తోంది. జిల్లాలో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు,ప్రమోషన్లు ఇతర ముఖ్య విషయాలన్నీ మంత్రి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. జిల్లలో త‌న‌కు సంబంధించిన విష‌యాల్లో సైతం బాబాయ్ అచ్చెన్న జోక్యం చేసుకోవ‌డంతో ఎంపీ రాము లోలోన తీవ్ర‌స్థాయిలో ర‌గిలిపోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే రాము త‌న‌కంటూ ఓ వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకునే ప‌నిలో కూడా ఉన్న‌ట్టు స‌మాచారం.

ఇదే విష‌యాన్ని రాము సీఎం చంద్ర‌బాబు, త‌న‌కు సన్నిహితుడైన నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధ‌మైనా ఆయ‌న త‌ల్లి, దివంగ‌త ఎర్ర‌న్నాయుడు భార్య వారించ‌డంతోనే వెన‌క్కు త‌గ్గాడ‌ని తెలుస్తోంది. బాబాయ్ వ‌ర్సెస్ అబ్బాయ్ మ‌ధ్య కోల్డ్‌వార్ తారాస్థాయికి చేరుకుంద‌ని…ఇది ఫ్యూచ‌ర్‌లో ఎప్పుడైనా గాలి బుడ‌గ‌లా పేల‌వ‌చ్చ‌న్న గుస‌గుస‌లు శ్రీకాకుళం జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి.