2016లో ఏపీ పాలిటిక్స్ హీరో ఎవ‌రు..!

గ‌డిచిన ఏడాది అనుభ‌వాల‌ను.. రంగ‌రించి.. వ‌చ్చే ఏడాదికి ప‌టిష్ట ప్ర‌ణాళిక‌లు వేసుకునే స‌గ‌టు మాన‌వుడికి ఏ ఏడైనా ఆనంద‌మే! అద్భుతమే!! ఈ స‌మ‌యంలో గ‌త ఏడాది ఏం జ‌రిగింది? వ‌చ్చే ఏడాదికి ఎలాంటి ప్ర‌ణాళిక‌లు ఉంటే బాగుంటుంది? అని ఎవ‌రైనా ఆలోచిస్తారు. మ‌రి అలాంటి ఆలోచ‌న ఒక్క మ‌న‌కేనా.. మ‌న ల్ని పాలించే పార్టీల‌కు లేదా అంటే.. చెప్ప‌లేం.

ఇక‌, ఈ క్ర‌మంలో ఇప్పుడు గ‌డిచిన ఏడాది తాలూకు ఏపీలో జ‌రిగిన పాలిటిక్స్ ను ఒక్క‌సారి సింహావ‌లోక‌నం చేసుకుందాం. 2014లో అధికారం చేప‌ట్టిన చంద్ర‌బాబు.. త‌న‌దైన స్టైల్లో దూసుకుపోతున్నారు. అయితే, ఈ క్ర‌మంలో అనేక స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌య్యాయి. ఆయ‌న చేప‌ట్టిన భూస‌మీక‌ర‌ణ‌, ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఆక్వా పార్కు, కాల్ మ‌నీ, మ‌ద్యం మృతులు వంటి ప‌లు స‌మ‌స్య‌లు రాష్ట్రాన్ని చుట్టుముట్టాయి. అదేస‌మ‌యంలో నిధులు లేక‌పోయినా.. ఉద్యోగుల‌కు జీతాల పెంపు, కొత్త రాజ‌ధాని నిర్మాణం.. నీటి వివాదాలు ఇలా అన్నీ ఒకే స‌మ‌యంలో ఆయ‌నను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వీటికితోడు కొంద‌రు మంత్రుల‌పై విప‌రీత‌మైన అవినీతి ఆరోపణ‌లు సైతం బాబు ప్ర‌భుత్వానికి మ‌కిలి అంటించాయి.

సాధార‌ణంగా అధికార పార్టీ చేసే త‌ప్పుల‌ను ఎత్తి చూప‌డంతో పాటు ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాటాల‌కు ప్ర‌ధాన విప‌క్షం వైకాపా పూర్తిస్థాయిలో స‌న్న‌ద్ధ‌మ‌వుతుంద‌ని అంద‌రూ భావించారు. అయితే, జ‌గ‌న్ ముక్కుసూటి త‌నం, ఎవ్వ‌రినీ ఆ పార్టీలో ఎద‌గ‌నివ్వ‌లేదు. దీంతో వైకాపా చేప‌ట్టిన ప్ర‌తి కార్య‌క్ర‌మ‌మూ ఆశించినంత హైప్ ఇవ్వ‌లేద‌ని ఆ పార్టీ నేత‌లే చెబుతున్నారు. మ‌రోప‌క్క‌, ఆ పార్టీ నుంచి జంపింగ్ జిలానీలు క్యూక‌ట్టుకుని మ‌రీ టీడీపీ పంచ‌న చేరిపోవ‌డం ఈ ఏడాదే జ‌రిగింది. ఇంత భారీస్థాయిలో జంపింగ్‌లు ఉండే స‌రికి జ‌గ‌న్‌కి దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అయింది.

మ‌రోప‌క్క‌, ప‌ట్టిసీమపై చేసిన యుద్ధం కూడా ఆశించిన మైలేజీ ఇవ్వ‌లేదు. ఇక‌, జ‌న‌సేనాది ఈ ఏడాది మ‌రో చాప్ట‌ర్‌! 2014లో పార్టీని స్థాపించినా.. 2015లో మౌనంగా ఉన్న ప‌వ‌న్‌.. 2016 చివ‌ర్లో అంటే రెండో అర్ధ‌భాగంలో మాత్ర‌మే జ‌నాల్లోకి రావ‌డం మొద‌లు పెట్టాడు. వ‌చ్చినా.. ప్ర‌తి కార్య‌క్ర‌మంలోనూ క్లారిటీ మిస్ అవుతున్నాడ‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. ప్ర‌త్యేక హోదాపై గ‌ళం విప్పుతాన‌ని, పోరాటం చేస్తాన‌ని చెప్ప‌డ‌మే కానీ, ఏం చేస్తాడో? ఎలా చేస్తోడో కూడా క్లారిటీ లేదు. అదేస‌మ‌యంలో కేడ‌ర్‌ని సైతం ఏర్పాటు చేయ‌లేక‌పోవ‌డం మైన‌స్‌గా క‌నిపిస్తోంది.

ఇక‌, జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్‌, బీజేపీల ప‌రిస్థితి ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఉంది. విభ‌జ‌న‌తో రూపు కోల్పోయిన కాంగ్రెస్ ఇప్ప‌టికీ పుంజుకోలేదు. ఆ పార్టీ చీఫ్ ఏదైనా కార్య‌క్ర‌మం చేప‌డితే.. దానిని హిట్ చేసుకునేందుకు నానా తిప్ప‌లు ప‌డ‌డ‌మే కాకుండా.. మిగిలిన పార్టీల మ‌ద్ద‌తు కూడా కోరుతున్నారంటే ఆ జాతీయ స్థాయి పార్టీ ఎలా దిగ‌జారి పోయిందో తెలుస్తూనే ఉంది. ఇక‌, బీజేపీ గురించి మాట్లాడితే.. విక‌సించేందుకు ప‌నికిరాని పుష్కంగా క‌మ‌లం ఏపీలో కునారిల్లుతోంది. సంయుక్తం ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి. రెండున్న‌రేళ్లు అయినా.. ఏపీలోసొంతం బ‌లం చేకూర్చ‌డంలో ఆ పార్టీ నేత‌లు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు.

మ‌రో ముఖ్య పార్టీలుగా ఎన్‌టీఆర్ హ‌యాంలో టీడీపీతో క‌లిసి అధికారంలోకి వ‌చ్చిన వామ ప‌క్షాల ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారింది. ముఖ్యంగా రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత వామ‌ప‌క్ష‌ల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో త‌మ‌ను మోసే నాయ‌కుడు, పార్టీ కోసం సీపీఎం నేత‌లు ఎదురు చూస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఉన్న జ‌గ‌న్ పార్టీ ఒక్క‌టే సంఖ్యా ప‌రంగా బ‌లంగా ఉంది కానీ బాబు పాల‌న‌పై మాత్రం ఆ పార్టీ ఏమంత ఆశించిన స్థాయిలో ప‌నిచేయ‌డం లేద‌ని స్ప‌ష్ట‌మైంది. దీంతో ఎలా చూసినా.. 2016లో ఏపీ హీరో ఎవ‌రంటే.. చంద్ర‌బాబ అని చెప్ప‌క‌త‌ప్ప‌దు. మ‌రి ఈ అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని 2017లో ఆయా పార్టీలు ఎలాంటి వ్యూహాన్ని అమ‌లు చేస్తాయో చూడాలి.