ఎస్పీ ఫ్యామిలీ డ్రామాలో మ‌రో ట్విస్ట్‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతున్నాయి. ఒక్క‌సారిగా యూపీలో బీజేపీ జెండా రెప‌రెప‌లాడిన ద‌గ్గ‌ర నుంచి..ఎన్నో ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు జరుగుతున్నాయి. యూపీ ముఖ్య‌మంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్ర‌మాణ స్వీకారం రోజున‌.. బ‌ద్ధ శ‌త్రువులైన ఎస్పీ అధినేత ములాయంసింగ్‌, ప్ర‌ధాని మోదీ చాలాసేపు మాట్లాడుకోవ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఇది జరిగిన కొద్దిరోజుల‌కే ములాయం చిన్న కొడుకు, కోడ‌లు పార్టీని వీడ‌తార‌నే ప్ర‌చారం అక్క‌డి మీడియాలో జోరందుకుంటోంది. వీరు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నార‌ని, ఈ మేర‌కు బీజేపీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం!

ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ అధినేత చిన్న కుమారుడు ప్రతీక్‌ యాదవ్, ఆయన భార్య అపర్ణా యాదవ్ శుక్రవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తో భేటీ అయ్యారు. ఈ ఉదయం వీవీఐపీ అతిథి గృహానికి వచ్చిన ప్రతీక్, అపర్ణ దంపతులు సీఎం యోగితో మంతనాలు జరిపారు. వీరు ఏం చర్చించారన్నది వెల్లడి కాలేదు.

తాజాగా ముగిసిన యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ-కాంగ్రెస్‌ కూటమి ఘోర పరాజయం పాలైంది. బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అపర్ణా యాదవ్.. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో 33,796 ఓట్లతో ఓడిపోయారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని మోదీతో ములాయం, అఖిలేశ్‌ మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో సీఎం యోగితో ప్రతీక్, అపర్ణ దంపతుల భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. మ‌రి అక్క‌డే వీరి చేరిక‌పై ప్ర‌ధానితో చ‌ర్చించారా అనేది తెలియాల్సి ఉంది.

అయితే ఎన్నిక‌ల ముందు న‌డిచిన ఎస్పీ ఫ్యామిలీ డ్రామాలో.. అప‌ర్ణా యాద‌వ్ ములాయం వ‌ర్గానికి మ‌ద్ద‌తుగా నిలిచిన విష‌యం తెలిసిందే! అఖిలేష్ వ‌ర్గాన్ని మొద‌టి నుంచి వ్య‌తిరేకిస్తున్నారు. మ‌రి పార్టీ పరాజ‌యం త‌ర్వాత‌.. ఆమె సీఎంను క‌ల‌వడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆమె పార్టీ మారుతోంద‌నే ప్ర‌చారం.. స్థానిక మీడియాలో జోరుగా జ‌రుగుతోంది.