టీడీపీలో సీనియర్లపై బాబుకు నమ్మకం లేదా..!

ఒక‌ప్పుడు తెలుగుదేశం అంటే న‌మ్మ‌కానికి, క్ర‌మ‌శిక్ష‌ణ‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎన్టీఆర్ ఉన్న‌ప్పుడు..త‌ర్వాత చంద్ర‌బాబు సీఎం అయిన‌ప్పుడు టీడీపీలో క్ర‌మ‌శిక్ష‌ణ నూటికి నూరుశాతం ఉండేది. పార్టీ నిర్ణ‌యాన్ని ఎవ్వ‌రూ వ్య‌తిరేకించే వారు కాదు. అధ‌ధినేత చెప్పిందే వేదం. అయితే ఇప్పుడు తెలుగుదేశం సీన్ మారింది. క్ర‌మ‌శిక్ష‌ణ పూర్తిగా గాడి త‌ప్పేసింది. పార్టీలోనే ఒక‌రికి ఒక‌రికి ప‌డ‌డం లేదు. జిల్లాల్లో కాదు ఇంకా చెప్పాలంటే అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనే గ్రూపు రాజ‌కీయాలు ఓ రేంజ్‌లో రాజ్య‌మేలుతున్నాయి.

ఇక ఇప్పుడు పార్టీలో చంద్ర‌బాబునే న‌మ్ముకుని ఎప్ప‌టి నుంచో పార్టీలో ఉన్న‌వారికి కూడా ప్రాధాన్యం ఉండ‌డం లేదా ? అంటు అలాంటి సందేహాలే సీనియ‌ర్ నాయ‌కులు వ్య‌క్తం చేస్తున్నారు. వేరే పార్టీలో ఉండి తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని  అడ్డగోలుగా తిట్టిపోసిన వారికి పార్టీలోకి రాగానే పదవులు అలా వచ్చి వాలిపోతున్నాయి. ఇది ఇప్ప‌టి టీడీపీ ట్రెండ్ అన్న‌ట్టుగా మారింది.

పార్టీనే న‌మ్ముకుని, ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌ను ఓర్చుకుని ఉన్న నేత‌ల‌కు మాత్రం స‌రైన ప్రాధాన్యం ఉండ‌డం లేద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పార్టీ ఏ దిశగా వెళుతుందో అర్థం కావటంలేదని టీడీపీ నాయకులే వాపోతున్నారు. తాజాగా టీడీపీలో ఇప్ప‌డు చిత్ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. టీడీపీ నుంచి ప్ర‌జారాజ్యం పార్టీలోకి జంప్ చేసి అక్క‌డ చంద్ర‌బాబును, టీడీపీని తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్ట‌ని క‌ళా వెంక‌ట్రావు తిరిగి టీడీపీలోకి వ‌చ్చారు.

టీడీపీ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల్లో గుంటూరులో ఏపీ టీడీపీ కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో క‌ళా పార్టీ జండా ఆవిష్క‌ర‌ణ చేయ‌డంతో చాలా మంది టీడీపీ సీనియ‌ర్లు షాక్ తిన్నారు. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావే జెండా ఆవిష్కరణ చేయటంలో వింతేమీ లేదు. కానీ  పార్టీనే నమ్ముకుని ఉన్న నేతలకు టీడీపీలో ఎలాంటి ఆద‌ర‌ణ ఉందో ఈ సంఘ‌ట‌నే పెద్ద ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంద‌న్న చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

పార్టీలో ఎప్ప‌టి నుంచో ఉన్న వాళ్ల‌ను ప‌క్క‌న పెడుతోన్న చంద్ర‌బాబు ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేసిన వ‌చ్చిన వారికే పెత్త‌నం ఇస్తున్నారు. ఈ విష‌యాన్ని చాలా మంది సీనియ‌ర్లు పైకి చెప్పుకోక‌పోయినా లోప‌ల మాత్రం తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు.