తెలంగాణలో జనసేన టైం స్టార్ట్ అయ్యిందా!

సినీన‌టుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ ఇటీవ‌లే మూడో వార్షికోత్స‌వం జ‌రుపుకుంది. ప్ర‌శ్నిస్తాన‌ని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ+బీజేపీ కూట‌మికి త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ ఈ రెండు పార్టీల‌ను ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు వివిధ అంశాల‌పై నిల‌దీస్తూ జ‌న‌సేన స్వ‌తంత్య్ర‌త‌ను చాటుతున్నాడు. ఈ క్ర‌మంలోనే పార్టీ పెట్టి మూడు సంవ‌త్స‌రాలు కంప్లీట్ అయిన సంద‌ర్భంగా ప‌వ‌న్ ప‌లు కీల‌క అంశాల‌పై క్లారిటీ ఇచ్చేశాడు.

2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తుంద‌ని చెప్పిన ప‌వ‌న్ తాను మాత్రం ఏపీ నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తాన‌ని చెప్పారు. ప‌వ‌న్ జ‌న‌సేన ప్ర‌స్తుతం తెలంగాణ కంటే ఏపీలోనే చాలా దూకుడుగా ఉంది. ఏపీలో జ‌న‌సేన‌కు అన్ని జిల్లాల్లోను వేల సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఉన్నారు. అయితే ప‌వ‌న్ ఇంకా పూర్తిగా పొలిటిక‌ల్ క్షేత్రంలోకి దూక‌క‌పోవ‌డంతో జ‌న‌సేన సంస్థాగ‌తంగా ప‌టిష్టంగా లేదు.

ఇక తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడాన్ని సంగారెడ్డి సభ నుంచి ప్రారంభించనున్నట్టు పవన్ సంకేతాలు పంపిన విషయం విదితమే. అయితే, సంగారెడ్డిలో ఈ సభ ఏర్పాటు వెనుక కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ప‌వ‌న్‌కు, జ‌గ్గారెడ్డికి ఎంతో సాన్నిహిత్య ఉంది. గ‌తంలో జ‌గ్గారెడ్డి బీజేపీలో చేరి మెద‌క్ ఎంపీగా పోటీ చేయ‌డం వెన‌క ప‌వ‌న్ ఉన్నాడ‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి.

ఇప్పుడు తిరిగి ఆయ‌న కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌కు క‌నుచూపు మేర‌లో కూడా ఫ్యూచ‌ర్ క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో జ‌గ్గారెడ్డి కొత్త పార్టీ వైపు చూపులు చూస్తున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ్గారెడ్డి జ‌న‌సేన తెలంగాణ బాధ్య‌త‌లు చూస్తార‌ని… ఈ క్ర‌మంలోనే జ‌న‌సేనాని ప‌వ‌న్‌తో సంగారెడ్డి భారీ బ‌హిరంగ స‌భ పెట్టిస్తున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ స‌భ‌లోనే ఆయ‌న జ‌న‌సేన కండువా క‌ప్పుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని తెలంగాణ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.