2019 నాటికి `జన`సైనికుడు కావాలంటే ఇవి ఉండాలి..

పార్టీని స్థాపించి మూడేళ్ల‌యినా ఇంకా నిర్మాణ కార్య‌క్ర‌మాల‌పై దృష్టిసారించ‌డం లేద‌న్న విమ‌ర్శ‌ల‌కు చెక్ చెప్పారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌! ముఖ్యంగా యువ‌త‌కు పార్టీలో పెద్ద పీట వేస్తామ‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని.. ఇప్పుడు ఆ కార్యాచ‌ర‌ణ‌ను ప్రారంభించారు. తాను పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించిన అనంత‌పురం జిల్లా నుంచే ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ముఖ్యంగా జ‌నసేన సైనికుల‌కు పార్టీలోకి ఆహ్వానిస్తున్న‌ట్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌ట‌నలో వెల్ల‌డించారు.  జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జోరు పెంచారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

`జనసేన పార్టీలోని వివిధ విభాగాల్లో జన సైనికులను భాగస్వాములను చేసే కార్యక్రమం ప్రారంభమవుతోంది. పార్టీ తరపున గొంతెత్తడానికి స్థానిక, రాష్ట్రస్థాయి సమస్యలపై సమగ్రమైన అవగాహన ఉన్నవారిని స్పీకర్స్ గాను, రైటింగ్ స్కిల్స్ ఉన్నవారిని కంటెంట్ రైటర్స్ గాను, చక్కటి విశ్లేషణలను చేయగలవారిని అనలిస్టులుగా పార్టీకి సేవలందించేందుకు జనసేన ఆహ్వానం పలుకుతోంది. మిమ్మల్ని మీ ప్రాంతంలోనే కలుసుకుని మాట్లాడేందుకు జనసేన బృందం హైదరాబాద్ నుంచి మీ జిల్లాకు వస్తోంది. ఈ కార్యక్రమం ముందుగా అనంతపురం జిల్లా నుంచి ప్రారంభం అవుతుంది.` అని ఇందులో ప‌వ‌న్ వివ‌రించారు.

క్ర‌మ‌క్ర‌మంగా దీనిని ఇత‌ర జిల్లాల్లోనూ అమ‌లుచేస్తామ‌ని పేర్కొన్నారు.  ఎప్పుడు, ఎక్కడ కలుసుకోవాలో వివిధ మాధ్యమాల ద్వారా తెలియజేస్తామ‌ని వివ‌రించారు. ముందుగా త‌మ‌ పేరును జ‌న‌సేన వెబ్‌సైట్‌లో న‌మోదు చేసుకోవాలి. ఇందుకోసం www.janasenaparty.org/resourcepersons లింక్‌ను ఓపెన్ చేసి A) స్పీకర్, B) కంటెంట్ రైటర్, C) అనలిస్ట్‌ లలో ప్రాధాన్యత  తెల‌పాలి. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 4 వరకు పేర్ల‌ను రిజిస్ట‌ర్ చేసుకునే అవ‌కాశం ఉంది. కేవలం అనంతపురం జిల్లా జనసేన కార్యకర్తలకు, అభిమానులకు మాత్రమే ప్రస్తుతం వర్తిస్తాయ‌ని ప్రకటనలో తెలిపారు

దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో తీసుకోవాలంటే అనంతపురం సప్తగిరి సర్కిల్‌లోని శ్రీ బాలాజీ రెసిడెన్సీలో గల పార్టీ ఆఫీసునందు నేరుగా సంప్రదించాలని జనసేన సూచిస్తోంది. జనస్వరం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అందుబాటులో ఉంది. మొత్తానికి 2019 నాటికి సైనికుల‌ను త‌యారుచేసే ప్ర‌ణాళిక‌కు ప‌వ‌న్ వ్యూహం అమ‌లుచేస్తున్నార‌నేది మాత్రం స్ప‌ష్ట‌మ‌వుతోంది.