టీఆర్ఎస్‌లో బాబు మోహ‌న్ ప‌నైపోయిందా..!

April 22, 2017 at 9:45 am

సినీన‌టుడు బాబు మోహ‌న్‌.. టీఆర్ఎస్‌లో చేరి ఆందోల్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీ నాయ‌కులంద‌రితోనూ ఆయ‌న‌కు స‌త్సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. కానీ ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఇప్పుడు ఎదురుగాలి వీస్తోంది. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్వ‌హించిన స‌ర్వేలో బాబూ మోహ‌న్‌కు అతి త‌క్కువ మార్కులే రావ‌డం.. ఆయ‌నకు చిక్కులు తెచ్చిపెడుతోంది. అంతేగాక ఆయ‌న నియోజ‌కవ‌ర్గంలో కాంగ్రెస్ నేత‌, మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌కు ఎక్కువ మార్కులు ప‌డ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇక టీఆర్ఎస్‌లో ఆయ‌న శ‌కం దాదాపు ముగిసిన‌ట్టేన‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి, 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌డం క‌ష్ట‌మ‌ని భావిస్తున్నారు.

స‌ర్వేలో వ‌చ్చిన మార్కుల ఆధారంగానే వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్ల కేటాయింపు జ‌రుగుతుంద‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు మొద‌లైంది. ఇది నిజ‌మేన‌ని చెప్పేలా.. సీఎం కేసీఆర్‌.. లీకులు కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌ని ప‌దేప‌దే చెబుతున్నారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌తిప‌క్షాలు బ‌లంగా ఉన్నాయని, జాగ్ర‌త్తగా ఉండాల‌ని హెచ్చిరిస్తున్నారు. అయినా ఆందోల్‌లో మాత్రం ప‌రిస్థితి మార‌డం లేదు. కేసీఆర్‌ సర్వేలో జిల్లాలోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరికన్నా బాబు మోహ‌న్ వెనుకబడటం కాంగ్రెస్‌కు బలాన్ని ఇచ్చినట్టయ్యింది.

సంగారెడ్డి జిల్లాలోనే పెద్ద నియోజకవర్గం ఆందోల్‌! ఇక్కడ నుంచి గెలిచినవారంతా వ్యక్తిగత ప్రయోజనాలు పొందారే తప్ప నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ వర్గాలలో ఎన్నడూ లేనంత ఉత్సాహం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జరిపించిన సర్వేలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాబూ మోహన్‌ కంటే దామోదర్‌కే ఎక్కువ మార్కులు పడటాన్ని వారు గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికలల్లో రెండువేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయిన దామోదర్‌కు ఈసారి మెజారిటీ ఖాయమంటున్నారు.

ఇప్పటికే ఆందోల్‌లో కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు దామోదర్‌తో టచ్‌లో ఉన్నారట! 2014 ఎన్నికల్లో తెలంగాణవాదానికి ఓటేసి గెలిపించామే తప్ప బాబూమోహన్‌ను చూసి కాదని చెబుతున్నారట గులాబీదళంలోని కొందరు నేతలు! 2019లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా కనీసం నమ్ముకున్న లీడర్లు గెలిస్తే చాలని అనుకుంటున్నారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. మ‌రి బాబూమోహ‌న్ త‌న ప‌నితీరు మెరుగుప‌రుచుకుంటారో లేదో వేచిచూడాల్సిందే!!

టీఆర్ఎస్‌లో బాబు మోహ‌న్ ప‌నైపోయిందా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts