కోదండ‌రామ్ పార్టీపై కొత్త ట్విస్ట్‌…!

తెలంగాణ‌లో టీఆర్ఎస్ త‌ప్ప మ‌రే ఇత‌ర పార్టీకి కూడా మ‌నుగ‌డ లేకుండా చేసేశారు గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌! కాంగ్రెస్‌, తెలుగుదేశం వంటి పార్టీల అస్థిత్వాన్ని ప్ర‌శ్నార్థ‌కం చేసి టీఆర్ఎస్ ఒక్క‌టే తెలంగాణ పార్టీ అనేంత‌గా చేసేశారు. అయితే టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా మరో కొత్త పార్టీని జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం ప్రారంభించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నా.. వాటిని ఖండిస్తూనే ఉన్నారు. కానీ తెర వెనుక ఈ పార్టీకి సంబంధించిన వ్య‌వ‌హారాల‌న్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయట‌. ఇప్ప‌టి నుంచే పార్టీలోకి చేరే వారికి ఆహ్వానాలు కూడా అందిపోతున్నాయట‌. ముఖ్యంగా ఈ ఏడాది జూన్ నుంచి మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం!!

తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర పోషించిన జేఏసీ చైర్మ‌న్‌.. కొద్దికాలం నుంచీ టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ కూడా ఆయ‌న్ను టార్గెట్ చేస్తూనే ఉంది. ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌లో మ‌రోకొత్త రాజ‌కీయ వేదిక.. కోదండ‌రామ్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటుకాబోతోంద‌నే వార్త‌లు ఇటీవ‌ల బ‌లంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ‌లో మ‌రో రాజ‌కీయ పార్టీ అవ‌స‌రం ఎంతైనా ఉందని, రాజ‌కీయ ప‌క్షాల‌న్నీ క‌లిసి ఒక వేదిక‌గా ఏర్ప‌డే విధానంపై ఆలోచిస్తున్నామ‌ని ఆయ‌న గ‌తంలో సంకేతాలు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే!! అయితే, తాజాగా తెలంగాణ యాక్టివ‌స్టు గాదె ఇన్న‌య్య పేరుతో సోష‌ల్ మీడియాలో ఓ సందేశం వైర‌ల్ అవుతోంది.

కోదండ‌రామ్ భాగ‌స్వామ్యంలో ఏర్పాటు కాబోతున్న పార్టీలో చేరాల‌నుకునేవారు త‌మ‌ని కాంటాక్ట్ చెయ్యొచ్చ‌ని ఇందులో ఉండ‌టం ఇప్పుడు మ‌రోసారి చ‌ర్చ‌కు శ్రీ‌కారం చుట్టింది. జూన్ నెల త‌రువాత తెలంగాణ రాజకీయాల్లో సంచ‌ల‌నాలు ఉంటాయంటూ ఇన్న‌య్య సోష‌ల్ మీడియాలో విశ్లేష‌ణ‌లు చేస్తూ ఉన్నారు. జూన్ నుంచి పార్టీకి సంబంధించిన కొన్ని ప‌నులు ప్రారంభించి.. ర‌క‌రకాల వేదికల ద్వారా అభిప్రాయాలు సేక‌రించి.. ద‌శలువారీగా క‌మిటీలు వేసుకుంటూ ఈ ఏడాది అక్టోబ‌ర్ లో పార్టీ ఏర్పాటు ఉంటుంద‌నే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

త్వ‌ర‌లో తెలంగాణ‌లో రాజ‌కీయ వ‌ల‌స‌లు ఉంటాయ‌ని కూడా ఆయ‌న జోస్యం చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో తాజా మెసేజ్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొత్త రాజ‌కీయ పార్టీని పెట్టాల‌నే అంశం ఇంత‌వ‌ర‌కూ జేయేసీలో చ‌ర్చ‌కు వ‌చ్చింది లేద‌ని కోదండ‌రామ్‌ అంటున్నారు. ఇలాంటి క‌థ‌నాల‌ను, సందేశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌ద్ద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కానీ అడుగులు మాత్రం అటువైపే ప‌డుతున్నాయ‌ట‌.