మూడు జిల్లాల్లో మునిగిపోతోన్న వైసీపీ

విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నికల్లో విజ‌యం సాధించాల‌ని ఎన్నో ప్లాన్లు వేస్తున్నాడు. జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ఎలా ఉన్నా చాలా జిల్లాల్లో వైసీపీ రోజు రోజుకు బ‌లం కోల్పోతుంది. కోస్తాలో కీల‌క‌మైన ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అని ప్ర‌శ్నించుకుంటే ఆ పార్టీ వాళ్లే ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. ఓ వైపు టీడీపీ దూకుడు, అంత‌ర్లీనంగా స్ట్రాంగ్ అవుతోన్న జ‌న‌సేన దెబ్బ‌తో రోజు రోజుకు అక్క‌డ వైసీపీ డీలా ప‌డిపోతోంది.

ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీకి కాస్తో కూస్తో బ‌లమైన నాయ‌కులే ఉన్నా గ్రూపు రాజ‌కీయాల కుమ్ములాట‌ల‌తో వైసీపీ రోజు రోజుకు దిగ‌జారుతోంది. కీల‌క‌మైన విశాఖ జిల్లా బాధ్య‌త‌ల‌ను జ‌గ‌న్ రాజ‌కీయంగా అనుభ‌వం లేని గుడివాడ అమ‌ర్నాథ్‌కు అప్ప‌గించారు. టీడీపీలో కార్పొరేట‌ర్‌గా ప‌నిచేసిన అమ‌ర్నాథ్ ఒంటెద్దు పోక‌డ‌ల‌తో జిల్లాలోని వైసీపీ నాయ‌కులు గుర్రుగా ఉన్నారు. ఈ విష‌యంలో వారు జ‌గ‌న్ ప‌ట్ల కూడా ఆగ్ర‌హంగా ఉన్నారు.

పార్టీ ప‌రంగాను, ప్ర‌జా స‌మ‌స్య‌ల విష‌యంలోను అమ‌ర్నాథ్ తీసుకునే నిర్ణ‌యాలు పార్టీ నాయ‌కుల‌కు న‌చ్చ‌డం లేదు స‌రిక‌దా..? ప‌్ర‌జ‌ల్లో ఇవి మైలేజ్ పెంచ‌డం లేదు. ఇప్ప‌టికిప్పుడు గ్రేట‌ర్ విశాఖ ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీ విజ‌యం ఖాయ‌మ‌న్న చ‌ర్చ‌లు కూడా రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఇక విజ‌య‌న‌గ‌రం జిల్లాలో బొత్స ఫ్యామిలీ వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చాక బొబ్బిలి రాజులు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అక్క‌డ పార్టీలో ఎంత‌మంది నాయ‌కులు ఉన్నా బొత్స‌ను కాద‌ని ఎవ్వ‌రూ మాట్లాడ‌లేరు. ఎద‌గ‌నూ లేరు. దీంతో అక్క‌డ కూడా వైసీపీ పూర్తిగా బొత్స ఫ్యామిలీ చేతుల్లో క‌బ్జా అయిపోయింది.

ఇక శ్రీకాకుళం జిల్లాలో ధ‌ర్మాన సోద‌రుల మ‌ధ్యే స‌ఖ్య‌త లేదు. మాజీ మంత్రి త‌మ్మినేని సీతారాంతో పాటు జిల్లా పార్టీ అధ్య‌క్షురాలిగా ఉన్న రెడ్డి శాంతి వ‌ల్ల జిల్లాలో పార్టీకి ఎంత‌మాత్రం యూజ్ లేదు. ఈ జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న అచ్చెన్నాయుడు, క‌ళా వెంక‌ట‌రావు దూకుడు ముందు వైసీపీ ఆగ‌లేక‌పోతోంది. జిల్లా నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో పాత‌ప‌ట్నం ఎమ్మెల్యే పార్టీ మారిపోగా మ‌రో ఇద్ద‌రు కూడా ఇదే బాట‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.