కేసీఆర్ `తెలుగు` సెంటిమెంట్ వెనుక వ్యూహ‌మిదే

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. ఏం మాట్లాడినా దాని వెనుక అర్థం, ప‌రమార్థం ఉంటాయ‌నేది విశ్లేష‌కులకే కాదు క‌నీస రాజ‌కీయ అవ‌గాహ‌న ఉన్న వారికి కూడా సులువుగా అర్థ‌మ‌వుతుంది. ఎప్పుడూ భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకునే ఆయ‌న కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు! ఇప్పుడు అలాంటి నిర్ణ‌యంతో ఏపీలో పాగా వేయాల‌ని చూస్తున్నారు. టీఆర్ఎస్‌ను.. ఏపీలోనూ విస్త‌రించేందుకు ప‌క్కా ప్లాన్‌తో సిద్ధ‌మ‌వుతున్నారు. ప్రాంతీయ పార్టీల హ‌వా న‌డిస్తున్న స‌మ‌యంలో.. వేరే రాష్ట్రానికి చెందిన‌ పార్టీ.. అందులోనూ ఏపీని తీవ్రంగా అవ‌మానించిన పార్టీని ఎలా ఆద‌రిస్తారో లేదో అనే జంకు లేకుండా.. మ‌రి ఏ ధైర్యంతో ప్ర‌య‌త్నిస్తున్నార‌నేది స‌స్పెన్స్‌!!

మొన్న‌టికి మొన్న రైతుల‌కు ఉచితంగా ఎరువులు పంపిణీ చేస్తామ‌ని ప్ర‌క‌టించి ప్ర‌తిప‌క్షాల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌! అంతకుముందు ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్ కోసం అసెంబ్లీలో బిల్లు ప్ర‌వేశ‌పెట్టారు. ఇలా సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్న ఆయ‌న‌.. ఇప్పుడు ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు నిర్వ‌హించారు. అంతేగాక వీటిని హైద‌రాబాద్లోనే ఏర్పాటుచేయాల‌ని డిసైడ్ అయ్యారు. `తెలుగు` మాట వింటేనే అంతెత్తున నిలిచే కేసీఆర్‌.. ఇప్పుడు తెలుగు మ‌హాస‌భ‌లనే నిర్వ‌హించాల‌నే నిర్ణ‌యాన్ని చూసి చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే దీని వెనుక చాలా కారణాలే ఉన్నాయ‌ట‌.

`ఎక్కడి తెలుగుతల్లి` అంటూ ఉద్యమ సమయంలో `తెలుగు` భాషనే అవమానపరిచిన కేసీఆర్.. ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలనుకోవడం కాస్త విడ్డూరమే. ప్రపంచ తెలుగు మహా సభలను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. జూన్ 2 నుంచి 10 వరకు జరిగే ఈ సభలను ఘనంగా జరుపుతారట. సంక్రాంతి సమయంలో భీమవరం నుంచి పోటీచేస్తానని మంత్రి కేటీఆర్ చెప్పారు. అప్పట్లో టీఆర్ఎస్ ను తెలుగు రాష్ట్ర సమితి అని కూడా కేటీఆర్ చెప్పారు. అంటే టీఆర్ఎస్ పార్టీలో ఏపీలో కాలుమోపే వ్యూహంపై చర్చ జరుగుతూనే ఉంది. ఇందుకు ప్రపంచ తెలుగు మహాసభలను వేదికగా చేసుకోవాలని అనుకుంటున్నారు.

దీంతో టీఆర్ఎస్ ఏపీలో కూడా జెండా పాతుతుందని అంతా భావించారు. అయితే కేటీఆర్‌ లైట్ తీస్కోమనడంతో అంతా ఆ సంగతి మరిచిపోయారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రా రాజకీయ నేతల్నే కాకుండా ప్రజల్ని కూడా తిట్టిన కేసీఆర్ కు ఇక్కడ డిపాజిట్లు కూడా రావనేది నిపుణుల మాట. అయినా తెలుగు` సెంటిమెంట్ తో కొట్టాలని కేసీఆర్ డిసైడయ్యారు. `తెలుగు` మహాసభలకు ఏపీ మేధావుల్ని ఆహ్వానించడం ద్వారా.. జనాన్ని మంచి చేసుకోవాలను అనుకుంటున్నారు. కానీ ప్రాంతీయ పార్టీలు రెండు రాష్ట్రాల్లో మనగలగడం కష్టమని టీడీపీతో తేలిపోయింది.