ఆ విష‌యంలో చంద్ర‌బాబు లెక్క త‌ప్పిందా? 

బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌జ‌ల‌తో మాట్లాడించ‌డం.. వారిని ప్ర‌శ్న‌లు అడ‌గ‌టం చేస్తూ ఉంటారు సీఎం చంద్ర‌బాబు! వారు టీడీపీ ప‌థ‌కాల గురించి, త‌న గురించి ఏం చెబుతారోన‌ని తెలుసుకునేందుకు ఇలాంటివ‌న్నీ ప్ర‌త్యేకంగా రూపొందిస్తుంటారు. ఇటీవ‌ల పశ్చిమ‌గోదావ‌రిలో నిర్వ‌హించిన స‌భ‌లోనూ ఇలాగే గ్రామ‌స్తులతో మాట్లాడించిన ఆయ‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. ప్ర‌జల్లో టీడీపీపై సంతృప్త స్థాయిని పెంచాల‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు నేత‌ల‌కు చెబుతూ ఉంటారు. 80 శాతం సంతృప్తిగా ఉన్నార‌ని. మిగిలిన వారిని కూడా ఈ జాబితాలో చేర్చాల‌ని చెబుతూ ఉంటారు. అయితే స‌ర్వేల్లో, వాస్త‌వంగా ప్ర‌జ‌ల సంతృప్తి స్థాయికి తేడా ఉంటుంద‌ని బ‌హిరంగంగా తేల‌డంతో అవాక్క‌వ‌డం చంద్ర‌బాబు వంత‌యింది.

తెలుగుదేశం పాల‌న‌పై ఏపీ ప్ర‌జ‌లు ఏమేర‌కు సంతృప్తిగా ఉన్నారో తెలుసుకునేందుకు సీఎం చంద్ర‌బాబు ఇటీవ‌ల ఓ స‌ర్వే చేయించారు. అందులో 80 శాతం సంతృప్తిగా ఉన్నార‌ని తేలింది. మ‌రో 20 శాతం కూడా సంతృప్తి సాధించాల‌ని

టార్గెట్స్ ఫిక్స్ చేశారు! ఈ స‌ర్వే లెక్క‌లు రివ‌ర్స్ అయిన సంద‌ర్భం ఇది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పోత‌వ‌రం వ‌ద్ద ఓ స‌భ జ‌రిగింది. ఇక్క‌డ జరిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌నీ, ఎన్నో ప‌థ‌కాల ద్వారా ల‌బ్ధి చేకూర్చుతున్నార‌నీ ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌లంద‌రూ సంతోషంగా ఉన్నారా… ఎంత‌మంది ఉన్నారంటూ చేతులు ఎత్త‌మ‌ని కోరారు.

ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన స‌మాధానంతో చంద్ర‌బాబు ఖంగు తినాల్సి వ‌చ్చింది. టీడీపీ పాల‌న‌పై తాము సంతృప్తిగా లేమ‌ని వారంతా చెప్ప‌డంతో అవాక్కయ్యారు. ఎంత‌మంది అసంతృప్తిగా ఉన్నారని మ‌ళ్లీ అడిగితే.. స‌భ‌లో పాల్గొన్న దాదాపు 70 మంది చేతులు ఎత్తార‌ట‌. అక్క‌డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఏంట‌ని ప్ర‌శ్నిస్తే… ప్ర‌తీ చిన్న ప‌నికీ వీఆర్వోలు లంచాలు అడుగుతున్నార‌ని కొంద‌రు, రెండేళ్లుగా పెన్ష‌న్లు అంద‌డం లేద‌ని మ‌రికొంద‌రూ ఇలా ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల‌తో ప్ర‌జ‌లు వాపోయారు. దీంతో టీడీపీ నేత‌లంద‌రూ కామ్ గా ఉండిపోయార‌ట‌.

రాష్ట్రంలో 80 శాతం ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నారంటూ ఓ ప‌క్క ఘ‌నంగా ప్ర‌చారం చేసుకుంటూ ఉంటే… ఇక్క‌డ 70 శాతం ప్ర‌జ‌లు అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. ఇంత‌కీ, చంద్ర‌బాబు పాల‌న‌పై ఎంత‌మంది అసంతృప్తిగా ఉన్నారు..? ఇలాంటి గ్రామాలు ఇంకెన్ని ఉన్నాయి? ఇలాంటి ఎన్నో ప్రశ్న‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.