ఏపీలో టీడీపీకి 150 – వైసీపీకి 125 – జ‌న‌సేన‌కు 55 సీట్లు

వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు వాస్త‌వంగా మ‌రో 20 నెల‌ల గ‌డువు ఉంది. అయితే 2018లోనే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ జ‌మిలీ ఎన్నిక‌ల‌కు వెళ‌తార‌ని..ఈ క్ర‌మంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణ‌లోను ముంద‌స్తు ఎన్నిక‌లు ఉంటాయ‌న్న వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. అదే జ‌రిగితే 2018లోనే ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం త‌థ్యం. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీలో రాజ‌కీయం కాస్తా రంజుగా మారుతోంది.

అధికార టీడీపీ మ‌రోసారి గెలుపుకోసం త‌న వంతు ప్ర‌య‌త్నాలు తాను చేస్తోంది. ఇక విప‌క్ష వైసీపీ నాయ‌కులు త‌మ పార్టీ ఈ సారి గెల‌వ‌క‌పోతే ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌కు, త‌మ‌కు పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ లేద‌ని తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఇక కొత్త‌గా ఎంట్రీ ఇస్తోన్న జ‌న‌సేన సైతం స‌త్తా చాటేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. అయినా ఇంకా పూర్తిస్థాయిలో ప‌వ‌న్ త‌న పార్టీ కార్య‌క‌లాపాలు మాత్రం స్టార్ట్ చేయ‌డం లేదు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌దే విజ‌యం అంటూ డ‌ప్పులు మొగించుకుంటోన్న టీడీపీ, వైసీపీ త‌మ‌కు అన్ని సీట్లు వ‌స్తాయ‌ని, ఇన్ని సీట్లు వ‌స్తాయ‌న్న ప్ర‌చారం ఊద‌ర‌గొట్టేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయ‌కులు బ‌హిరంగ వేదిక‌ల మీదే త‌మ‌కు ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే 175 సీట్ల‌కు 150 సీట్లు గ్యారెంటీ అంటున్నారు. ఇక మంత్రి లోకేశ్ అయితే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న లెక్క‌లేసుకుని టీడీపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో 200 సీట్లు వ‌స్తాయ‌ని చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చారు.

టీడీపీ వెర్ష‌న్ ఇలా ఉంటే విప‌క్ష వైసీపీ నాయ‌కులు కూడా ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఓడిపోవ‌డం ప‌క్కా అని..త‌మ‌కు 125 సీట్లు వ‌స్తాయ‌ని చెపుతున్నారు. ఇక జ‌న‌సేన నాయ‌కులు సైతం త‌మ‌కు 55 సీట్లు వ‌స్తాయ‌న్న విష‌యాన్ని ఓపెన్‌గానే చెపుతున్నారు. మ‌రి వీళ్ల లెక్క‌లు ఎలా ఉన్నా అస‌లు ఓట‌రు దేవుళ్లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రి త‌ల‌రాత‌ల‌ను ఎలా మారుస్తారో చూడాలి.