జ‌గ‌న్‌ను టెన్ష‌న్ పెట్టిన మాజీ సీఎం కొడుకు

త‌మ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను `ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌` ద్వారా చేర్చుకున్న టీడీపీ నేత‌ల‌ను ఎలాగైనా దెబ్బ‌కొట్టాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ ప్ర‌య‌త్నంలోనే ఆయ‌న ఆప‌రేష‌న్ `కాంగ్రెస్‌`కు తెర‌తీశారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లో బాగా ప‌లుకుబ‌డి ఉన్న నేత‌లతో మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట‌. ఈ ప్ర‌య‌త్నంలోనే రాయ‌ల‌సీమ‌కు చెందిన మాజీ సీఎం త‌న‌యుడితో మాట్లాడిన జ‌గ‌న్ రాయ‌బారుల‌కు చుక్కెద‌రైంద‌ట‌. ఆయ‌న ఆలోచన విన‌గానే జ‌గ‌న్‌లో టెన్ష‌న్ మొద‌లైంద‌ట‌. త‌న పార్టీలో చేర‌క‌పోయినా ఫ‌ర్వాలేదు గానీ.. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం ఆచ‌ర‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డితే వైసీపీకి రాయ‌ల‌సీమ‌లో తీవ్ర‌ న‌ష్టం క‌లుగుతుంద‌ని కంగారు ప‌డుతున్నార‌ట‌.

2019 ఎన్నికల టార్గెట్ తో వైసీపీ ని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత జగన్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. టీడీపీ అసంతృప్తులకి గాలం వేసినా.. అవి ఫలించకపోవడంతో ప్రస్తుతానికి ఆ పని పక్కనబెట్టి కాంగ్రెస్ లో పలుకుబడి ఉన్న వారిని వైసీపీ లోకి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఇద్దరు మాజీ సీఎం ల కొడుకులతో జగన్ తరపున రాయబారం వెళ్లినట్టు తెలుస్తోంది. అందులో ఒకరు జగన్ ఆఫర్ కి ఎస్ అంటే, ఇంకోరు జ‌గ‌న్‌ను కంగారు పెట్టినంత ప‌నిచేశార‌ట‌.

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తనయుడు మనోహర్ వైసీపీ ఆహ్వానాన్ని మన్నించినట్టు సమాచారం. ఆయ‌న కూడా కొన్నాళ్లుగా ప్రత్యామ్న్యాయ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయం పసిగట్టిన జగన్ అండ్ కో ఆయన్ని సగౌరవంగా పార్టీలోకి ఆహ్వానించింది. త్వరలో మంచి ముహూర్తం చూసుకుని మనోహర్ జగన్ పంచన చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక కర్నూల్ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కి కూడా వైసీపీ నుంచి ఆహ్వానం అందింది. ఈ వయసులో పార్టీ మారడం ఇష్టం లేదని చెప్పి విముఖ‌త వ్య‌క్తంచేశార‌ట‌.

ఆయ‌న తండ్రితో కూడా రాయ‌బారం న‌డిపార‌ట వైసీపీ నేత‌లు! దానికి కూడా ఒప్పుకోని ప్రకాష్ రెడ్డి ఇంకో బాంబు పేల్చాడట. రాయలసీమకి జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైతే `కోట్ల` పేరుతో కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధమని కూడా చెప్పారట. దీంతో వారి గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తుతున్నాయి. అస‌లే భూమా కుటుంబం టీడీపీలో చేర‌డంతో కర్నూల్ జిల్లాలో పార్టీ బలం తగ్గిందని, ఇక కోట్ల కుటుంబం రాయలసీమ పేరు చెప్పి ఇంకో పార్టీ పెడితే వైసీపీ నష్టపోతుందని జగన్ భయపడుతున్నారట. కోట్ల కుటుంబానికి ఓ ఎంపీ,ఓ ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పార్టీ లోకి తీసుకురావాలని జ‌గ‌న్‌ ఆదేశించారట. మ‌రి రాజ‌కీయాలు ఏమ‌లుపు తీసుకుంటాయో!!