టీటీడీ చైర్మ‌న్ రేసులో తెర‌పైకి బీసీ ఎమ్మెల్యే

టీటీడీ చైర్మ‌న్ రేసులో ఏపీలో అధికార టీడీపీ నుంచి రోజుకో కొత్త‌పేరు తెర‌మీద‌కు వ‌స్తోంది. నిన్న‌టి వ‌ర‌కు ఈ పోస్టు రేసులో ఎంపీలు రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, మాగంటి ముర‌ళీమోహ‌న్ పేర్లు బ‌లంగా వినిపించాయి. ఇక ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు పేరు సైతం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇక ఇప్పుడు ఈ జాబితాలో ఇప్పుడు కృష్ణా జిల్లా పెడ‌న ఎమ్మెల్యే, బీసీ నేత‌గా ఉన్న కాగిత వెంక‌ట్రావు పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది.

బ‌ల‌మైన బీసీ నేత‌గాను, సీనియ‌ర్ ఎమ్మెల్యేగా ఉన్న కాగిత‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆయ‌న తీవ్రంగా అలిగారు. పార్టీకి రాజీనామా చేస్తాన‌ని సైతం ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు బుజ్జ‌గింపుల‌తో చ‌ల్ల‌బ‌డ్డారు. గ‌తంలో కొద్ది నెల‌ల పాటు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వితో పాటు మంత్రిగా కూడా ఆయ‌న ప‌నిచేశారు.

ఇక ప్ర‌స్తుతం టీడీపీలో చంద్ర‌బాబు సామాజిక‌వ‌ర్గం వారికే ఎక్కువ ప‌ద‌వులు ద‌క్కుతున్నాయ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇవ‌న్నీ గ‌మ‌నించిన చంద్ర‌బాబు కీల‌క‌మైన టీటీడీ చైర్మ‌న్ పోస్టును బీసీలకు ఇవ్వాల‌ని బాబు కొత్త ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే క్ర‌మంలో టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విని కాగిత వెంక‌ట్రావుకు ఇచ్చే అంశంపై బాబు ఆలోచ‌న చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇటీవ‌ల కాగిత‌కు గుర్తింపు క‌ల పోస్టు ఇస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చార‌ట‌. ఈ క్ర‌మంలో కాగిత‌కే టీటీడీ చైర్మ‌న్ పోస్టు ద‌క్కుతుంద‌ని ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి.