బీజేపీని వ‌దిలించుకునే ప‌నిలో టీటీడీపీ

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఎవ‌రూ ఉండ‌రనే సూత్రాన్ని టీటీడీపీ వంట‌బ‌ట్టించుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో బీజేపీతో జ‌త క‌ట్టినా.. ప్ర‌స్తుతం మిత్ర బంధం తెగిపోయేందుకు సిద్ధంగా ఉంది. దీంతో అస్థిత్వం కోసం జ‌రిగే పోరాటంలో కొత్త మిత్రుల వేట‌లో టీటీడీపీ నేత‌లు వెదుకులాట ప్రారంభించారు. టీడీపీకి శ‌త్రువయిన కాంగ్రెస్‌తో జ‌త‌క‌ట్టాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ముఖ్యంగా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇదే అభిప్రాయాన్ని ప‌రోక్షంగా అధినేత చంద్ర‌బాబు ముందు ఉంచ‌డం ఇప్పుడు ప్రాధాన్యం సంత‌రించుకుంది. బీజేపీతో పొత్తుకు గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్‌తో జ‌త‌క‌ట్టేందుకు సిద్ధ‌మవుతుండ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే!

కాంగ్రెస్‌, టీడీపీ.. రెండూ విరుద్ధ స్వ‌భావాలు క‌లిగిన పార్టీలు! టీడీపీ ఆవిర్భావానికి కాంగ్రెస్ ప్ర‌ధాన కార‌ణం! టీడీపీ గ‌త చ‌రిత్ర అంతా కాంగ్రెస్ పై పోరాట‌మే. మ‌రి అలాంటి పార్టీలు తెలంగాణ‌లో ఇప్పుడు అస్థిత్వం కోసం పోరాడుతున్నాయి. టీఆర్ఎస్ దెబ్బ‌కు కుదేలైపోయాయి. రెండింటి ల‌క్ష్యం టీఆర్ఎస్‌ను ఓడించ‌డం. అందుకే టీటీడీపీ స‌రికొత్త ప్ర‌తిపాద‌న‌తో ముందుకొచ్చింది. క‌లిసి పోరాడ‌దాం అనుకుంటూ ఉంటే.. క‌మ‌ల‌నాధులు దూరం పెడుతున్నారు. ఒంట‌రి పోరాడ‌దాం అనుకుంటే.. స‌రిప‌డా బ‌లం లేదాయె! ఇప్పుడు టీడీపీ ముందున్న ఒకే ఒక్క ఆప్ష‌న్… కాంగ్రెస్ తో చేతులు క‌ల‌ప‌డం! అయితే ఈ విష‌యంపై రేవంత్ రెడ్డి అభిప్రాయం మ‌రోలా ఉంది.

భాజ‌పా – టీడీపీలు పొత్తులో ఉన్నాయి. అయితే, అది కేవ‌లం ఆంధ్రా వ‌ర‌కూ ప‌రిమితం అనేది భాజ‌పా నేత‌ల వాద‌న‌. ఇక తెలంగాణ‌లో సోలోగానే స‌త్తా చాటుకునే ప్ర‌య‌త్నాల్లో భాజ‌పా నిమ‌గ్న‌మైంది. ఇదే అంశాన్ని ఇటీవ‌ల అధ్య‌క్షుడు చంద్ర‌బాబుతో రేవంత్ ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తోంది. ఇత‌ర పార్టీల‌తో పొత్తు విష‌య‌మై కాస్త లిబ‌ర‌ల్ గా ఉంటే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌. తెలంగాణ‌లో భాజ‌పా నేత‌ల తీరు అవ‌మాన‌క‌రంగా ఉంటోంద‌నీ, వారితో పొత్తు విష‌య‌మై స్ప‌ష్ట‌త‌కు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రేవంత్ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా ఉండాలంటే పొత్తుల విష‌యంలో స్ప‌ష్ట‌త అవ‌స‌ర‌మ‌ని సూచించిన‌ట్లు స‌మాచారం.

రేవంత్ మ‌న‌సులో మాట ఏంటంటే.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే మంచిద‌ని ఇన్ డైరెక్ట్ గా చెప్ప‌క‌టే చెప్పార‌ట‌. తెలంగాణ‌లో ప్ర‌త్యేక రాజ‌కీయ ప‌రిస్థితులు ఉన్నాయి కాబ‌ట్టి.. కాంగ్రెస్ తో జ‌తక‌ట్ట‌డం త‌ప్పులేద‌ని ఆయ‌న అభిప్రాయంగా తెలుస్తోంది. భాజ‌పాతో ప్ర‌యాణంపై చంద్ర‌బాబు ఒక క్లారిటీ ఇవ్వ‌గానే… కాంగ్రెస్ తో పొత్తుపై రేవంత్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. అయితే, తెలంగాణ విష‌య‌మై త్వ‌ర‌లోనే అమిత్ షాతో చంద్ర‌బాబు మాట్లాడ‌తార‌నీ, అంత‌వ‌ర‌కూ ప్ర‌త్యామ్నాయ ఆలోచ‌న‌లు ఆపాలని చంద్ర‌బాబే సూచించిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఈ కొత్త పొత్తును తెలంగాణ ప్ర‌జ‌లు స్వీక‌రిస్తారో లేదో!!