బ‌డా హామీలు.. చోటా చేత‌లు..  బాబు మూడేళ్ల పాల‌న తీరుతెన్నులు!

June 9, 2017 at 5:14 am

జాబు కావాలంటే.. బాబు రావాలి! ఆయ‌నొస్తున్నారు.. మ‌న స‌మ‌స్య‌ల‌న్నీ తీర్చేస్తారు!! ఖ‌చ్చితంగా మూడేళ్ల కింద‌ట ఎన్నిక‌ల ప్ర‌చారంలో హోరెత్తిన నినాదాలివి! టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌ర‌ఫున మీడియా ప‌నిగ‌ట్టుకుని చేసిన ప్ర‌చారంలో మ‌చ్చుకు రెండు స్లోగ‌న్లు మాత్ర‌మే ఇవి! అయితే, నిజానికి బాబు వ‌చ్చాక జాబులొచ్చాయా? ఆయ‌నొచ్చారు కాబ‌ట్టి.. స‌మ‌స్య‌లు తీరిపోయాయా? అంటే నీళ్లు న‌మ‌లాల్సిన ప‌రిస్థితి దాపురించింది. ఏపీలో బాబు పాల‌న‌కు శుక్ర‌వారంతో ముచ్చ‌ట‌గా మూడేళ్లు నిండిపోయాయి. దీంతో అప్ప‌ట్లో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాల ప‌రిస్థితి ఏమిటి? ఓ సారి సింహావ‌లోక‌నం చేద్దాం.

ఆ ఒక్క విష‌యంలో త‌ప్ప‌!!

రాష్ట్రంలో సామాజిక ఫింఛ‌న్ల విష‌యంలో మాత్రం చంద్ర‌బాబు అనుకున్న‌ది సాధించారు. అదేవిధంగా రేష‌న్ పంపిణీలోనూ ఆయ‌న ముందున్నార‌నే చెప్పాలి. అయితే, ఈ రెండు అందుకుంటున్న సామాజిక వ‌ర్గాలు రాష్ట్రంలో కేవ‌లం 14 శాతం మాత్ర‌మే అంటే వంద‌లో మ‌రో 86 శాతం మందికి బాబు ఏం చేస్తున్నారు? అని ప్ర‌శ్నిస్తే.. స‌మాధానం లేదు. ముఖ్యంగా విద్యార్థుల‌కు, నిరుద్యోగుల‌కు ఇచ్చిన హామీలు బాబు నేటికీ కార్య‌రూపంలో పెట్ట‌లేదు. నిరుద్యోగ భృతి విష‌యంపై ఇటీవ‌ల ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించినా.. విధివిధానాలు కేటాయింపులు లేక‌.. ఈ మాట నీటి మూట‌గానే మిగిలింది.

ఇక‌, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ కూడా దాదాపు అట‌కెక్కిన‌ట్టే క‌నిపిస్తోంది. మ‌రోప‌క్క‌, ఎన్‌టీఆర్ ఆరోగ్య సేవ‌కు ఇవ్వాల్సిన రాయితీలూ ఇవ్వ‌డంలేదు. దీంతో కొర్పోరేట్ ఆస్ప‌త్రులు ఇష్టానుసారం ఆడుకుంటున్నాయి. ఇక‌, మ‌రో ముఖ్య విష‌యం రైతు రుణ‌మాఫీ. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం చేసింది రైతు రుణమాఫీ ఫైలుపైనే. ఎన్నికల మ్యానిఫేస్టోలో రైతు రుణమాఫీని చేస్తామన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీలో షరతులు విధించారు. రుణమాఫీ కింద 10,070 కోట్లను మాత్రమే ఇప్ప‌టికి మాఫీ చేశారు.

డ్వాక్రా మహిళలకు కూడా పదివేల కోట్ల రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు ప్రకటించారు. అయితే ఇందులో కూడా చంద్రబాబు ప్రభుత్వం షరతులు విధించింది. ఇప్పటివరకూ ఆరు వేల కోట్ల రూపాయల రుణాలను విడుదల చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ డ్వాక్రా మహిళలకు మాత్రం ఏ మాత్రం ప్రయోజనం చేకూరలేదంటున్నారు. ఇక మరోసంతకం బెల్ట్ షాపులను ఎట్టిపరిస్థితుల్లో కొనసాగనివ్వమనేది. అది కూడా నీటి మీద రాతలానే ఉంది.

2014 ముందు ఏపీలో బెల్ట్ షాపులు ఎలా ఉన్నాయో…ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఏమాత్రం మార్పులేదు. ఇక‌, కాపుల‌ను ఆక‌ట్టుకునేందుకు ఓ కార్పొరేష‌న్ ఏర్పాటు చేశారు. అక్క‌డితో స‌రిపెట్టారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీల‌కు, బ్రాహ్మ‌ణుల‌కు కూడా కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి ఓటు బ్యాంకు ను పోకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు త‌ప్ప‌.. నిజ‌మైన హామీల అమ‌లుకు ముందుకు రావ‌డంలేదు. ఇంకో విష‌యం ఏంటంటే.. ఉచిత ఎల్ ఈడీ బ‌ల్బులు, ఫ్యాన్ల ప‌థ‌కం కేంద్రానిది అయితే.. బాబు మాత్రం త‌న పేరు త‌గిలించుకున్నార‌ని అంటున్నారు కేంద్రంలో పెద్ద‌లు. ఏదేమైనా.. బాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలలో సింహభాగం మూడేళ్లలో అమలుకాలేదన్నది సుస్పష్టం.

 

బ‌డా హామీలు.. చోటా చేత‌లు..  బాబు మూడేళ్ల పాల‌న తీరుతెన్నులు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts