బాబుకు ఇద్ద‌రు సీనియ‌ర్ల అల్టిమేటం

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ త‌ల‌నొప్పి ఏంటో ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. నిన్న‌టి వ‌ర‌కు వైసీపీకి చెందిన నాయ‌కుల‌ను, ఎమ్మెల్యేల‌ను ఆయ‌న ఎడాపెడా పార్టీలో చేర్చేసుకున్నారు. వీరి వ‌ల్ల లేనిపోని త‌ల‌నొప్పులు వ‌స్తాయ‌ని టీడీపీలోని పాత కాపులు చెప్పినా ఆయ‌న మాటే నెగ్గించుకున్నారు. ఇప్పుడు ఆయ‌న లేనిపోని టెన్ష‌న్లు కొని తెచ్చుకుంటున్నారు. నంద్యాల‌లో శిల్పా మోహ‌న్‌రెడ్డి వైసీపీలోకి వెళ్లిన ఇష్యూ ఇంకా హాట్ హాట్ న‌డుస్తూనే ఉంది. ఇప్పుడు అక్క‌డ నంద్యాల‌లో మంత్రి అఖిల‌ప్రియ తీరుపై చాలా మంది సీనియ‌ర్లు, కౌన్సెల‌ర్లు సైతం గుర్రుగానే ఉన్నారు. ఈ ఇష్యూ ఇలా ఉండ‌గానే ఇప్పుడు బాబు వ‌ద్ద ద‌క్షిణ కోస్తాకు చెందిన ఇద్ద‌రు సీనియ‌ర్లు సైతం తాము పార్టీలో ఉండాలా ? వెళ్లాలా ? అని అల్టిమేటం జారీ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌కాశం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఇద్ద‌రూ టీడీపీలో తాము తీవ్ర అవ‌మానాల‌కు గుర‌వుతున్నామ‌ని వారు చంద్ర‌బాబు వ‌ద్ద ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. రెండు రోజుల క్రితం వారు చంద్ర‌బాబుతో దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ మాగుంట త‌న‌ను జిల్లాలో టీడీపీ సీనియ‌ర్లు ప‌క్క‌న పెడుతూ, అన్నింటా అవ‌మానిస్తున్నార‌న్న విష‌యాన్ని చంద్ర‌బాబు వ‌ద్ద ప్ర‌స్తావించిన‌ట్టు టాక్‌.

జిల్లా పార్టీ అధ్య‌క్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్థ‌న్‌, ఎమ్మెల్సీ క‌ర‌ణం బ‌ల‌రాం, మ‌రో వైపు మంత్రి సిద్ధా రాఘ‌వ‌రావు ఇలా ఎవ‌రికి వారు పార్టీ స‌మావేశాల్లోను, ఇత‌ర‌త్రా ప‌నుల్లోను త‌న‌కు ప్ర‌యారిటీ ఇవ్వడం లేద‌ని, ఓ సీనియ‌ర్ నేత‌గా తాను ఇలాంటి ప‌రిస్థితుల్లో పార్టీలో ఎలా కొన‌సాగాల‌ని చంద్ర‌బాబును నేరుగా ప్ర‌శ్నించగా..బాబు అంతా తాను చూసుకుంటాను..మీరు తొంద‌ర‌ప‌డొద్ద‌ని మాగుంట‌కు స‌ర్ది చెప్పి పంపార‌ట‌. వాస్త‌వానికి మాగుంట రాజ‌కీయ నేప‌థ్యంతో పోల్చుకుంటే పైన ఆయ‌న్ను ఇబ్బంద పెట్టే నేత‌లు ఎవ్వ‌రు ఆయ‌న‌కు సాటిరారు అన్న‌ది వాస్త‌వం.

ఇక నెల్లూరు జిల్లాకు చెందిన ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి అయితే పార్టీలో అవ‌మానాల‌పై చంద్ర‌బాబు వ‌ద్ద గ‌ట్టిగానే కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశార‌ట‌. మంత్రులు నారాయ‌ణ‌, సోమిరెడ్డి, ఎమ్మెల్సీ, జిల్లా పార్టీ అధ్య‌క్షుడు బీదా ర‌విచంద్ర‌యాద‌వ్ ఇలా ఈ ముగ్గురు ఆదాల‌ను అడ్డంగా తొక్కేసే చేస్తోన్న ప్ర‌య‌త్నాల‌ను ఆయ‌న బాబు దృష్టికి తీసుకెళ్లార‌ట‌. వాస్త‌వానికి ఆదాల‌కు బాబు ఎమ్మెల్సీ ఇవ్వాల‌నుకున్నారు. అయితే ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తే ఆయ‌న దూకుడు ముందు తాము ఆగ‌లేమ‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన నారాయ‌ణ‌, సోమిరెడ్డి, బీదా ఆ ప‌ద‌విని వాకాటి నారాయ‌ణ‌రెడ్డికి ఇప్పించారు. తీరా ఇప్పుడు ఆయ‌న పార్టీ నుంచి స‌స్పెండ్ అవ్వ‌డంతో అది పార్టీకి, ఈ ముగ్గురికి తీర‌ని అవ‌మానంగా మిగిలింది.

అనంత‌రం నూడా చైర్మ‌న్ ప‌ద‌విని అయినా ఆదాలాకు ఇస్తార‌ని అనుకుంటే ఆ ప‌ద‌విని కోటంరెడ్డి శ్రీనివాసుల‌రెడ్డికి ఇచ్చారు. ఇలా త‌న‌కు జిల్లాలో ఆ ముగ్గురు నుంచి ఎదుర‌వుతోన్న ఇబ్బందుల‌ను బాబు వ‌ద్ద ఏక‌రువు పెట్ట‌డంతో పాటు పార్టీలో ఉండాలా ? వెళ్లాలా ? అని ఒకింత గ‌ట్టిగానే బాబు వ‌ద్ద ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ట‌. చంద్ర‌బాబు మాగుంట‌కు చెప్పిన విధంగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాన‌ని హామీ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా ద‌క్షిణ కోస్తాకు చెందిన ఇద్ద‌రు రెడ్డి నాయ‌కులు ఇప్పుడు పార్టీలో అసంతృప్తి గ‌ళం వినిపించ‌డం టీడీపీలో కాస్త సెన్షేష‌న‌ల్ న్యూస్‌గానే ఉంది.