పార్టీనే నమ్ముకున్న టీడీపీ సీనియ‌ర్ల‌కు బాబు షాక్!

July 10, 2017 at 4:58 am

టీడీపీని న‌మ్ముకుని ఎన్నో త్యాగాలు చేసిన సీనియ‌ర్ల‌కు చంద్ర‌బాబు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు. పార్టీలో ఎప్ప‌టి నుంచో ఉండ‌డంతో పాటు ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్ల కోసం త‌మ సీట్లు వ‌దులుకుని త్యాగాలు చేసిన వాళ్ల‌కు చంద్ర‌బాబు సింపుల్‌గా కార్పొరేష‌న్ ప‌ద‌వుల‌తో స‌రిపెట్టేశారు. తాజాగా రాష్ట్రంలో ఎనిమిది కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆహార భద్రత కమిషన్‌కు చైర్మన్‌గా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జె.ఆర్‌.పుష్పరాజ్‌ను నియమించాలని నిర్ణయించింది. తాడికొండ సీటును త్యాగం చేసిన ఆయ‌న రాజ్య‌స‌భ లేదా, ఎమ్మెల్సీ ఆశించారు. ప‌లుసార్లు త‌న‌కు ప‌ద‌వి రావ‌డం లేద‌ని అసంతృప్తి కూడా వ్య‌క్తం చేశారు. పుష్ప‌రాజ్ మీద కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్‌ను పార్టీలో చేర్చుకున్న బాబు ఆయ‌నకు సైతం ఎమ్మెల్సీ ఇచ్చారు.

క‌ట్ చేస్తే ఇప్పుడు పార్టీనే న‌మ్ముకుని, సీటు త్యాగం చేసిన ఆయ‌న‌కు మాత్రం కార్పొరేష‌న్ చైర్మ‌న్‌తో స‌రిపెట్టేశారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏలూరు అసెంబ్లీ సీటును త్యాగం చేసిన అంబికా కృష్ణ‌కు అప్ప‌ట్లోనే ఎమ్మెల్సీ ఇస్తామ‌ని బాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని తుంగ‌లో తొక్కేసి అంబికాను సినీ రంగానికి చెందిన కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియ‌మించారు.

వాస్త‌వానికి అంబికా ప్ర‌జారాజ్యం నుంచి పార్టీలో చేరిన బ‌డేటి బుజ్జి కోసం త‌న సీటును వ‌దులుకున్నారు. ఇప్పుడు బుజ్జి ఎమ్మెల్యే కాగా అంబికాకు క‌నీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వ‌కుండా సినీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వితో స‌రిపెట్టేశారు. పార్టీనే న‌మ్ముకుని ఎప్ప‌టి నుంచో పనిచేస్తోన్న వారికి చైర్మ‌న్ ప‌ద‌వులు ఇచ్చిన బాబు ఇటీవ‌ల పార్టీలోకి జంప్ చేసిన వారికి కూడా ఈ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు.

ఉపఎన్నిక జరగనున్న నంద్యాల నియోజకవర్గంలో వారం రోజుల క్రితం పార్టీలో చేరిన నౌమాన్‌ను ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా ప్రకటించారు. ఇక మంత్రి ప‌ద‌వి ఆశించి ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసి మంత్రి ప‌ద‌విపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న విజ‌య‌వాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌కు వక్ఫ్‌ బోర్డు ఇచ్చారు.

 

పార్టీనే నమ్ముకున్న టీడీపీ సీనియ‌ర్ల‌కు బాబు షాక్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts