రాజధాని రేసులో ముర‌ళీమోహ‌న్, నారా బ్రాహ్మ‌ణి

ముర‌ళీమోహ‌న్ ఏపీ సీఎం చంద్ర‌బాబును బాగా ఇబ్బంది పెట్టేస్తున్న‌ట్టు ఏపీ టీడీపీ ఇన్న‌ర్ కారిడార్‌లో ఒక్క‌టే చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం రాజ‌మండ్రి ఎంపీగా ఉన్న మాగంటి ముర‌ళీమోహ‌న్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. 2009 ఎన్నిక‌ల్లో మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో 1.50 వేల పైచిలుకు ఓట్ల‌తో ఘ‌న‌విజ‌యం సాధించారు.

గ‌త ఎన్నిక‌ల్లో గెలిచాక ముర‌ళీమోహ‌న్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు పూర్తిగా దూర‌మైపోయారు. ఆయ‌న‌కు వీలున్న‌ప్పుడు రాజ‌మండ్రి మాత్ర‌మే వ‌స్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తోన్న దాఖ‌లాలు లేవు. ఈస్ట్‌లోని 4 నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు వెస్ట్‌లోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న‌పై సొంత క్యాడ‌ర్‌లోనే తీవ్ర వ్య‌తిరేక‌త నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి నుంచి పోటీ చేసేందుకు ఆయ‌న సుముఖంగా కూడా లేరన్న వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.

కొద్ది రోజుల పాటు అక్క‌డ త‌న కోడలు రూపాదేవిని రంగంలోకి దించాల‌ని ప్ర‌యత్నాలు చేస్తున్నారు. అయితే అవి స‌క్సెస్ అయ్యేలా లేవు. చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి నుంచి ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త అల్లూరి ఇంద్ర‌కుమార్ పేరు ప‌రిశీలిస్తున్నారు. దీంతో ప్ర‌స్తుతం రాజ‌మండ్రి లోక్‌స‌భ ప‌రిధిలో త‌న‌పై వ్య‌తిరేకత ఎక్కువుగా ఉండ‌డం, కోడ‌లు రూప‌కు టిక్కెట్ వ‌చ్చే ఛాన్స్ లేక‌పోవ‌డంతో ఆయ‌న రూటు మార్చిన‌ట్టు తెలుస్తోంది.

విజ‌య‌వాడ లేదా గుంటూరుపై క‌న్ను..!

ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాజ‌ధాని కేంద్రాలుగా ఉన్న విజ‌య‌వాడ లేదా గుంటూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక సీటును త‌నకు కేటాయించాల‌న్న విష‌యాన్ని ఆయ‌న ఇప్ప‌టికే చంద్ర‌బాబు వ‌ద్ద ప్ర‌పోజ‌ల్‌గా పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ముర‌ళీమోహ‌న్ కృష్ణా జిల్లా అల్లుడు. ఈ క్ర‌మంలోనే అమ‌రావ‌తి ఏరియాలో ఆయ‌న ఇప్ప‌టికే భారీగా భూములు కొనుగోలు చేసిన‌ట్టు స‌మాచారం. ఇక్క‌డ త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని భారీగా విస్త‌రించుకునే ప‌నిలో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న విజ‌య‌వాడ లేదా గుంటూరు ఎంపీ సీటు త‌న‌కు ఇవ్వాల‌ని బాబుపై ప్రెజ‌ర్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానికి, చంద్ర‌బాబుకు గ్యాప్ బాగా పెరిగింది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో నానికి సీటు రాద‌న్న టాక్ ఇప్ప‌టికే వ‌చ్చేసింది. ఇక గ‌ల్లా జ‌య‌దేవ్‌ను రాజ్య‌స‌భ‌కు పంప‌నున్నారు. దీంతో ఈ రెండు సీట్ల‌లోను టీడీపీకి కొత్త అభ్య‌ర్థులు పేర్లు లైన్లో ఉన్నాయి. చంద్ర‌బాబు కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ రెండు సీట్ల‌లో ఎక్క‌డో ఓ చోట నుంచి ఎంపీగా పోటీ చేయ‌డం దాదాపు ఖాయ‌మైంది. ఈ క్ర‌మంలోనే ముర‌ళీమోహ‌న్ కన్ను కూడా ఇప్పుడు ఈ రెండు సీట్ల‌పైనే ప‌డ‌డంతో ఇప్పుడు రాజ‌ధాని ఎంపీ సీట్ల కోసం ముర‌ళీమోహ‌న్ వ‌ర్సెస్ బ్రాహ్మ‌ణిల‌లో ఎవ‌రిది పైచేయి అవుతుందో ? చూడాలి. ట్విస్ట్ ఏంటంటే అటు బ్రాహ్మ‌ణి ఇటు ముర‌ళీమోహ‌న్ విజ‌య‌వాడ కంటే గుంటూరుపైనే ఇంట్ర‌స్ట్ చూపుతున్నార‌ట‌.