ఆంధ్రాని మళ్ళీ మోసంచేయడానికి సిద్ధమైన బీజేపీ

హోదాపై ఎన్నెన్ని మాట‌లు చెప్పారు! ఐదేళ్లు కాదు ప‌దేళ్లు ఇవ్వాల‌న్నారు! ఇస్తాం.. ఇస్తాం అంటూ ఊరించారు! త‌ర్వాత ప్లేటు ఫిరాయించారు. `మీకు ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగుతాయి` అంటూ మెలిక పెట్టారు. న‌మ్మించి న‌ట్టేట ముంచారు బీజేపీ నేత‌లు! ఇక విశాఖ రైల్వే జోన్ విష‌యంలోనూ ఇవే మాయ మాట‌లు చెబుతున్నారు! త‌మ రాజ‌కీయ ల‌బ్ధి కోసం ఇప్పుడు రైల్వే జోన్ అంశాన్ని కూడా అటకెక్కించే ప్ర‌యత్నం చేస్తున్నారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా.. ఏపీ ప్ర‌జ‌ల మనోభావాలు, ఆశ‌లు తుంగ‌లో తొక్కేస్తూ.. మ‌ళ్లీ మ‌ళ్లీ మెలిక‌లు పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు విశాఖ రైల్వేజోన్‌ను ఒడిశా వ్య‌తిరేకించే అవ‌కాశాలున్నాయ‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నార‌ట‌.

కేంద్ర రైల్వే మంత్రి ఏపీ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా విశాఖ‌కు రైల్వే జోన్ ద‌క్క‌డం లేదు. పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రిగిన ప్ర‌తిసారీ.. ఇదిగో వ‌స్తుంది.. అదిగో వ‌స్తుంది అంటూ బీజేపీ, టీడీపీ నేత‌లు చెప్ప‌డం.. తీరా అయిపోయాక వ‌చ్చే స‌మావేశాల్లో ప‌రిశీలిస్తామ‌ని అన‌డం ప‌రిపాటిగా మారింది. అయితే దీనిపై కేంద్రం స్ప‌ష్ట‌త‌కు రాక‌పోవ‌డ‌మే మ‌రింత జాప్యానికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. రైల్వేజోన్ ఇవ్వ‌డం.. కేంద్రం త‌లుచుకుంటే పెద్ద విష‌యం కాక‌పోయినా.. ఇది ఇస్తే త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు దెబ్బతింటాయ‌ని బీజేపీ నేత‌లు తీవ్రంగా ఆలోచిస్తున్నార‌ట‌.

విశాఖ రైల్వే జోన్ ఇచ్చేస్తే… ఒడిశ్శా నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌య్యే ప‌రిస్థితులు ఉన్న‌ట్టు భాజ‌పా అంచ‌నా వేస్తోంద‌ట‌.

ఒడిశాపై బీజేపీ నేత‌లు ఎప్ప‌టినుంచో క‌న్నేశారు. అందుకు అనుగుణంగా ప్ర‌ధాని మోడీ. ఇత‌ర నేత‌లు ప‌ర్య‌టిస్తూ ఉన్నారు. ఈ స‌మ‌యంలో ఆంధ్రాకి ప్ర‌త్యేక జోన్ ఇస్తే రాజ‌కీయంగా ఒడిశాలో భాజ‌పాకి అనుకూలంగా ఉండ‌ద‌నేది పార్టీ వ‌ర్గాల అభిప్రాయంగా తెలుస్తోంది. భువ‌నేశ్వ‌ర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే ప‌రిధిలో విశాఖ ఉంది. రైల్వే ఉద్యోగా లు ఆశిస్తున్నవారు ఒడిశా వెళ్లి ప‌రీక్ష‌లు రాయాల్సి వ‌స్తోంది. విశాఖ జోన్ ను ప్ర‌క‌టిస్తామ‌ని చెప్ప‌గానే ఉత్త‌రాంధ్ర నిరుద్యోగుల్లో కొత్త ఆశ‌లు రేకెత్తాయి. ఇక‌, ఈస్ట్ కోస్ట్ రైల్వేకి విశాఖ నుంచి భారీగా ఆదాయం వ‌స్తుంది. ఆదాయ‌ప‌రంగా ప్రాధాన్య‌త ఉన్న విశాఖ‌ను త‌మ జోన్ నుంచి త‌ప్పించేందుకు ఒడిశా భాజ‌పా నేత‌లు ఒప్పుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది.

ఒక‌వేళ విశాఖ‌ను భువ‌నేశ్వ‌ర్ జోన్ నుంచి త‌ప్పిస్తే… భాజ‌పా నేత‌ల నుంచే కాకుండా, సామాన్యుల నుంచి కూడా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మౌతుంద‌ని వారు చెబుతున్నార‌ట‌. 2019లో ఒడిశా అసెంబ్లీకి ఎన్నిక‌లు ఉన్నాయి. విశాఖ జోన్ విష‌యంలో నిర్ణ‌యం తీసుకుంటే… దాని ప్ర‌భావం ఒడిశాలో భాజ‌పాపై ప‌డే అవ‌కాశం ఉంద‌నేది ఆ పార్టీ అధినా య‌క‌త్వం తీవ్రంగా ఆలోచిస్తోంద‌ట‌. ఈ విష‌య‌మై కొన్నాళ్ల‌పాటు ఎటూ తేల్చ‌కుండా, ప్ర‌స్థావించ‌కుండా ఉంటేనే బెట‌ర్ అనే ధోర‌ణిలో భాజ‌పా ఉంద‌ని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఏపీకి ద‌క్కాల్సిన ప్ర‌యోజ‌నాలను ఏవో కుంటి సాకులు చెబుతూ.. దాట‌వేస్తోంది.