నంద్యాల‌లో గెలుపున‌కు చంద్ర‌బాబు ప‌ద‌వుల అస్త్రం

ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు ఏ ఒక్క ప‌ద‌వి భ‌ర్తీ చేసేందుకు సిద్ధంగా లేరు. ఏవైనా ప‌ద‌వులు భ‌ర్తీ చేయాలంటే నాన్చి నాన్చి మ‌రీ చేస్తున్నారు. తాజాగా ఆయ‌న 8 కార్పొరేష‌న్ల ప‌ద‌వులు భ‌ర్తీ చేశారు. ఇదిలా ఉంటే నంద్యాల ఉప ఎన్నిక వేళ ఆ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ నేత‌ల పంట పండ‌నుంది. ఇక్క‌డ గెలుపు కోసం చంద్ర‌బాబు ఏకంగా ప‌ద‌వులు అస్త్రాన్నే ఉప‌యోగిస్తున్నారు.

ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌కు కోట్లాది రూపాయ‌ల వ‌ర‌ద పారిస్తోన్న బాబు ఇప్పుడు ఇక్క‌డ నాయ‌కులు ఎవ్వ‌రూ అసంతృప్తికి గురికాకుండా ఐక్య‌తారాగం ఆల‌పించేందుకు వారికి నామినేటెడ్ ప‌ద‌వులు పందేరం చేస్తున్నారు. ఆదివారం ప్ర‌క‌టించిన నామినేటెడ్ పోస్టుల్లో జిల్లా నేతలు ఇద్దరికి నామినేటెడ్ పోస్టులు దక్కాయి. ఒకరు ఇటీవలే పార్టీలో చేరిన నౌమాన్ కు ఉర్దూ అకాడమీ ఛైర్మన్ పదవి దక్కింది. దీంతో పాటు కర్నూలు జిల్లా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు కర్నూలు అర్బన్ డెవలెప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ ఇచ్చారు.

ఈ రెండు కీల‌క‌మైన ప‌ద‌వులే కావ‌డం విశేషం. ఇక ముస్లిం ఓట్ల‌ను టార్గెట్ చేసే క్ర‌మంలోనే ఇటీవ‌లే పార్టీలో చేరిన నౌమాన్‌కు పార్టీలో చేరిన వారం రోజుల‌కే నామినేటెడ్ ప‌ద‌వి ఇచ్చారు. ఇక సుదీర్ఘ‌కాలంగా జిల్లా పార్టీకి నాయ‌కుడిగా ఉండి, ఇటీవ‌లే తిరిగి మ‌రోసారి ఎంపికైన సోమిశెట్టికి క‌ర్నూలు అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ చైర్మ‌న్ ఇచ్చి ఆయ‌న‌కు ఉప ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్య‌త మ‌రింత‌పెంచారు.

ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తారా..?

ఇదిలా ఉంటే నంద్యాల‌కే చెందిన పార్టీ సీనియ‌ర్ నేత ఎన్.ఎం.డీ ఫరూక్ కు కూడా ఏదో ఒక పదవి దక్కనుంది. పార్టీ కోసం ఆయ‌న ప‌లుసార్లు త్యాగం చేశారు. గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులున్నాయి. ఇందులో ఒకటి జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డికి ఒకటి ఖారారైన‌ట్టు తెలుస్తోంది. మ‌రొక‌టి ఫ‌రూఖ్‌కు అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఫ‌రూఖ్ ఇక్క‌డ బ్ర‌హ్మానంద‌రెడ్డి గెలుపుకోసం మ‌రింత‌గా కష్ట‌ప‌డేలా బాబు ప్లాన్ వేశారు. ఏదేమైనా ఉప ఎన్నిక వేళ క‌ర్నూలు జిల్లాతో పాటు నంద్యాల నేత‌ల‌ను బాబు ప‌ద‌వుల‌తో ప‌డేస్తున్నారు.