వైసీపీ నావ వైసీపీ వాళ్లే ముంచేస్తున్నారు…

July 21, 2017 at 3:34 am

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ చావో రేవో పోరాటాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా నార్త్‌కు చెందిన ప్ర‌శాంత్ కిషోర్‌ను రంగంలోకి దించారు. పీకే కూడా ఏపీలో త‌న వ‌ర్క్ స్టార్ట్ చేసేశాడు. పీకే బృందాలు ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో సర్వేలు చేస్తున్నాయి. ఇక కొద్ది రోజుల క్రితం అమ‌రావ‌తిలో జ‌రిగిన ప్లీన‌రీలో జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల పేరుతో ఎన్నికల హామీలు కూడా ప్ర‌క‌టించేశాడు. జ‌గ‌న్ 2019 ఆప‌రేష‌న్ పేరుతో గెలుపు కోసం ఇంత క‌ష్ట‌ప‌డుతున్నా ఏపీలోని కీల‌క జిల్లాల్లో ఒక‌టి, పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావ‌రిలో మాత్రం పార్టీ నేత‌లు అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, క‌ల‌హాల‌తో పార్టీకి తీర‌ని న‌ష్టం చేకూరుస్తున్నారు.

ఏపీలోనే పెద్ద‌ది అయిన తూర్పు గోదావ‌రిలో మొత్తం 19 అసెంబ్లీ, మూడు ఎంపీ సీట్లు ఉన్నాయి. జిల్లాలో దాదాపు అన్ని స్థానాల్లోను వైసీపీ నేత‌ల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం జ‌రుగుతోంది. ఇందుకు పార్టీ అధినేత జ‌గ‌న్ తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు కూడా కార‌ణంగా క‌నిపిస్తున్నాయి. ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏకంగా ఇద్ద‌రేసి కో ఆర్డినేట‌ర్లు ఉన్నారు. కొత్తపేట, తుని, రామచంద్రపురం, రంపచోడవరం, రాజానగరం, అనపర్తి, కాకినాడ రూరల్, కాకినాడ, ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం, మండపేట నియోజకవర్గాల్లో కోల్డ్ వార్ ఓ రేంజ్‌లో ఉంది.

ఇక కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు అయిన రాజమండ్రి , రాజమండ్రి రురల్ , అమలాపురం , గన్నవరం, ముమ్మిడివరం ,నియోజకవర్గాల్లో గ్రూపుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు మామూలుగా లేదు. రాజ‌మండ్రి న‌గ‌ర వైసీపీలో రెండు గ్రూపులు ఉన్నాయి. కో-ఆర్డినేట‌ర్ రౌతు సూర్య‌ప్ర‌కాశ్ రావుది ఓ వ‌ర్గం అయితే, కార్పొరేష‌న్‌లో పార్టీ నేత మేడ‌పాటి ష‌ర్మిలారెడ్డిది మరో గ్రూప్‌. ఇక ఈ రెండు గ్రూపుల‌కు తోడు మాజీ మంత్రి జ‌క్కంపూడి విజ‌య‌ల‌క్ష్మి, ఆమె కుమారులు న‌డిపించేది మూడో గ్రూప్‌.

ఇక రాజమండ్రి రూరల్‌లో కూడా మూడు గ్రూపులు ఉన్నాయి. ఇక్క‌డ గత ఎన్నికల్లో ఓడిన ఆకుల వీర్రాజు వర్గం ఒకటి కాగా, మాజీ ఎంపీ గిరజాల వెంకట స్వామి నాయుడు అన్న కుమారుడు గిరజాల బాబు మరో గ్రూప్ గాను , గ్రేటర్ రాజమండ్రి అధ్యక్షులు కందుల దుర్గేష్ వర్గం ఉన్నాయి. ఇక ఓవ‌రాల్‌గా ఒక్క రాజ‌మండ్రిలోనే వైసీపీలో ఏకంగా ఆరు గ్రూపులు ఉన్నాయి. ఇక ఈ లెక్క‌న జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోను క‌లిపితే 20కు పైగా గ్రూపులు ఉండేలా ఉన్నాయి. మ‌రి ఈ గ్రూపుల‌కు ఇప్ప‌టికి అయినా జ‌గ‌న్ చెక్ పెట్ట‌క‌పోతే తూర్పులో వైసీపీ చేతులెత్తేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

 

వైసీపీ నావ వైసీపీ వాళ్లే ముంచేస్తున్నారు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts