బీహార్ లో వెనక జరిగిన రాజకీయం ఇదే….!

కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు.. కాలం ఖ‌ర్మ‌కాలితే అతిత్వ‌ర‌లోనే ఆ పార్టీకి అధ్య‌క్షుడిగా చ‌క్రం తిప్ప‌బోయే గాంధీల వార‌సుడు రాహుల్ గాంధీ చుట్టూ ఇప్పుడు రాజ‌కీయాలు ముసురుకున్నాయి. అస‌లు ఆయ‌న రాజ‌కీయ ప‌రిణ‌తి ఎంత‌? ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు దాని ఆనుపానులు తెలిసిన‌ప్పుడు ప‌రిష్క‌రించ‌డంలో ఆయ‌న చూపుతున్న సామ‌ర్థ్యం ఏపాటిది? అస‌లు రాహుల్‌కి రాజ‌కీయాలు ఇష్టం లేదా? ఇలా ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర ఆయ‌న‌ను చుట్టుముడుతోంది. దీనంత‌టికీ కార‌ణం.. బిహార్‌లో కేవ‌లం క‌న్ను మూసి క‌న్ను తెరిచేలోగా మారిన ప్ర‌భుత్వం, రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లే!! వీటి గురించి తెలిసి.. వీటి గురించి మాట్లాడి.. ఓ బాధ్య‌తాయుత‌మైన ప్ర‌భుత్వం భాగ‌స్వామిగా రాహుల్ చేసింది ఏమిటి? ప‌్ర‌భుత్వాన్ని ర‌క్షించుకోవ‌డంలో ఆయ‌న చాణ‌క్యం ప్ర‌ద‌ర్శించింది ఎక్క‌డ‌? ప్ర‌ధాని మోడీ, ఆయ‌న అంత‌రంగికుడు షాల ముందు రాహుల్ ఇప్పుడు జోక‌ర్‌గా మిగిలిపోయారు!! విష‌యంలోకి వెళ్దాం..

దేశంలో అతి పెద్ద రాష్ట్రాల్లో తొలి రెండు మూడు వ‌రుస‌లో ఉండ‌డ‌మే కాకుండా ఢిల్లీకి కూత వేటు దూరంలో ఉన్న రాష్ట్రం బిహార్‌. యూపీ త‌ర్వాత ఈ రాష్ట్రంలో అధికారం కైవ‌సం చేసుకుంటే.. ఢిల్లీలో ప్ర‌భుత్వ ఏర్పాటు న‌ల్లేరుపై న‌డ‌కేన‌నేది అంద‌రికీ తెలిసిన విషయం. దీనిని గుర్తించే 2015లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో దేశ‌వ్యాప్తంగా జాతీయ పార్టీగా ముద్ర ఉన్న‌ప్ప‌టికీ అణిగి మ‌ణికి ప్రాంతీయ పార్టీలైన లాలూ నేతృత్వంలోని ఆర్ జేడీ, నితీశ్ నేతృత్వంలోని జేడీయూతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని మ‌హా బంధ‌న్ పేరుతో ఎన్నిక‌ల‌కు వెళ్లింది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా కాంగ్రెస్ 27 స్థానాల‌ను గెలుపొంది.. నితీశ్ ప్ర‌భుత్వంలో పాలు పంచుకుని ఢిల్లీలో కాల‌రెగ‌రేస్తున్న మోడీ, షాల ధ్వ‌యానికి షాక్ ఇచ్చింది. ఇది జ‌రిగి ఖ‌చ్చితంగా 20 నెల‌లు గ‌డుస్తున్నాయి. అయితే, 2019లో ఎలాగైనా స‌రే మ‌రోసారి కేంద్రంలో అధికారం నిల‌బెట్టుకోవాల‌ని గ‌ట్టి పంతంమీద ఉన్న మోడీ, షాలు.. బిహార్‌లో త‌మ ప్ర‌భుత్వం లేకుండా అది సాధ్యం కాద‌ని ముందు నుంచి లెక్క‌లు క‌ట్టారు.

2015 ఎన్నిక‌ల్లో అలుపెరుగ‌ని ప్ర‌చారం.. వేల కోట్ల ప్యాకేజీ వంటి ప్ర‌క‌ట‌న‌లు గుప్పించినా.. నితీశ్ ప్ర‌చారం ముందు అవి కొర‌గాకుండా పోయాయి. ఈ నేప‌థ్యంలో ఎలాగైనా స‌రే మ‌హా బంధ‌న్ కూట‌మిని క‌డ‌తేర్చి.. తాము అధికారంలోకి రావాల‌ని అప్ప‌టి నుంచి ప‌థ‌కాలు ర‌చిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో మోడీ, షాల‌కు అంది వ‌చ్చిన వ‌రంలా.. లాలూ కుంటుంబం ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా ఉన్న లాలూ త‌న‌యుడు తేజ‌స్వి అవినీతి క‌నిపించ‌డంతో సీబీఐ, ఈడీల‌ను రంగంలోకి దింపారు. అవినీతికి వ్య‌తిరేకంగా అంటూనే నితీశ్ ఏవిధంగా తేజ‌స్విని డిప్యూటీ సీఎంగా కొన‌సాగిస్తార‌ని క్షేత్ర‌స్థాయిలో ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు చేయించ‌డం ప్రారంభించారు. దీంతో స‌హ‌జంగానే అవినీతికి దూరంగా ఉండే నితీశ్ తేజ‌స్వి విష‌ఫ‌యంలో క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రించాల‌ని చూశారు. అయితే, లాలూకు అసెంబ్లీలో బ‌లం(80 స్తానాలు) ఎక్కువ‌గా ఉండ‌డంతో ఒకింత హెచ్చ‌రిస్తూనే మౌనం పాటిస్తూ వ‌చ్చారు.

దీనిని అద‌నుగా భావించిన బీజేపీ.. నితీశ్‌ను దువ్వ‌డం ప్రారంభించింది. అవినీతి మ‌కిలి అంటిన పార్టీని వ‌దిలించుకోవాల‌ని, తాము మ‌ద్ద‌తిస్తామ‌ని లోపాయికారీగా చ‌క్రం తిప్పింది. దీనికి నితీశ్ ఇటీవ‌ల జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ముందే ఓకే చెప్ప‌డం జ‌రిగిపోయింది. బిహార్‌లో ఏదో జ‌రుగుతోంద‌ని అప్ప‌టి నుంచి రాజ‌కీయ విశ్లేష‌కులు అంటూనే ఉన్నారు. అనుకుంటున్న క్ర‌మంలోనే బుధ‌వారం సాయంత్రం అనూహ్యంగా నితీశ్ రాజీనామా చేయ‌డం, వెనువెంట‌నే ఆయ‌న చ‌ర్య‌ను మోడీ మెచ్చుకోవ‌డం తెల్లారిందో లేదో.. బీజేపీతో జ‌ట్టుకట్టి.. నితీశ్ సీఎం అయిపోవ‌డం అంతా క‌న్నుమూసి తెరిచేలోగానే జ‌రిగిపోయింది. ఇక‌, ఇప్పుడు కాంగ్రెస్ విష‌యానికి వ‌ద్దాం… 2019లో కేంద్రంలోని మోడీ స‌ర్కారును ఎట్టి ప‌రిస్థితిలోనూ దించేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న కాంగ్రెస్ ఆదిశ‌గా అడుగులు వేసేందుకు బిహార్ అతి ముఖ్య‌మైన రాష్ట్రంగా గుర్తించింది. అందుకే ఆర్ జేడీ, జేడీయూతో పొత్తు పెట్టుకుంది.

అయితే, లాలూ బృందం అవినీతిలో కూరుకుపోవ‌డంపై నితీశ్ ఎప్ప‌టి నుంచో రాహుల్ కు చెబుతూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న స్పందించి లాలూతో చ‌ర్చ‌లు జ‌రిపి కాయ‌క‌ల్ప చికిత్స చేసి ఉంటే ప‌రిస్థితి ఇంత వ‌ర‌కు వ‌చ్చేది కాదు. మొన్న‌టికి మొన్న మాజీ రాష్ట్ర‌ప‌తి మొఖ‌ర్జీకి విందు ఇచ్చిన‌ప్పుడు కూడా ర‌హ‌స్యంగా రాహుల్ని క‌లిసిన నితీశ్ ఇదే విష‌యాన్ని వెల్ల‌డించారు. అయితే, రాహుల్ చ‌లించ‌లేదు. ఫ‌లితంగా నేడు బిహార్లో కాంగ్రెస్ అవినీతి ప‌రుల పంచ‌న చేరిన పార్టీగా, అవినీతిని అరిక‌ట్ట‌లేని పార్టీగా ముద్ర వేయించుకోవ‌డం తోపాటు మోడీ, షాల రాజ‌కీయ ఆట‌లో అరిటి పండుగా మిగిలిపోయింది. సో.. దీనిని బ‌ట్టి రాహుల్‌ని ఎవ‌రు ఎలా వ‌ర్ణించుకున్నా త‌ప్పులేదు!!