టీడీపీ టు వైసీపీ.. యూ ట‌ర్న్ ఎమ్మెల్యేల లిస్ట్ ఇదే

టీడీపీ మొద‌లుపెట్టిన `ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌` దెబ్బ‌కు ప్ర‌తిప‌క్ష వైసీపీ గిల‌గిల్లాడిపోయింది. అభివృద్ధిని చూసి వ‌చ్చార‌ని టీడీపీ చెబితే.. ప్ర‌లోభాలకు లొంగిపోయారని వైసీపీ నేత‌లు వారికి బ‌దులు ఇవ్వ‌డం తెలిసిందే! అయితే ఇప్పుడు టీడీపీ నేత‌లకు దిమ్మ‌తిరిగే షాక్ త‌గ‌ల‌బోతోంద‌ట‌. అభివృద్ధిని చూసి పార్టీలోకి వెళ్లిన నేత‌లు.. ఇప్పుడు అంతే వేగంతో యూ ట‌ర్న్ తీసుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నార‌నే టాక్ జోరుగా న‌డుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రుగుతుందో లేదో స్ప‌ష్టత లేక‌పోవ‌డం, మ‌రోప‌క్క వైసీపీ అధినేత ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్లిపోవ‌డంతో ఇప్పుడు.. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో అల‌జ‌డి మొదలైంది. సొంత గూటికి వెళ్లాల‌నే ఆలోచ‌న‌తో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నార‌ట‌. 

రాజ‌కీయంగా వైసీపీని దెబ్బ‌కొట్టేందుకు టీడీపీ ఆప‌రేష‌న్ వైసీపీ మొద‌లుపెట్టింది. దీంతో 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేశారు! ఇది టీడీపీకి బ‌లం చేకూర్చినా.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం తీవ్ర త‌ల‌నొప్పులు తీసుకొచ్చింది. ఇప్ప‌టికీ ఈ సెగ‌లు ర‌గులుతూనే ఉన్నాయి. ఇంకొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఆ నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జుల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత‌గా విభేదాలు ఉన్నాయి, వీరంద‌రినీ బుజ్జ‌గించేందుకు అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టివ‌రకూ చెబుతున్న ఒకే మాట‌. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌! వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు అవ‌కాశం ద‌క్క‌క‌పోతుందా అని.. టీడీపీ నేత‌ల‌తో పొస‌గ‌క‌పోయినా ఫిరాయింపు ఎమ్మెల్యేలు స‌ర్దుకుపోతున్నారు.

విభ‌జ‌న జ‌రిగి మూడేళ్ల‌యినా.. ఇప్ప‌టికీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై కేంద్రంలో క‌ద‌లిక లేదు. టీడీపీ నేత‌లు ప‌దేప‌దే ఈ అంశం గురించి కేంద్ర పెద్ద‌ల‌పై ఒత్తిడి తీసుకొస్తున్నా.. రేపు మాపు అంటూ రోజులు గ‌డిపేస్తున్నారు. ఇక ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ ఇచ్చిన హామీల‌పై ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు.  దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో అస‌హ‌నం పెరిగిపోతోంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ప్లీన‌రీ వేదిక‌గా ప్ర‌క‌టించిన హామీలు ప్ర‌జ‌ల్లోకి ఇప్పుడిప్పుడే వెళ్తున్నాయి, వీటిపై అన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు కూడా అందుతున్నాయి. ఈనేప‌థ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు సొంత గూటికి వెళ్లాల‌ని తీవ్రంగా ఆలోచిస్తున్నార‌ట‌. 

క‌ర్నూలుకు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు, కోస్తాకు చెందిన మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎమ్మెల్సీ కూడా ఇప్పుడు యూ ట‌ర్న్ తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. వీరితో పాటు ప్ర‌కాశం జిల్లాకు చెందిన మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు మరో అడుగు ముందుకేసి.. పార్టీలోకి తిరిగి వ‌చ్చేస్తామ‌ని త‌మ‌కు ట‌చ్‌లో ఉన్న వైసీపీ నేత‌ల‌తో రాయ‌బారాలు కూడా న‌డుపుతున్నార‌ట‌. మ‌రి వీరి భ‌విత‌వ్యం ఏమ‌వుతుందో వేచిచూడాల్సిందే!!