వైసీపీ ప్లీన‌రీ ప్లాపా..హిట్టా..యావ‌రేజా..!

స్త‌బ్దుగా ఉన్న‌ కార్య‌క‌ర్త‌ల్లో నయా జోష్ నింపేలా.. నిస్తేజ‌మై ఉన్న క్యాడ‌ర్‌లో `న‌వ` శక్తి నింపేలా.. వైఎస్సార్ సీపీ ప్లీన‌రీ వేదిక‌గా అధ్య‌క్షుడు జ‌గ‌న్ 2019 ఎన్నిక‌లకు స‌మ‌ర‌శంఖం పూరించాడు. ఎన్నిక‌ల హామీలు రెండేళ్ల ముందుగానే ప్ర‌క‌టిస్తూ.. పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని పిలుపునిచ్చారు. అయితే ప్లీన‌రీ సూప‌ర్ హిట్ అయింద‌ని కార్య‌క‌ర్త‌లు సంబ‌ర‌ప‌డుతున్నారు. ఇది కేవ‌లం చంద్ర‌బాబును తిట్ట‌డానికేన‌ని, ఇది అట్ట‌ర్ ప్లాప్ అని టీడీపీ చెబుతోంది. వైసీపీ ప్లీన‌రీ మాత్రం యావ‌రేజ్ అని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. పార్టీని నిల‌బెట్టే `న‌వ`ర‌త్నాల్లాంటి ప‌థ‌కాలు బాగున్నా.. వాటిని ముందుగానే చెప్ప‌డం మైన‌స్సే అని విశ్లేషిస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ముగిసింది. మూడేళ్ల తర్వాత తొలిసారి ఏపీలో ప్లీనరీని జరపడంతో కార్యకర్తలు ఉత్సాహంతో తరలివచ్చారు. ప్రధానంగా వచ్చే ఎన్నికలకు ప్లీనరీ నుంచే జగన్ ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ తాను అధికారంలోకి వస్తే ఏ ఏ వర్గాలకు ఏంచేస్తానన్న దానిపై జగన్ ఈ ప్లీనరీ నుంచి స్పష్టత ఇచ్చారు. మొత్తం 9 హామీలను ప్లీనరీ వేదిక నుంచి ఏపీ ప్రజలకు ఇచ్చారు. ఐదెక‌రాలలోపు చిన్న‌, సన్న‌కారు రైతుల‌కు రూ.50వేలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. మ‌ద్యనిషేధం, పింఛ‌న్ల పెంపు, పేద‌లంద‌రికీ ఇళ్లు, పేద పిల్ల‌ల చ‌దువుల‌కు అమ్మ ఒడి, వైఎస్సార్ ఆస‌రా.. ఇలా అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా హామీలు గుప్పించారు.

మంచి అంశాలను ఎన్నుకున్నారన్నది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మద్యనిషేధం, రైతులకు అండగా నిలబడటం వంటి అంశాలు పార్టీకి కొంత ప్రయోజనం చేకూర్చేవని చెబుతున్నారు. పాదయాత్ర ద్వారా తాను ప్రతి గ్రామానికి వస్తున్నానని జగన్ చెప్పడంతో క్షేత్రస్థాయిలో పార్టీ ఇప్పటి నుంచే బలోపేతం అవుతుందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. అయితే జగన్ హామీలు ఆచరణ సాధ్యమేనా? అన్న ప్రశ్న అంద‌రిలోనూ ఉన్నా.. ప్ర‌స్తుతం దీని గురించి ఆలోచించే స్థితిలో లేరు. అయితే తాను ఏం చేస్తానో ముందుగానే చెప్ప‌డం వ‌ల్ల టీడీపీ మరిన్ని హామీలు ఇవ్వొచ్చ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

రాజ‌కీయాల్లో వ్యూహాలు ఎప్పుడూ ర‌హ‌స్యంగా ఉంచుకోవాలి. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించాలి. ప్ర‌త్య‌ర్థి ఎత్తుగ‌డ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ వ్యూహాలు ర‌చించాలని కానీ జ‌గ‌న్ మాత్రం దీనికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు చెబుతున్నారు. రెండేళ్ల‌ ముందుగానే అన్నీ చెప్పేయ‌డం మాత్రం మంచిది కాద‌ని వివ‌రిస్తున్నారు. మొత్తానికి పథ‌కాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌వే అయినా.. ఇంత ముంద‌స్తుగా చెప్ప‌డం వ‌ల్ల ప్లీన‌రీ యావ‌రేజ్గా మిగిలిపోయింద‌ని విశ్లేషిస్తున్నారు. అల‌వికాని హామీలిచ్చి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న సీఎం చంద్ర‌బాబు.. అప్ప‌టికి మ‌రిన్ని హామీలు గుప్పించే అవ‌కాశ‌మూ లేక‌పోలేదు!!