ఆ మంత్రి బెదిరింపుల‌తో చంద్ర‌బాబుకు టెన్ష‌నే..టెన్ష‌న్‌

క‌డప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు అధికార పార్టీ నేత‌లు అధినేత చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మించారు. మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి నుంచి ఎమ్మెల్సీ.. రామ‌సుబ్బారెడ్డి వ‌ర‌కు అంద‌రూ బాబును బెదిరించేవారే అయిపోయారు. దీంతో ఇప్పుడు జ‌మ్మ‌ల‌మ‌డుగు రాజ‌కీయాలంటేనే బాబుకు ఒకింత కంప‌రంగా మారాయ‌ట‌. అయినా కూడా పార్టీని నిల‌బెట్టుకునేందుకు ఆయ‌న శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్నార‌ట‌. విష‌యంలోకి వెళ్తే.. జ‌మ్మ‌ల‌మ‌డుగు.. ఒక‌ప్పుడు వైసీపీకి పెట్ట‌నికోట‌. అయితే, అనూహ్యంగా చంద్ర‌బాబు దృష్టి క‌డ‌ప జిల్లాపై ప‌డింది. వైసీపీకి కంచుకోట‌గా ఉండే ఈ జిల్లాను త‌న చేతిలో పెట్టుకోగ‌లిగితే.. త‌న‌కు తిరుగు లేద‌ని భావించిన సీఎం.. ఆ దిశ‌గా పావులు క‌దిపారు.

2014లో వైసీపీ త‌ర‌ఫున గెలిచి.. బాబు ఆక‌ర్ష్ మంత్రంతో టీడీపీ సైకిలెక్కాడు ఆదినారాయ‌ణ రెడ్డి. ఆ త‌ర్వాత అసెంబ్లీ వేదిక‌గా బాబు డైరెక్ష‌న్‌లో జ‌గ‌న్ ప‌రువు తీసేశాడు. ఇక‌, బాబు అన్న‌మాట ప్ర‌కారం.. ఆదిని మంత్రిని చేశారు. అయితే, ఇప్పుడు ఆయ‌న త‌న కుమారుడిని కూడా రంగంలోకి దింపాల‌ని డిసైడ్ అయ్యాడు. త‌న‌యుడు సుధీర్‌రెడ్డిని త‌క్ష‌ణ‌మే ప్ర‌భుత్వం ఆస్ప‌త్రి పాల‌క‌మండ‌లికి చైర్మ‌న్‌గా నియ‌మించాల‌ని బాబుపై ఒత్తిడి తెస్తున్నాడ‌ట‌. అంతేకాదు, త‌న మాట ప్ర‌కారం త‌న కుమారుడికి చైర్మ‌న్ గిరీ ఇవ్వ‌క‌పోతే.. పార్టీ నుంచి, రాజ‌కీయాల నుంచి కూడా త‌ప్పుకొంటాన‌ని బెదిరిస్తున్నాడు.

ఇక‌, టీడీపీకే చెందిన సీనియ‌ర్ నేత రామ‌సుబ్బారెడ్డి.. 2014లో జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి ఆదినారాయ‌ణ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఈ య‌న కూడా ఇప్పుడు చంద్ర‌బాబుపై ఫైరైపోతున్నార‌ని స‌మాచారం. మొన్నామ‌ధ్య ఆదిని పార్టీలో చేర్చుకునే సంద‌ర్భంలో రామ‌సుబ్బారెడ్డిని సంతృప్తి ప‌ర‌చ‌డం కోసం గ‌వ‌ర్న‌ర్ కోటాలోని ఎమ్మెల్సీ సీటును ఇచ్చారు. అయితే, ఆయ‌న మాత్రం దీనికి సంతృప్తి చెంద‌డం లేదు. 2019లో ఎట్టి ప‌రిస్థితిలోనూ త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు స‌మాచారం. దీనికి త‌న అనుచ‌రుల‌ను వాడుకుంటున్న రామ‌సుబ్బారెడ్డి.. మొన్నామ‌ధ్య జ‌రిగిన మీటింగ్‌లో త‌మ నాయుకుడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాల్సిందేన‌ని రామ‌సుబ్బారెడ్డి అనుచ‌రులు పేర్కొన్నారు.

అదేస‌మ‌యంలో మాజీ మంత్రి శివారెడ్డి కుమార్తె హైమావతి కూడా రామసుబ్బారెడ్డికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వాలని, లేకుంటే తమ దారి తాము చూసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. జమ్మలమడుగులో నామినేటెడ్ పోస్టుల నుంచి ప్రతి పనిలో ఇద్దరూ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండటంతో అధికారులకు తలనొప్పిలా మారింది. ఒకవైపు మంత్రి, మరోవైపు ఎమ్మెల్సీ ఎవరి మాట కాదనలేక, ఎవరి మాట వినలేక అధికార యంత్రాంగం తల్లడిల్లి పోతోంది. జమ్మలమడుగులో ఇద్దరినీ కలిపితే తమకు తిరుగులేదని భావించిన పార్టీ హైకమాండ్ కు ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో పంచాయతీ వస్తూనే ఉంది. మరి చంద్రబాబు జమ్మలమడుగు గండం నుంచి ఎలా బయటపడతారో?