మేడ‌మీద అబ్బాయి TJ రివ్యూ

September 8, 2017 at 10:13 am

టైటిల్‌: మేడ‌మీద అబ్బాయి

జాన‌ర్‌: కామెడీ డ్రామా

నటీనటులు: అల్లరి నరేష్ , నిఖిల విమల్, అవసరాల శ్రీనివాస్, హైపర్ ఆది, సత్యం రాజేష్ త‌దిత‌రులు

సినిమాటోగ్రఫీ: కుంజుని ఎస్.కుమార్

మ్యూజిక్ : షాన్ రెహమాన్

ఎడిటింగ్‌: నందమూరి హరి

నిర్మాత: బొప్పన చంద్రశేఖర్

దర్శకత్వం: ప్రజీత్

సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ

రిలీజ్ డేట్‌: 8 సెప్టెంబ‌ర్‌, 2017

ఒక‌ప్పుడు యేడాది నాలుగైదు సినిమాలు చేస్తూ మూడు నాలుగు హిట్లు కొట్టే అల్ల‌రి న‌రేష్ కెరీర్ గ‌త నాలుగేళ్లుగా ఏ మాత్రం ఆశాజ‌న‌కంగా లేదు. వ‌రుస‌గా రొటీన్ సినిమాలు చేసి ప్లాపుల మీద ప్లాపులు కొడుతున్నాడు. ఇప్పుడు న‌రేష్ ఒక్క హిట్ కోసం ప‌రిత‌పించిపోతున్నాడు. ఈ క్ర‌మంలోనే మ‌ళ‌యాళంలో హిట్ అయిన ఓరు వ‌డ‌క్క‌న్ సెల్ఫీ సినిమాను తెలుగులో మేడ మీద అబ్బాయి పేరుతో రీమేక్ చేశారు. తెలుగు దన౦ వుట్టిపడుతున్న ఈ టైటిల్ వింటే పాత సినిమా పేర్లు గుర్తుకు వస్తాయి. సమాజంలో జరుగుతున్న పరిణామాలతో అల్లుకున్న ఈ కథ లో కామెడీ, థ్రిల్లర్, సస్పెన్స్ కూడా ముడిపడి ఉండేలా దర్శకుడు ప్రజీత్ కథ‌నం రాసుకున్నాడు. మ‌రి మ‌ళ‌యాళ్ వెర్ష‌న్‌లో హిట్ అయిన ఈ సినిమా ఈ రోజు తెలుగులో రిలీజ్ అయ్యింది. మ‌రి మేడ‌మీద అబ్బాయితో న‌రేష్ హిట్ కొట్టాడా ? ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు మెప్పించింది అన్న‌ది TJ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:

జీవితం మీద సీరియ‌స్ నెస్ లేకుండా తిరుగుతూ ఉంటాడు మ‌ధ్య‌త‌ర‌గతి కుర్రాడు శీను (అల్ల‌రి న‌రేష్‌). అత‌డి త‌ల్లిదండ్రులు మాత్రం చాలా క‌ష్ట‌ప‌డి మ‌రీ శీనును ఇంజ‌నీరింగ్ చ‌దివిస్తారు. అయితే శీను ఏకంగా 24 స‌బ్జెక్టులు ఫెయిల్ అవుతాడు. అమ్మానాన్నా తిడుతున్నా ప‌ట్టించుకోకుండా అమ్మాయిల‌కు సైట్ కొడుతుంటాడు. ఆ టైంలో శీను త‌న ప‌క్కింట్లోకి అద్దెకు దిగిన సింధు(నిఖిలా విమ‌ల్‌) ను లైన్లో పెట్టేందుకు ట్రై చేసినా ఆమె మాత్రం పట్టించుకోదు.

డైరెక్ట‌ర్ అవ్వాల‌ని శీను త‌న ఫ్రెండ్ బాబ్జీ (హైద‌ర్ ఆది)తో క‌లిసి షార్ట్ ఫిల్మ్ చేసినా అత‌డి డైరెక్ట‌ర్ కోరిక మాత్రం నెర‌వేర‌దు. ఇదిలా ఉంటే ఈ టైంలో సింధు క‌న‌ప‌డ‌క‌పోవడంతో ఊర్లో అంద‌రూ శీనుగాడు సింధూను లేవ‌దీసుకుపోయాడ‌ని అనుకుంటారు. శీను నిజం చెప్పినా న‌మ్మ‌రు. ఆ తర్వాత శీను ఏం చేశాడు ? మ‌రి సింధు ఏమైంది ? శీను-సింధు క‌లుసుకున్నారా ? లేదా ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

TJ విశ్లేష‌ణ‌:

కామెడీ స్ఫూఫ్‌లు ప‌క్క‌న పెట్టి అల్ల‌రి న‌రేష్ చేసిన ఈ సినిమాలో కూడా కొత్త‌ద‌నం లేదు. డైరెక్ట‌ర్ న‌రేష్ క్యారెక్ట‌ర్ ఎలివేష‌న్‌కే టైం తీసుకున్నాడు. ఇక ఫ‌స్టాఫ్‌లో ఉన్న కామెడీ కూడా సెకండాఫ్‌లో లేదు. హీరోయిన్ నిఖిలా విమ‌ల్ ప్రేమికుడిని వెతుక్కునే క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డింది. ఆమె సినిమాకు ఉప‌యోగ‌ప‌డిందేమి లేదు. ఇక సినిమాలో మేజ‌ర్ హైలెట్ ఎవ‌రంటే హైప‌ర్ ఆది. జ‌బ‌ర్ద‌స్త్ షోలో ఆక‌ట్టుకున్న ఆది ఈ సినిమాలోను త‌న‌దైన స్టైల్లో పంచ్‌లు, ప్రాస‌లు, కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇక ప్రైవేట్ డిటెక్టివ్‌గా అవ‌స‌రాల శ్రీనివాస్ చ‌క్క‌గా న‌టించాడు.

ఇక మ‌ళ‌యాళంలో హిట్ అయిన సినిమాను ఇక్క‌డ కూడా అలాగే తీయ‌డానికి ద‌ర్శ‌కుడు ప్ర‌జిత్ ట్రై చేశాడు. అయితే క‌థ‌లోని సోల్ మిస్స‌య్యింది. సినిమాలో చివ‌రి ప‌దిహేను నిమిషాలు త‌ప్ప‌, మ‌రేం ఉండ‌దు. సోష‌ల్ మీడియా వ‌ల్ల ఎలాంటి దుష్ఫ‌లితాలు వ‌స్తాయో అన్న చిన్న‌పాయింట్‌ను ప‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు సాగ‌దీసి సాగ‌దీసి కిచిడీ చేసేశాడు. సంగీతం, ఆర్ఆర్ గురించి మాట్లాడుకోవ‌డానికేం లేదు. ఎడిటింగ్ కూడా అలాగే ఉంది. నిర్మాణ విలువ‌లు సినిమాకు త‌గిన‌ట్టుగా ఉన్నాయి.

ఫైన‌ల్‌గా….

వ‌రుస ప్లాపుల్లో ఉన్న అల్ల‌రి న‌రేష్‌కు ఈ రీమేక్ ప్ర‌య‌త్నం కూడా క‌లిసిరాలేదు. న‌రేష్ అంటే బాగా అంటే చాలా బాగా ఇష్ట‌ప‌డే వారు మాత్రం ఓ సారి చూడొచ్చు. అంత‌కు మించి ఏం లేదు.

TJ ఫైన‌ల్ పంచ్‌: అల్ల‌రి న‌రేష్ సినిమా కాదు హైప‌ర్ ఆది షో

TJ ‘ మేడ‌మీద అబ్బాయి ‘ రేటింగ్‌: 2/ 5

 

మేడ‌మీద అబ్బాయి TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts