ఒక్క‌డు మిగిలాడు TJ రివ్యూ

November 10, 2017 at 9:26 am

టైటిల్‌: ఒక్క‌డు మిగిలాడు

నటీనటులు: మనోజ్, జెన్నీఫర్, అనీష ఆంబ్రోస్, సుహాసిని త‌దిత‌రులు

సినిమాటోగ్ర‌ఫీ: వి.కోదండ రామ‌రాజు

ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్

స్క్రీన్‌ప్లే: గోపీమోహ‌న్‌

మ్యూజిక్‌: శివ నందిగామ

నిర్మాత : లక్ష్మీ కాంత్ , ఎస్. ఎన్. రెడ్డి

దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూత‌క్కి

రిలీజ్ డేట్‌: 10 న‌వంబ‌ర్‌, 2017

మంచు మోహ‌న్‌బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ ప్ర‌తి సినిమాకు ఏదో కొత్త‌ద‌నం చూపించాల‌న్న తాప‌త్ర‌యం చూపిస్తాడు. అత‌డు ఎంచుకునే క‌థ‌ల్లో కొత్త‌ద‌నం ఉంటుంది. అయితే ప్ర‌తిసారి డైరెక్ట‌ర్ టేకింగ్ వ‌ల్లో, ద‌ర్శ‌క‌త్వం వ‌ల్లో అవి అనుకున్న స్థాయిలో మాత్రం స‌క్సెస్ అవ్వ‌డం లేదు. ఇక ఈ యేడాది గుంటూరోడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మ‌నోజ్ తాజాగా ఒక్క‌డు మిగిలాడు సినిమాతో ప్రేక్షుక‌ల ముందుకు వ‌చ్చాడు. శ్రీలంక‌కు చెందిన ఎల్టీటీఈ నేత వేలుపిళ్లై ప్రభాకరన్ పాత్ర చుట్టూ రాసుకున్న ఈ సినిమా మీద అంచనాలు లేకున్నా అమిత ఆసక్తి మాత్రం నెలకొంది. మ‌రి ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:

తన ప్రమోషన్‌ కోసం ఓ కాలేజ్‌ ప్రొఫెసర్‌ తన స్టూడెంట్స్‌ అయిన ముగ్గురమ్మాయిలను మోసం చేసి ఓ మినిస్టర్‌ (మిలింద్‌ గునాజీ) కొడుకుల దగ్గరకు పంపిస్తాడు. వాళ్లు ఆ మినిస్ట‌ర్ కొడుకుల నుంచి త‌ప్పించుకునే దారిలేక పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకుంటారు. ఈ నిజం బ‌య‌ట‌కు రాకుండా వాళ్లు ప‌ర్స‌న‌ల్ స‌మ‌స్య‌ల వ‌ల్ల చ‌నిపోయిన‌ట్టు సీన్ క్రియేట్ చేస్తారు. అస‌లు నిజం తెలుసుకున్న స్టూడెంట్ లీడ‌ర్ సూర్య (మంచు మ‌నోజ్‌) విద్యార్థి ఉద్య‌మానికి పిలుపునిస్తాడు. అయితే మినిస్ట‌ర్ త‌న బ‌లాన్ని వాడి ఉద్య‌మాన్ని అణిచివేసి సూర్య‌ను అరెస్టు చేయిస్తాడు. సూర్య‌ను ఎన్‌కౌంట‌ర్ చేసేందుకు వాళ్లు కుట్ర ప‌న్నుతారు. మ‌రి సూర్య వారి కుట్ర‌ల‌ను ఎలా ప‌సిగ‌ట్టాడు ? వాళ్ల నుంచి ఎలా త‌ప్పించుకున్నాడు. సూర్య‌కు శ్రీలంక శరణార్థలు కోసం పోరాడిన విప్లవనాయకుడు పీటర్‌ (మంచు మనోజ్‌)కు సంబంధం ఏంటి..? ఈ పోరాటం ఎలా మ‌లుపులు తిరిగి ఎలా ముగిసింది ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

న‌టీన‌టుల పెర్పామెన్స్ & TJ విశ్లేష‌ణ :

వైవిధ్య‌మైన క‌థ‌లు ఎంచుకుంటూ రిస్క్ చేస్తుంటాడు. ఈ నేప‌థ్యంలోనే ఒక్క‌డు మిగిలాడు సినిమాకు కూడా అదే త‌ర‌హాలో కొత్త క‌థ‌ను ఎంచుకుని మ‌రోసారి ఎట్రాక్ట్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. అటు విద్యార్థి నాయ‌కుడిగాను, ఇటు ఎల్‌టీటీఈ నాయ‌కుడిగాను రెండు పాత్ర‌ల్లో చాలా వేరియేష‌న్ చూపించాడు. ఎమోష‌న‌ల్‌గా క‌దిలించాడు. ఇక సినిమాలో మ‌రో కీల‌క‌పాత్ర‌లో క‌నిపించిన ద‌ర్శ‌కుడు అజయ్ ఆండ్రోస్ త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేశాడు. సముద్రం మీద తెరకెక్కిన సన్నివేశాల‍్లో అజయ్‌ నటన సినిమాకు ప్లస్‌ అయ్యింది. మిగిలిన వాళ్ల‌లో సిన్సియ‌ర్ కానిస్టేబుల్‌గా పోసాని కృష్ణ‌ముర‌ళీ, జ‌ర్న‌లిస్టుగా అనీషా ఆంబ్రోస్ మెప్పించారు. ఇతర పాత్రల్లో సుహాసిని, మిలింద్‌ గునాజీ, బెనర్జీ తమ పాత్రలకు న్యాయం చేశారు.

శ్రీలంక‌లో శ‌ర‌ణార్థులు ఎదుర్కొంటోన్న ఇబ్బందులు అక్క‌డ వాళ్లు ప‌డుతోన్న క‌ష్టాలు, వాళ్లు త‌ప్పించుకుని వ‌చ్చే ప్ర‌య‌త్నంలో ఎలా ప్రాణాలు కోల్పోతున్నారో ఈ సినిమాలో చూపించాడు. శ్రీలంక పోరాటం నేపథ్యంలో తెరకెక్కించిన సన్నివేశాల్లో పాత్రల నటన చాలా డ్రమెటిక్ గా అనిపించింది. సినిమాలో వాస్త‌విక‌త‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌డంతో ఇది సినిమాగా క‌న్నా డాక్యుమెంట‌రీనా ? అన్న డౌట్ వ‌చ్చేసింది. సాంకేతికంగా సినిమా సోసోగా ఉంది. ఇక విద్యార్థి నాయ‌కుడి పాత్ర‌కు త‌గ్గ ఎలివేష‌న్ క‌న‌ప‌డ‌దు. ద‌ర్శ‌కుడు ఏదో అవేద‌న‌ను చెప్పాల‌నుకున్నాడని అర్థ‌మైంది కానీ..ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుందా అని చెప్ప‌లేం.

ప్ల‌స్‌లు (+):

– మంచు మనోజ్‌ నటన

– కథ

మైన‌స్‌లు(-):

– ర‌న్ టైం

– ఎక్కువైన డ్రామా

ఫైన‌ల్‌గా…

ఒక్క‌డు మిగిలాడు ఓ డాక్యుమెంట‌రీ

TJ ఒక్క‌డు మిగిలాడు రేటింగ్‌: 1.5 / 5

 

ఒక్క‌డు మిగిలాడు TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts